Share News

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

ABN , Publish Date - May 17 , 2026 | 04:43 AM

బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ఇటీవల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భౌతిక బంగారం కొనుగోళ్లకు...

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ఇటీవల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భౌతిక బంగారం కొనుగోళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెడుతున్నారు. ఇలాంటి వారికి గోల్డ్‌ ఈటీఎఫ్‌లు (ఎక్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌), ఎన్‌ఎస్ఈ ఈజీఆర్‌(ఎలక్ర్టానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌)లు మెరుగైన సాధనాలుగా చెప్పవచ్చు. వీటితో కలిగే ప్రయోజనాన్ని పెట్టుబడి కోసం ఇన్వెస్టర్లు ఎంచుకోవచ్చు. ఈ రెండింటినీ క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) నియంత్రిస్తుంది కాబట్టి భద్రత విషయంలో భరోసా ఉంటుంది.

గోల్డ్‌ ఈటీఎఫ్‌

డిజిటల్‌ రూపంలో బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పించేదే గోల్డ్‌ ఈటీఎఫ్‌. డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతా ద్వారా ఈమేరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రతి గోల్డ్‌ ఈటీఎఫ్‌ యూనిట్‌ దాదాపు ఒక గ్రాము బంగారానికి సమానం. ఈ ఈటీఎఫ్‌ లు షేర్ల మాదిరిగా స్టాక్‌ ఎక్ఛేంజీల్లో ట్రేడవుతుంటాయి. మార్కెట్‌ సమయాల్లో వీటిని చాలా సులభంగా అమ్మవచ్చు, కొనవచ్చు. స్వచ్ఛత, భద్రత, మేకింగ్‌ చార్జీల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అయితే గోల్డ్‌ ఈటీఎఫ్‌లపై వార్షికంగా దాదాపు 0.5-1 శాతం నిర్వహణ చార్జీని ఫండ్‌ సంస్థలు వసూలు చేస్తుంటాయి. మన దేశంలో గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ధరల విషయంలో అత్యంత పారదర్శకత ఉంటుంది. ఈటీఎఫ్‌లను నేరుగా భౌతిక బంగారం రూపంలోకి మార్చుకోరాదు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే వారు వీటిని ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 12 నెలల్లోగా గోల్డ్‌ ఈటీఎఫ్‌లను విక్రయిస్తే వచ్చే లాభంపై మీ ఆదాయ స్లాబు ప్రకారం పన్ను ఉంటుంది. 12 నెలల తర్వాత విక్రయిస్తే 12.5ు లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ ఉంటుంది.


ఈజీఆర్‌

మన దేశంలో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అందుబాటులోకి వచ్చిన కొత్త మార్గమే ఎన్‌ఎస్‌ఈ ఎలక్ర్టానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ (ఈజీఆర్‌). వీటి ట్రేడింగ్‌ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. సెబీ నిబంధనల కింద ఈజీఆర్‌లను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ఇన్వెస్టర్లు డిజిటల్‌ రూపంలో బంగారాన్ని కొనవచ్చు. సెబీ ఆమోదం తెలిపిన వాల్ట్‌లలో కొనుగోలు చేసే బంగారానికి సమానమైన పరిమాణంలో భౌతిక బంగారాన్ని సురక్షితంగా భద్రపరుస్తారు. ఒక ఈజీఆర్‌ సాధారణంగా ఒక గ్రాము బంగారానికి సమానం. ఈజీఆర్‌లను షేర్ల మాదిరిగా క్రయవిక్రయాలు జరపవచ్చు. స్వచ్ఛత లేదా భౌతికంగా నిల్వ చేసుకోవడానికి సంబంధించిన ఆందోళనలకు తావుండదు. కావాలనుకుంటే ఇన్వెస్టర్లు తమ ఈజీఆర్‌లను ఎక్ఛేంజ్‌ నిబంధనల మేరకు అసలు బంగారం రూపంలోకి మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ దృష్ట్యా గోల్డ్‌ ఈటీఎఫ్‌లతో పోల్చితే ఈజీఆర్‌ ఆకర్షణీయమని చెప్పవచ్చు. బంగారాన్ని భౌతిక రూపంలో తీసుకున్నప్పుడు మాత్రమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎన్‌ఎస్‌ఈలో ఈజీఆర్‌ల ట్రేడింగ్‌ జరుగుతుంది. ఈజీఆర్‌ల కొనుగోలుకు డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతా ఉండాలి. ధరల విషయంలో అత్యంత పారదర్శకత ఉంటుంది. ట్రాన్సాక్షన్‌/స్టోరేజ్‌ చార్జీలు ఉంటాయి. ఎన్‌ఎ్‌సఈ ఈజీఆర్‌లపై భౌతిక బంగారం మాదిరిగా పన్ను ఉంటుంది. 24 నెలల్లోగా వచ్చే లాభంపై మీ ఆదాయ స్లాబు ప్రకారం పన్ను ఉంటుంది. 24 నెలల తర్వాత అయితే 12.5 శాతం లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ ఉంటుంది.

Updated Date - May 17 , 2026 | 04:43 AM