Share News

మూత్రం మీద పట్టు కోల్పోతే...

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:00 AM

దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్‌ అవుతోందా? బాత్రూం చేరుకునేలోపే లీక్‌ అయిపోతోందా? ఈ సమస్యను మౌనంగా భరించవలసిన అవసరం లేదు. దీని గురించి సిగ్గుపడవలసిన...

మూత్రం మీద పట్టు కోల్పోతే...

యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌

దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్‌ అవుతోందా? బాత్రూం చేరుకునేలోపే లీక్‌ అయిపోతోందా? ఈ సమస్యను మౌనంగా భరించవలసిన అవసరం లేదు. దీని గురించి సిగ్గుపడవలసిన అవసరం అంతకన్నా లేదు. సమర్థమైన చికిత్సలతో ఈ సమస్యను సమూలంగా నివారించుకోవచ్చు

మూత్రవిసర్జన చేయవలసిన అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, బాత్రూం అందుబాటులో లేని సందర్భాల్లో మూత్రవిసర్జనను నియంత్రించుకోగలుగుతాం! కానీ కొందరు మహిళల్లో ఈ నియంత్రణ పట్టు తప్పుతుంది. దీన్నే ‘యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌’ అంటారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని చుక్కల మూత్రం లీక్‌ అయ్యే పరిస్థితిని ‘స్ట్రెస్‌ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌’ అంటారు. ఇంకొందరికి మూత్రవిసర్జన అవసరం తలెత్తిన వెంటనే, బాత్రూం దగ్గరకు చేరుకునేలోపే మూత్రం లీక్‌ అయిపోతూ ఉంటుంది. దీన్ని ‘అర్జెన్సీ ఇన్‌కాంటినెన్స్‌’ అంటారు. మహిళల్లో ఈ రెండిట్లో ఏదో ఒక సమస్య ఉండొచ్చు, లేదా రెండు రకాల సమస్యలూ కలిపి ‘మిక్స్‌డ్‌ ఇన్‌కాంటినెన్స్‌’ ఉండొచ్చు.

కారణాలు భిన్నం

రెండు రకాల ఇన్‌కాంటినెన్స్‌లకు వేర్వేరు భౌతిక, ఆరోగ్య కారణాలుంటాయి. అవేంటంటే....

మూత్రాశయం, గర్భాశయాలను వాటి వాటి స్థానాల్లో పట్టి ఉంచే కటి కండరాలు పటుత్వం కోల్పోయినప్పుడు, బలహీనపడిపోయినప్పుడు, స్ట్రెస్‌ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌ తలెత్తుతుంది. మూత్రాశయంలో ఉండే ‘డెట్రూజర్‌’ అనే కండరం అవసరానికి మించి ప్రేరేపితమవుతున్నప్పుడు, మూత్రాశయం కూడా అవసరానికి మించి చురుగ్గా మారినప్పుడు అర్జెన్సీ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌ తలెత్తుతుంది. అలాగే కటి కండరాల బలహీనతకు కూడా పలు కారణాలుంటాయి. కొత్త తల్లుల్లో, మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళల్లో స్ట్రెస్‌ ఇన్‌కాంటినెన్స్‌ కనిపిస్తూ ఉంటుంది. మెనోపాజ్‌ మహిళల్లో కండరాల పటుత్వానికి తోడ్పడే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ లోపించడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. బరువైన బిడ్డను కనడం, ఎక్కువ సమయం పాటు ప్రసవ నొప్పులు భరించడం, ప్రసవం కోసం ఎక్కువ శ్రమకు గురి కావడం, ప్రసవ సమయంలో జననాంగం దగ్గర కోత పెట్టవలసిరావడం... మొదలైన కారణాల వల్ల, కండరాలు శ్రమకు లోనై, కొత్త తల్లుల్లో కూడా స్ట్రెస్‌ ఇన్‌కాంటినెన్స్‌ తలెత్తుతుంది. మూత్రాశయం అవసరానికి మించి చురుగ్గా మారినప్పుడు, తరచూ మూత్రవిసర్జన చేయవలసి వస్తూ ఉంటుంది. దాంతో గంట గంటకూ మూత్రవిసర్జన చేయవలసి రావచ్చు. ఇలా రేయింబవళ్లూ సమస్య వేధిస్తూ ఉండొచ్చు. కొందర్లో అత్యవసరంగా మూత్రవిసర్జన చేయవలసిన అవసరం కూడా తలెత్తుతూ ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలే ఇందుకు ప్రధాన కారణం. కొందర్లో స్వతఃసిద్ధంగానే ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. నోరు ఎండిపోవడం, చేతులు చల్లబడడం లాంటి లక్షణాలతో పాటు కొందర్లో స్ట్రెస్‌ ఇన్‌కాంటినెన్స్‌ కూడా ఉంటుంది. అలాగే కొందరికి నాడీ సంబంధ సమస్యలున్నప్పుడు, మెదడు నుంచి ప్రసరించే సిగ్నల్స్‌లో అవరోధాలు ఉన్నప్పుడు, మధుమేహం వల్ల నాడులు దెబ్బతిన్నప్పుడు కూడా ఈ సమస్య వేధించవచ్చు.


5-Navya.jpg

పరిష్కారాలు సులభమే!

స్ట్రెస్‌ ఇన్‌కాంటినెన్స్‌ను సరిదిద్దుకోవడం సులభమే! అన్నిటికంటే ముందు ఒత్తిడి తగ్గించుకోవాలి. కొత్త తల్లులు ఈ సమస్య ఎదుర్కొంటున్నప్పుడు శరీర బరువు తగ్గించుకోవడం మీద దృష్టి పెట్టాలి. అలాగే కిగిల్‌ వ్యాయామాలు మొదలుపెట్టాలి. ఈ కటి వ్యాయామాలతో కొత్త తల్లులతో పాటు మెనోపాజ్‌ వయసు మహిళలకు కూడా ప్రయోజనం ఉంటుంది. అయితే ఏ కండరాలకు వ్యాయామం అందించాలో తెలుసుకుని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయగలిగితే, దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్‌ అయిపోయే సమస్య 70ు నుంచి 80ు అదుపులోకొస్తుంది. మెనోపాజ్‌ వయసు మహిళల్లో అత్యవసరంగా మూత్రవిసర్జన చేసే సమస్యను కటి వ్యాయామాలతో పాటు మందులతో సరిదిద్దుకోవచ్చు. ఈ ప్రయత్నాలేవీ ఫలితాన్ని కనబరచనప్పుడు, స్ట్రెస్‌ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌ను పరిష్కరించడం కోసం ‘స్లింగ్‌ ప్రొసిజర్‌’ను ఆశ్రయించాలి. ఈ చికిత్సలో భాగంగా యురెత్రా ద్వారా మెష్‌ను ఏర్పాటు చేసి లేదా, శరీర కణజాలంతోనే ‘అటొలాగస్‌ స్లింగ్‌ ప్రొసిజర్‌’ ద్వారా సమస్యను సరిదిద్దవచ్చు. అర్జెన్సీ ఇన్‌కాంటినెన్స్‌ లో మందులతో సమస్య పరిష్కారం కాని సందర్భాల్లో, మూత్రాశయాన్ని రిలాక్స్‌ చేయడం కోసం బొటాక్స్‌ ఇవ్వవలసి వస్తుంది. అంతిమంగా అరుదుగా కొందరికి మాత్రమే సర్జరీ అవసరమవుతుంది.

మౌనం వీడి...

మూత్రం మీద పట్టు కోల్పోయిన మహిళలు ఆ సమస్యను మౌనంగా భరించవలసిన అవసరం ఏమాత్రం లేదు. దాన్నొక సిగ్గుపడే విషయంగా, అవమానకరమైన అంశంగా భావించవలసిన అవసరం అంతకన్నా లేదు. ఈ సమస్యతో బయటి పనులు, వేడుకలు, ప్రయాణాలు మానుకుని ఇంటికే పరిమితం కావలసిన అవసరం లేదు. మౌనం వీడి, యూరాలజి్‌స్టను కలిసి, వారి సూచనల మేరకు నడుచుకుని, సమస్యను సరిదిద్దుకుని, సౌకర్యవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు.

డాక్టర్‌ దీప్తి సురేఖ

కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్‌,

ఎఐఎన్‌యు,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌

ఇవీ చదవండి:

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

Updated Date - Jun 16 , 2026 | 01:00 AM