ఎమోషనే నా కథాబలం
ABN , Publish Date - Aug 23 , 2026 | 02:43 AM
‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి హిట్ల తర్వాత ఇటీవల ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర మరో ఘన విజయాన్ని అందుకున్నారు యువ దర్శకుడు వెంకీ అట్లూరి...
సండే సెలబ్రిటీ
‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి హిట్ల తర్వాత ఇటీవల ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర మరో ఘన విజయాన్ని అందుకున్నారు యువ దర్శకుడు వెంకీ అట్లూరి. ప్రయోగాలకు వెరవక, కమర్షియల్ హంగుల కన్నా కథలోని ఆర్గానిక్ ఎమోషన్‌నే నమ్ముకునే ఆయన.. ఈ చిత్రంతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా ‘నవ్య’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మానవ సంబంధాల నేపథ్యంలో హృదయానికి హత్తుకునే కథలను తెరకెక్కించే తన శైలి గురించి, వరుస విజయాల వెనుక ఉన్న సూత్రాల గురించి మనసు విప్పి మాట్లాడారు.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నారు. వరుస విజయాల తర్వాత మీ అనుభూతి ఏమిటి?
నిజంగా చాలా సంతోషంగా ఉంది. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’.. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’... ఇలా వరుసగా మంచి ప్రాజెక్ట్‌లు కుదరడం, అవి ప్రేక్షకులకు నచ్చి విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఒక మేకర్‌గా ఇది నాకు మరింత ప్రోత్సాహాన్ని, బాధ్యతను ఇస్తుంది.
ధనుష్, దుల్కర్ సల్మాన్, ఇప్పుడు సూర్య... వీరంతా తమకంటూ సొంత శైలి ఉన్న వెర్సటైల్ నటులు. వీరిని హ్యాండిల్ చేయడం కష్టంగా అనిపించలేదా?
మీరు అన్నట్లు వాళ్లు నిజంగానే వెర్సటైల్ యాక్టర్స్. అయితే అలాంటి నటులతో పనిచేయడం, వారిని మేనేజ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్లు సిచ్యుయేషన్‌కి, కథకి చాలా త్వరగా అడాప్ట్ అయిపోతారు. ఒకసారి షూటింగ్ ప్రారంభమయ్యాక వాళ్లు స్టార్స్‌లా కాకుండా, తాము పోషిస్తున్న పాత్రలా మాత్రమే ఆలోచిస్తారు. అందుకే వాళ్లతో ప్రయాణం చాలా స్మూత్‌గా సాగిపోతుంది.
మీ కథల్లో పాత్రలు చాలా బలంగా ఉంటాయి. నటులను ఆ పాత్రల కోసం ఎలా పిక్ చేసుకుంటారు?
నేను సాధారణంగా కథ రాసుకునేటప్పుడు ఏ నటుడినీ మనసులో అనుకోను. 100 శాతం కథ పూర్తయ్యాకే దుల్కర్, సూర్య లేదా ధనుష్ వంటి స్టార్స్ దగ్గరకు వెళ్తాను. కథ పిచ్ చేసిన తర్వాత వాళ్లకు నచ్చితే, వారి బాడీ లాంగ్వేజ్‌కి, మ్యానరిజమ్స్‌కి తగ్గట్టు 10 నుంచి 20 శాతం చిన్న చిన్న మార్పులు చేస్తాను.
మీ సినిమాల్లో పాట, ఫైటు అని బ్రేకులు ఉండవు. మీ స్ర్కీన్‌ప్లే ప్రాసెస్ ఎలా ఉంటుంది?
నేను సినిమా సూత్రాలు లేదా స్ర్కీన్‌ప్లే రూల్స్ పెద్దగా ఫాలో కాను. ఒక సీన్ తర్వాత మరో సీన్ అలా రాసుకుంటూ వెళ్తాను. సీన్ రాస్తున్నప్పుడే డైలాగ్స్ కూడా రాసేస్తాను. ఇప్పుడు ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారింది. రిలాక్సేషన్ కోసమో, క్లైమాక్స్ ముందు హెవీగా ఉందనో పాటలు పెట్టే లెక్కలను ఆడియన్స్ చూడటం లేదు. ఒకవేళ ఐదు నిమిషాల వ్యవధిలో పది సీన్ల ఎమోషన్‌ను చూపించాలనుకుంటే, పది సీన్లు తీసే బదులు ఆ భావోద్వేగాన్నంతటినీ ఒక పాటలో క్యూములేటివ్‌గా చూపించవచ్చు. కథను బ్రేక్ చేసే పాటలు మాత్రం నా సినిమాలో ఉండకూడదనేది నా సూత్రం.
ఇప్పుడు అందరూ డిఫరెంట్ వరల్డ్స్ అంటుంటే... మీరు సింపుల్, కామన్ పాయింట్స్‌ను ఎలా నమ్ముతున్నారు?
మనం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నంత కాలం కొత్త ప్రపంచాన్ని సృష్టించామా? లేదా? అనేది వాళ్లు పెద్దగా పట్టించుకోరు. ప్రేక్షకులు కోరుకునే వినోదాన్ని, ఎమోషన్‌ను ఇస్తే వాళ్లు థియేటర్‌కు వస్తారు. దాని కోసం ఫ్యాటల్ అట్రాక్షన్స్ అక్కర్లేదు. బేసిక్ హ్యూమన్ ఎమోషన్ సరిగ్గా ఉంటే అది పెద్ద బంగ్లాలో ఉన్నా చూస్తారు, టు బెడ్‌రూమ్ ఇంట్లో ఉన్నా చూస్తారు. ఇక్కడ ప్లేస్ కాదు, ఎమోషన్ ముఖ్యం.
మీరు బాగా హ్యాండిల్ చేయగల ఎమోషన్ ఏది?
మానవ సంబంధాల మధ్య ఉండే ప్రతీ ఎమోషన్‌నూ నేను హ్యాండిల్ చేయగలను. ప్రత్యేకంగా ఒకటని చెప్పలేను కానీ, ‘హ్యూమన్ డ్రామా’ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతీ సీన్‌కు ఒక మూడ్ ఉంటుంది, ఆ మూమెంట్‌కి ఏ ఎమోషన్ కరెక్టో అది రాయడం నాకు ఇష్టం.
మీపై ఏ దర్శకుడి ప్రభావం ఎక్కువగా ఉంది?
మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు?
మణిరత్నం గారు! ఆయన సినిమాల్లోనే నేను తొలిసారిగా న్యాచురల్ అండ్ సింపుల్ రైటింగ్ చూశాను. ‘దళపతి’, ‘నాయకుడు’, ‘ఘర్షణ’, ‘మౌనరాగం’ లాంటి సినిమాలు నాకు బాగా ఇష్టం. భార్యాభర్తల మధ్య గొడవ అంటే సాధారణంగా సినిమాల్లో హెవీ డ్రామా చూపిస్తారు. కానీ మన ఇళ్లల్లో గొడవలు ఎంత సింపుల్‌గా ఉంటాయో, మణిరత్నం అలాగే చూపించారు. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం.
ప్రతిరోజూ పనిచేసేందుకు మిమ్మల్ని డైరవ్ చేసే మోటివేషన్ ఏంటి?
రోజూ పనిచేయడమే నా మోటివేషన్. రోజుకో కొత్త సీన్ రాయడం, మంచి డైలాగ్ అనుకోవడం, దాన్ని నాకు నచ్చిన వాళ్లతో పంచుకుని వాళ్ల వ్యాలిడేషన్ కోరుకోవడం... ఇవే నన్ను ముందుకు నడిపిస్తాయి.
ఏదైనా ఒక సీన్ అనుకున్నట్టు రాకపోతే లేదా తీయలేకపోతే నిరాశ చెందుతారా?
ఈరోజు ఒక సీన్ రాయలేకపోతే రేపో, ఎల్లుండో ఎక్కడో ఒకచోట అది మైండ్‌లో క్రాక్ అవుతుంది. ఇక తీసే విషయంలో అనుకున్నట్టు రాకపోతే రీషూట్ చేసుకుంటాం.
మీకు ఎమోషనల్ సపోర్ట్ ఎవరు?
నా మీద నేనే ఆధారపడతాను. ఎమోషనల్ సపోర్ట్ కోసం మరొకరిపై ఆధారపడటం అనేది చివరి ఆప్షన్ కావాలి. భావోద్వేగాల విషయానికి వస్తే ఒంటరిగానే వాటిని ప్రాసెస్ చేసుకోవడానికి ఇష్టపడతాను.
నిర్మాత సూర్యదేవర నాగవంశీతో మీకు అంత మంచి కంఫర్ట్ ఎలా కుదిరింది?
ఆయన ఇచ్చే స్వేచ్ఛే ప్రధాన కారణం. డిఫరెంట్‌గా ఆలోచించడానికి, కొత్త ప్రయత్నాలు చేయడానికి ఆయన ఇచ్చే ఫ్రీడమ్ వల్లే ఆ కంఫర్ట్ సాధ్యమైంది.
ఒక సినిమా నిర్మాణంలో ఏ క్రాఫ్ట్ చాలా ముఖ్యం?
ప్రతీ క్రాఫ్ట్ వందశాతం ముఖ్యం. మ్యూజిక్, మేకింగ్ అంతా సమపాళ్లలో కుదిరినప్పుడే ముందుకు వెళ్లాలి. ఒకవేళ సరిగ్గా కుదరకపోతే డబ్బులు వేస్ట్ చేసే కంటే, అన్ని క్రాఫ్ట్స్ సరిగా వచ్చేంత వరకు ఆగడమే బెటర్.
కెరీర్ ప్రారంభంలో ఎదురైన కష్టాలు?
అసిస్టెంట్ డైరెక్టర్‌గా, రైటర్‌గా ఉన్నప్పడు అందరిలాగే నాకూ సాధారణ కష్టాలు ఉన్నాయి. కానీ వాటిని గుర్తుపెట్టుకుని పనిచేయడం లాంటివి నా దగ్గర ఉండవు. అంత పెద్దగా చెప్పుకోదగ్గ నెగెటివ్ మూమెంట్స్ ఏమీ లేవు.
మీరు ఏ కేటగిరీకి చెందుతారు?
ఫిలిం మేకింగ్‌లో ఎలాంటి కొత్త మార్పు వచ్చినా స్వాగతించాల్సిందే. సంభాషణలు మినిమమ్‌గా, ఎఫెక్టివ్‌గా ఉండటం నాకు ఇష్టం. విజువల్ కూడా అప్పీలింగ్‌గా ఉండాలి. బహుశా అందుకేనేమో జానర్లు మారుస్తుంటా.
మీ తదుపరి ప్రాజెక్ట్ విశేషాలు ఏంటి?
ప్రస్తుతం కొత్త కథ రాసే పనిలో ఉన్నాను. త్వరలోనే వివరాలు చెబుతాను.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
ఓటీటీలు థియేటర్లను రీప్లేస్ చేశాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ నిజానికి ఓటీటీ అనేది టెలివిజన్‌ను రీప్లేస్ చేసింది. ఒకప్పుడు టీవీ షోల కోసం సమయానికి కూర్చునేవాళ్లం, ఇప్పుడు కంఫర్ట్‌ని బట్టి ఓటీటీలో చూస్తున్నాం. ప్రొడక్షన్ పరంగా ఓటీటీ ఒక ఎక్స్‌ట్రా కుషన్‌లా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఫిలిం మేకర్స్‌ను మరింత బాధ్యతాయుతంగా, కాంపిటీటివ్‌గా మారుస్తుంది.
నా ప్రపంచం చాలా చిన్నది. పరిశ్రమలో నలుగురైదుగురు స్నేహితులు మాత్రమే ఉన్నారు. వీరి చుట్టూనే నా లోకం తిరుగుతుంది. నేను బయట ఎక్కువ మందితో కలవను. అందుకే పరిశ్రమలోకి రాకముందు, వచ్చాక నా ప్రపంచంలో ఎలాంటి మార్పూ లేదు.
నాకూ కోపం వస్తుంది. ఎందుకంటే ఆ రోజు సినిమా మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ నేను జవాబుదారీ. టైమ్ వేస్ట్ కావడం, ఎవరైనా పని సరిగ్గా చేయకపోవడం నాకు నచ్చదు. సమయమే డబ్బు కదా! ఆ టైమ్‌లో కోపం వచ్చి అరుస్తుంటాను.
ఇవి కూడా చదవండి
ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్