ఈ నృత్య నాటకం వాత్సాయనుడికి నివాళి
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:47 AM
వాత్సాయన కామసూత్రను తనదైన శైలిలో నృత్య నాటికగా మలిచి, శిష్యులతో ప్రదర్శించబోతున్నారు ప్రముఖ కూచిపూడి నర్తకి... స్వాతి సోమ్‌నాథ్....
వినూత్నం
వాత్సాయన కామసూత్రను తనదైన శైలిలో నృత్య నాటికగా మలిచి, శిష్యులతో ప్రదర్శించబోతున్నారు ప్రముఖ కూచిపూడి నర్తకి... స్వాతి సోమ్‌నాథ్. ‘కామసూత్ర శృంగార శాస్త్రం కాదు... సామాజిక శాస్త్ర’మంటున్న ఈ నాట్యకారిణి ‘నవ్య’తో పంచుకున్న కబుర్లివి.
‘సృజనాత్మకతను ప్రదర్శించే వీలున్న కళల్లో నాట్యం ఒకటి. నాట్యంలో ఎవరి శైలి వారికి ఉంటుంది. ఒక తరంగాన్ని నేను ఒకలా ప్రదర్శిస్తే, వేరొకరు ఇంకోలా ప్రదర్శిస్తారు. కాబట్టి కూచిపూడి ప్రాథమిక సూత్రం దెబ్బతినకుండా, మరింత మెరుగుపరుచుకునే స్వేచ్ఛ డాన్సర్లు అందరికీ ఉంటుంది. అలా నేను కూచిపూడి నృత్య నాటకాన్ని రూపొందించుకున్నాను. ప్రత్యేకించి వాత్సాయన కామసూత్రను నృత్య రూపకంగా ప్రదర్శించాలనే ఆలోచన వెనక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది.
అదొక కనువిప్పు
ఎమ్‌ఫిల్ థిసీస్ లో భాగంగా పది పేజీల వ్యాసం రాయవలసి వచ్చింది. ఆ టాపిక్...సెక్సువాలిటీ టు స్పిరిట్యువాలిటీ ఇన్ ఇండియన్ హిందూయిజం. అంటే ‘భారతీయ హిందూధర్మంలో లైంగికత నుంచి ఆధ్యాత్మికత వరకూ’ అని అర్థం. ప్రత్యేకించి హిందూ సనాతన ధర్మంలో మోక్షప్రాప్తికి శృంగారం ఒక సాధనమని చెప్పబడింది. ఈ పుస్తకం మొదటి అధ్యాయంలో వాత్సాయనుడు నాలుగు పురుషార్థాల గురించి వివరించాడు. ధర్మం ప్రకారం అర్థం సంపాదించి, అర్థాన్నీ, కామాన్నీ ఆస్వాదిస్తే, మోక్షం ప్రాప్తిస్తుందని వివరించాడు. కామం పెడదారి పడితే రాజ్యాలు కూలిపోయి, వంశాలు ఎలా నాశనమైపోతాయో వివరించడానికి రావణుడు, కీచకుడి ఉదాహరణలను ఉటంకించాడు. అలా ఆ పుస్తకం చదివిన తర్వాత అది బూతు పుస్తకం కాదనీ, సమాజంలోని మానవ సంబంధాలకు సంబంధించిన సామాజిక శాస్త్రమనీ తెలిసింది. కానీ దురదృష్టవశాత్తూ అదొక అశ్లీల పుస్తకంగా పేరు పొందింది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఆ పుస్తక సారాన్ని భిన్నంగా అనువదించిన తీరు, దాన్లో ప్రచురించిన బూతు బొమ్మలే అందుకు కారణం. వందల ఏళ్లుగా అసలు పుస్తకం కనుమరుగైపోయి, వాణిజ్య కోణంలో రూపొందిన షార్ట్‌హ్యాండ్ పుస్తకాల వల్ల అసలైన వాత్సాయన కామసూత్ర పుస్తక ప్రయోజనం జనబాహుళ్యానికి దక్కకుండా పోయి, అదొక బూతు పుస్తకమనే అపోహ ప్రజల్లో నాటుకుపోయింది. దాంతో పుస్తకం పొందిన ఈ అపప్రదను తొలగించాలనిపించింది.
వాత్యాయనకు ఇదొక నివాళి
నిజానికి వాత్సాయన కామసూత్ర చదివినప్పుడు దాన్లో నాకెక్కడా బూతు కనిపించలేదు. సమాజంలో స్త్రీపురుషులు, భార్యాభర్తల ప్రవర్తన ఎలా ఉండాలి? అన్నదే ఈ పుస్తక ప్రధాన సారాంశం. లైంగిక క్రీడల గురించిన వివరణలు దీన్లో లేకపోలేదు. కానీ అదంతా శాస్త్రీయ దృక్పథంలో సాగుతుంది. సంకుచిత మనస్తత్వాలు లోపించిన పాత రోజుల్లో కామం, శృంగారాలను సౌందర్యంగా సంగ్రహించారు. లైంగిక క్రీడకు సూత్రబద్ధమైన మార్గం అనుసరించడం ఎంతో ముఖ్యం. ఆ సూత్రం పక్కదారి పట్టింది కాబట్టి నేటి తరం అనేక నేరాలకు పాల్పడుతోంది. అనేక ప్రతికూలతలను కనబరుస్తోంది. ఆత్మహత్యలూ, కుంగుబాట్లకూ లోనవుతోంది. కాబట్టి వాత్సాయన కామసూత్ర నృత్య నాటిక ద్వారా దాని అసలైన సారాన్ని ప్రదర్శించడం అవసరమని నేను భావించాను. అయితే అదొక సైన్స్ పుస్తకం. దాన్ని నాటికగా ప్రదర్శించడం క్లిష్టం. అయినా సవాలుగా తీసుకుని శిష్యులతో సాధన చేయించి నృత్య నాటికను రూపొందించాను. దీన్లోని డ్రామా కోణాన్ని తీసుకుని, నఖ, దంత క్షతాలను కవితాత్మకంగా వేదిక మీద చూపెడుతూ చివర్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు రాసిన అర్థనారీశ్వర స్తోత్రంతో ప్రదర్శన ముగించేలా నృత్య నాటికను రూపొందించాను. వాత్సాయనకు ఇదొక నివాళి అని అనుకోవచ్చు.
20 మంది శిష్యులతో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్‌ను స్థాపించింది. గత పదేళ్లుగా దీనికి నేను డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాను. ఇన్నేళ్ల నా ప్రయాణంలో అత్యద్భుతమైన విద్యార్థులను చూశాను. అలాంటి 20 మంది శిష్యులతో కామసూత్ర నృత్య నాటికను ప్రదర్శించబోతున్నాను. వీళ్లందరూ ఆ ట్రస్ట్‌కు చెందిన పిల్లలే! శ్రీకాకుళం, సీతంపేట, అరకుకు చెందిన విద్యార్థులే వీళ్లందరూ! ఈ పిల్లలు గతంలో యుకె, మలేషియాల్లో కూడా నాట్య ప్రదర్శనలిచ్చారు. వాత్సాయన అశ్లీలం, బూతు కాదనీ, శృంగారం ద్వారా మోక్షాన్ని అందుకునే మార్గమనీ, అదొక సామాజిక శాస్త్రమనే విషయాన్ని ఈ నృత్య నాటిక ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సంగీతంలోని సప్తస్వరాల చిహ్మాలు, భరతుడి నాట్య శాస్త్రంలోని నృత్తభంగిమల సహాయంతో ప్రపంచంలో ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించని విధంగా కామసూత్రను ప్రదర్శించి చూపించబోతున్నాం.’
గోగుమళ్ల కవిత
మా వారు సినీ నిర్మాత చావలి రవికుమార్. గత పదకొండేళ్లుగా శ్రీకాకుళంలోని సంప్రదాయం గురుకులంలోనే ఉంటున్నాను. పిల్లలు లేరు. బహుశా అందుకే ఏ పాత్రకు ఎవరు చక్కగా సూటవుతారో నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా డాన్సర్లను ఎంచుకోగలుగుతున్నానేమో! భర్త రవికుమార్ నాకొక గొప్ప ఆసరా! దాదాపు 15 ఏళ్ల తర్వాత, ఏప్రిల్ 13న, రవీంద్రభారతిలో ఇంత భారీ స్థాయి నృత్య నాటికను ప్రదర్శించబోతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. ముహూర్తం ఫిక్స్: కొప్పుల ఈశ్వర్
సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ
Read Latest AP News And Telugu News