నిశ్శబ్ద గీతం.. గ్రామీ సంచలనం
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:49 AM
‘వరువాయి...’ తమిళ మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు సుబ్రమణ్య భారతి కవిత్వానికి కర్ణాటక సంగీత శైలిలో ఆధునికంగా బాణీలు కట్టిన గీతం ఇది. ‘ధురంధర్-2’ లాంటి...
‘వరువాయి...’ తమిళ మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు సుబ్రమణ్య భారతి కవిత్వానికి కర్ణాటక సంగీత శైలిలో ఆధునికంగా బాణీలు కట్టిన గీతం ఇది. ‘ధురంధర్-2’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని వెనక్కు నెట్టి... ప్రతిష్ఠాత్మక ‘గ్రామీ అవార్డు’లకు నామినేట్ అయి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి తమిళ పాటగానే కాకుండా... ఈ ఏడాది భారత్ నుంచి నామినేట్ అయిన ఏకైక గీతంగానూ నిలిచింది. నిశ్శబ్దంగా వచ్చి... సంచలనం రేపిన ఇండిపెండెంట్ సాంగ్ ‘వరువాయి’ పుట్టుక వెనుక కథ ఇది.
‘ధురంధర్: ద రివేంజ్’... వివిధ విభాగాల్లో ఎనిమిది ఎంట్రీలు పంపినా ఒక్కటి కూడా గ్రామీ పురస్కారాలకు నామినేషన్ దక్కించుకోలేకపోయింది. భారీ తారాగణం, బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ర్టీ ఆల్‌టైమ్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇందులో సంగీతానిది ప్రత్యేక స్థానం. అవేవీ ‘గ్రామీ’ని మెప్పించలేకపోయాయి. కానీ ఎలాంటి హడావుడి లేకుండా, ఏ కార్పొరేట్ లేబుల్ అంటించుకోకుండా, హంగు ఆర్భాటాలకు దూరంగా ఈ ఏడాది ఆగస్టు 12న ఇండిపెండెంట్ సాంగ్‌గా విడుదలైంది ‘వరువాయి’. అదీ డిజిటల్ మాధ్యమాల్లో. అంతే నిశ్శబ్దంగా ‘ధురంధర్-2’ను పక్కకు నెట్టి, ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్‌ఫార్మెన్స్’ విభాగంలో గ్రామీ అవార్డులకు నామినేట్ అయింది. భారత్ నుంచి ఈ ఏడాది నామినేషన్ దక్కించుకున్న ఏకైక పాట కూడా ఇదే. నిజంగా ఇది ఎవరూ ఊహించనిది.
‘ముప్ఫై ఏళ్ల కృషికి గుర్తింపు’...
‘వరువాయి కన్నా’... అంటే ‘రారా కృష్ణయ్య’ అని. తమిళ మహాకవి, స్వరకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు అయిన సుబ్రమణ్య భారతి కృష్ణుడిపై భక్తి పారవశ్యంతో రాసిన కవిత్వమే ఈ గీతం. ప్రముఖ గాయకుడు, స్వరకర్త దేవన్ ఏకాంబరం దీనికి బాణీ కట్టారు. గాయని సుషా (సుభిక్ష రంగరాజన్)తో కలిసి ఆలపించారు. వీరితోపాటు పియానిస్ట్ అనిల్ శ్రీనివాసన్ కూడా దీని వెనుక కీలక పాత్ర పోషించారు. కర్ణాటక సంగీత శైలికి... ఆధునిక వాయిద్యాలను మేళవించి స్వరపరిచిన ఈ పాట నిడివి 3.26 నిమిషాలు. ‘‘దాదాపు మూడు దశాబ్దాలుగా సంగీతం రంగంలో నేను చేసిన కృషికి లభించిన గుర్తింపు ఇది. భారతికి, తమిళ సంగీతానికి దక్కిన విజయం’’ అంటూ గ్రామీకి నామినేట్ అయిన సందర్భంగా దేవన్ ఏకాంబరం సంతోషం వ్యక్తం చేశారు.
అలా మొదలైంది...
సుబ్రమణ్య భారతి రచించిన కవితలతో ఒక పూర్తి స్థాయి మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించే మహత్తర కార్యంలో దేవన్ నిమగ్నమయ్యారు. దీనిపై గాయని సుషాతో కలిసి పని చేస్తున్న క్రమంలో ‘వరువాయి’ ఆలోచనకు బీజం పడింది. ముందుగా సుషా దీని ప్రస్తావన తెచ్చారు. ‘‘కృష్ణుడిని కీర్తించే ‘వరువాయి’ పాట మా అమ్మ లక్ష్మీ రంగరాజన్ మదిలో నాటుకుపోయింది. ఓ సంగీత కచేరీలో విన్న అమ్మకు ఎంతగానో నచ్చి, ఆ పాటను నేర్చుకుంది. తరువాతి కాలంలో తనే నాకు నేర్పింది. దేవన్... సుబ్రమణ్య భారతి ఆల్బమ్‌కు సహకరించమని అడిగినప్పుడు మాటల సందర్భంలో నాకు ‘వరువాయి’ గుర్తుకువచ్చింది’’ అంటున్న సుషా తన ఐదేళ్ల వయసులోనే కర్ణాటక సంగీత అభ్యాసం ప్రారంభించారు.
షకీరాతో పోటీ...
‘దేశ్’ రాగంలో స్వరపరిచిన ‘వరువాయి’కి సుషా గాత్రం, దేవన్ ఆధునిక వాద్య సంగీతం మరింత ప్రత్యేకతను తీసుకువచ్చాయి. కర్ణాటక సంగీత సంప్రదాయాల వైభవానికి సమకాలీన శబ్దాలను మేళవించి రూపొందించిన ఈ గీతం ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. దేవన్ ‘విండ్స్ ఆఫ్ సంసారా, డివైన్ టైడ్స్, శయన్’ తదితర ప్రశంసలు పొందిన మ్యూజిక్ ఆల్బమ్స్‌కు పనిచేశారు. చాలా ఏళ్ల విరామం తరువాత మళ్లీ ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ ద్విభాషా చిత్రమైన ‘పట్టారై’ తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. గతంలో కూడా ఆయన ‘గ్రామీ’ తలుపు తట్టారు. 2021లో ‘ఎ వాక్ త్రూ బృందావన్’ ట్రాక్ కోసం ప్రయత్నిస్తే నామినేషన్ దక్కలేదు. కానీ ఈసారి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 500 ఎంట్రీల్లో టాప్-5లో నిలిచింది. వీటిల్లో షకీరా తదితర పాప్ స్టార్స్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటితో ‘వరువాయి’ పోటీపడుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్