ఓటమి పంచిన వెలుగు
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:02 AM
ఎనిమిదేళ్ల ఐఏఎస్ కలల ప్రయాణం నెరవేరకపోవడం ఆమెను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేసినా ఆ ఒక్క వైఫల్యం జీవితానికి ముగింపు కాదని శ్రుతి శ్రీవాస్తవ నిరూపించారు. 2024 యూపీఎస్సీ తుది ఫలితాల...
ఎనిమిదేళ్ల ఐఏఎస్ కలల ప్రయాణం నెరవేరకపోవడం ఆమెను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేసినా ఆ ఒక్క వైఫల్యం జీవితానికి ముగింపు కాదని శ్రుతి శ్రీవాస్తవ నిరూపించారు. 2024 యూపీఎస్సీ తుది ఫలితాల జాబితాలో తన పేరు లేకపోవడంతో నిలువునా కుంగిపోయిన ఆమె.. మానసిక సంఘర్షణను జయించి తన జీవితానికి అసలైన అర్థాన్ని కనుగొన్నారు. ‘సశక్తికరణ్ ఫౌండేషన్’ ద్వారా గ్రామీణ చిన్నారుల చదువుకు, నిరుపేద మహిళలకు అండగా నిలుస్తున్నారు.
నా చిన్నతనమంతా మధ్యప్రదేశ్‌లోని చిన్న చిన్న పట్టణాల్లో సాగింది. నా తల్లిదండ్రులు ఓం ప్రకాష్ శ్రీవాస్తవ, భారతి శ్రీవాస్తవ. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం వల్ల తరచూ బదిలీలు అయ్యేవి. ఆ రోజుల్లో నా స్నేహితుల్లో చాలామంది దినసరి కూలీలు, ఇళ్లల్లో పనిచేసే కార్మికుల పిల్లలు. వారందరిలో ఒక నిరుపేద స్నేహితురాలి జ్ఞాపకం నా మనసుపై చెరగని ముద్ర వేసింది. ఆమె తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. తండ్రి కూలీ. ఆ చిన్నారి బడికి వెళ్లేముందు, తిరిగొచ్చిన తర్వాత ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం వంటి అన్ని పనులూ ఒంటరిగానే చూసుకునేది. అంత భారం మోస్తూ కూడా సాయంత్రం వేళల్లో ఏమీ ఎరగనట్లు మాతో ఆడుకోవడానికి వచ్చేది. నేను అన్ని సౌకర్యాలున్న పాఠశాలకు వెళ్తే, నా స్నేహితురాలు ఏ వసతులూ లేని ప్రభుత్వ బడికి వెళ్లేది. ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు చెప్పరని ఆమె చెబుతుంటే బాధగా అనిపించేది. కొందరికే అన్ని అవకాశాలు ఎందుకు లభిస్తాయి? మిగిలిన వారికి ఎందుకు దక్కవు? చిన్నారి భవిష్యత్తు వారు పుట్టిన ప్రాంతం ఎందుకు నిర్ణయించాలి? అనే ప్రశ్నలు నన్ను తొలిచేసేవి.
ఆత్మన్యూనత తొలగిన వేళ
ఒకవైపు సమాజంలోని అసమానతలు చూస్తున్న నాకు.. వ్యక్తిగతంగానూ కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఐదారేళ్ల వయసులో నా శరీర ఛాయపై బంధువులు చేసిన వ్యాఖ్యలు నా మనసును తీవ్రంగా గాయపరిచాయి. ఆ తర్వాత పెద్ద బడుల్లో చదివేటప్పుడు సంపన్న కుటుంబాల విద్యార్థుల నుంచి ఎదుర్కొన్న అవమానాలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. అయితే, 2012లో ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చేరడం నా జీవితాన్ని మలుపుతిప్పింది. విభిన్న ప్రాంతాలు, సంస్కృతుల నుంచి వచ్చిన విద్యార్థుల మధ్య నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను. తత్వశాస్త్రం చదవడం వల్ల ప్రతి విషయాన్నీ మూఢంగా కాకుండా తార్కికంగా విశ్లేషించడం నేర్చుకున్నాను. అంతకంటే ముఖ్యంగా, నల్లని ఛాయ ఉన్నప్పటికీ ఎంతో ప్రజ్ఞతో, ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతున్న మహిళలను అక్కడ చూసి, లోపం నాలో లేదని, సమాజం చూసే చూపులోనే ఉందనే సత్యాన్ని గ్రహించి ఆత్మన్యూనతను వదిలించుకున్నాను.
‘చహెల్’ ఇచ్చిన ఆశయం
కళాశాల మొదటి సంవత్సరంలోనే ‘చహెల్’ అనే స్వచ్ఛంద సంస్థతో నాకు పరిచయం ఏర్పడింది. విద్యార్థులందరం కలిసి సమీపంలోని బస్తీల్లో ఉండే చిన్నారులకు ఉచితంగా పాఠాలు చెప్పేవాళ్లం. నాణ్యమైన విద్య అందక ఎంతమంది పిల్లల భవిష్యత్తు అంధకారమవుతోందో నేనక్కడ చూశాను. చిన్ననాటి నా ప్రశ్నలకు అక్కడే సమాధానం దొరికింది. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు పాలనా వ్యవస్థలో భాగం కావడమే సరైన మార్గమని అనిపించింది. దీంతో 2016 నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాను.

క్షణంలో కూడిన ఏడేళ్ల తపస్సు
2016 నుంచి 2023 వరకు ఏడేళ్లపాటు నా ప్రపంచమంతా యూపీఎస్సీ పరీక్షే అయింది. ఆరు ప్రయత్నాల్లో ప్రతి ఏటా విజయం ముంగిట బోల్తాపడేదాన్ని. 2020లో కుటుంబమంతా కరోనా బారినపడటం, నాన్న ఆసుపత్రిలో చేరడంతో పరీక్ష రాయలేకపోయాను. 2021లో మెయిన్స్ పరీక్షకు కొన్ని రోజుల ముందు నా కుడిచేతికి గాయమైంది. అయినా కట్టుకట్టుకుని నొప్పిని భరిస్తూనే పరీక్ష రాశాను. చివరికి 2023లో ప్రిలిమ్స్, మెయిన్స్ దాటి ఇంటర్వ్యూ దశకు చేరుకున్నాను. 2024లో తుది ఫలితాల రోజున నా ఫోన్‌ను పుస్తకాలపై అమర్చి, నేను సాధించబోయే విజయ క్షణాన్ని రికార్డు చేయాలనుకున్నాను. కానీ వెబ్‌సైట్‌లో ఫలితాల జాబితా ప్రత్యక్షమయ్యాక ఆ కెమెరా రికార్డు చేసింది నా గుండె పగిలిన దృశ్యాన్ని! ఆ జాబితాలో నా పేరు లేదు. నా కాళ్ల కింద భూమి కుంగిపోయినట్లయింది. నా ఇరవైయేళ్ల వయసంతా ఈ ఒక్క గమ్యం చుట్టూనే తిరగడంతో ఆ రోజు నా ఉనికిని, నా అస్తిత్వాన్నే పూర్తిగా కోల్పోయినట్టు అనిపించింది.
నిలబెట్టిన ప్రేమ
వరుస వైఫల్యాలు నన్ను తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఆ క్లిష్ట సమయంలో నా కుటుంబం నాకు కొండంత అండగా నిలిచింది. నా తల్లిదండ్రులు నాకు ఒక లేఖ రాస్తూ.. ‘భారత ప్రభుత్వ క్యాబినెట్ కార్యదర్శి ఎవరో ఈ దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ బాబా ఆమ్టే, వినోబా భావేల పేర్లు అందరికీ గుర్తుంటాయి. ఒక వ్యక్తి విలువను ఒక ఫలితం లేదా ర్యాంకు ఎప్పటికీ నిర్ణయించలేదు’ అని చెప్పారు. ఓటమి, విజయాలతో సంబంధం లేకుండా నన్ను ప్రాణంగా ప్రేమించే కుటుంబం ఉందనే భావన నాలో ధైర్యాన్ని నింపింది.
నిజమైన విజయం
నా చిన్నతనంలో నన్ను వేధించిన ప్రశ్నలకు ఈనాడు సమాధానం వెతుకుతున్నాను. రోజంతా పనిచేసి రాత్రి పడుకునేటప్పుడు ఒక మంచి పనిచేశాననే తృప్తి కలగడమే నా దృష్టిలో నిజమైన విజయం. నేను చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల ఒక్క చిన్నారి జీవితం మారినా అది నేను సాధించిన గొప్ప విజయంగా భావిస్తాను. యూపీఎస్సీ నన్ను అధికారిని చేయకపోవచ్చు. కానీ, నా జీవితానికి అసలైన అర్థాన్ని, గమ్యాన్ని ఇచ్చింది. మీ విలువను ఒక పరీక్షో, ఒక ర్యాంకో నిర్ణయించలేవు.. అవన్నీ లేనప్పుడు మీరు ఎలాంటి వ్యక్తిగా నిలబడ్డారనేదే మీ నిజమైన విలువ!
‘సశక్తికరణ్’తో పునర్జన్మ
నేను మానసికంగా కుదురుకుంటున్న సమయంలో నా ఐఏఎస్ మిత్రురాలు మృణాలిక తాను స్థాపించిన ‘సశక్తికరణ్ ఫౌండేషన్’ బాధ్యతలు నాకు అప్పగించింది. ఆ బాధ్యతను స్వీకరించడం అంటే ఇన్నేళ్లుగా నేను అనుసరించిన కలను వదిలిపెట్టి, నా అసలైన ఆశయం వైపు అడుగులు వేయడమే. నా భర్త గౌరవ్ పూర్తి మద్దతుతో మేము ఢిల్లీ నుంచి భోపాల్‌కు బస మార్చాం. ఈ రోజు సశక్తికరణ్ ఫౌండేషన్ ద్వారా 800 మందికి పైగా గ్రామీణ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. అలాగే, 30 మందికిపైగా నిరుపేద మహిళలకు వివిధ వృత్తి విద్యలో శిక్షణ ఇచ్చి వారు తమ సొంత కాళ్లపై నిలబడేలా శిక్షణ ఇస్తున్నాం.
ఈ వార్తలూ చదవండి
దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..
దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో హైజాక్ సంకేతాలు..