Share News

రాగిమాల్ట్‌ యశస్వినులు

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:36 AM

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే మన దేశపు యువత అక్కడ చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయడం సర్వసాధారణం...

 రాగిమాల్ట్‌ యశస్వినులు

సంకల్పం

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే మన దేశపు యువత అక్కడ చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయడం సర్వసాధారణం. మన దగ్గర మాత్రం చాలామంది ఇందుకు భిన్నంగా ఉంటారు. విలువైన సమయాన్ని కొందరు కాలక్షేపాలతో కరిగించేస్తుంటారు. కానీ, అనంతపురం నగరానికి చెందిన ఇద్దరు యశస్వినులు చదువుకుంటూనే ‘రాగిమాల్ట్‌‘ విక్రయిస్తూ స్వయం సమృద్ధికి బాటలు వేస్తున్నారు. రోజూ ఉదయం రెండున్నర గంటల పాటు స్థానిక పార్క్‌ వద్ద ఈ చిరు వ్యాపారం నిర్వహించి, ఆ తర్వాత కళాశాలలకు వెళ్లే ఈ ‘అనంత యశస్వినులు’ తమ అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.

నా పేరు బి.యశస్విని. బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. నాన్న రామకృష్ణ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నారు. అమ్మ రత్నమ్మ గృహిణి. నా బంధువు, స్నేహితురాలైన కె.యశస్విని ఫార్మ్‌-డి మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి నాగరాజు కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోనే ఉన్నారు. తల్లి అరుణజ్యోతి ఫ్యాన్సీ స్టోర్‌ నడుపుతున్నారు.

స్వయం సమృద్ధి ఆలోచన

మా రెండు కుటుంబాల్లోనూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. చదువుకు కావలసినవన్నీ మా తల్లిదండ్రులే చూసుకుంటున్నారు. అయితే, రోజూ ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా స్వయంసమృద్ధి దిశగా అడుగులు వేయాలనుకున్నాం. వేరే దేశాల్లో విద్యార్థులు పడే కష్టాన్ని, పొందే తృప్తిని మన సొంత ఊరిలోనే ఎందుకు అనుభవించకూడదనే ఆలోచన మాలో కలిగింది.

పార్క్‌ వద్ద ప్రణాళిక

చదువుకు భంగం కలగకుండా, సమయం వృథా కాకుండా ఉండేలా ఒక ప్రణాళిక వేసుకున్నాం. మా ఇంటికి దగ్గర్లోనే ఉన్న రాజీవ్‌ చిల్డ్రన్‌ పార్క్‌ వద్దకు రోజూ వందలమంది వాకింగ్‌కు వస్తుంటారు. ఉదయాన్నే రాగిమాల్ట్‌ తాగడం ఆరోగ్యానికి మంచిది కాబట్టి, దాన్నే విక్రయించాలని నిర్ణయించుకున్నాం.

పెట్టుబడి.. తయారీ

ఇద్దరం కలిసి 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాం. నాణ్యమైన రాగులు, ఆర్గానిక్‌ బెల్లం, డ్రైఫ్రూట్స్‌, సాల్ట్‌, పెప్పర్‌ వంటివి కొనుగోలు చేశాం. రోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి రాగులను పిండి పట్టించి, శుభ్రమైన కుండల్లో వేడివేడిగా ఉడికిస్తాం. ఒక కుండలో తీపి, మరో కుండలో కారం రాగిమాల్ట్‌ తయారు చేస్తాం.

రెండున్నర గంటలు

ఉదయం ఆరు గంటలకల్లా కుండలతో పార్క్‌ వద్దకు చేరుకుంటాం. 8.30 గంటల వరకు అంటే దాదాపు రెండున్నర గంటలపాటు రాగిమాల్ట్‌ విక్రయిస్తాం. రోజూ 40 నుంచి 50 గ్లాసులు విక్రయిస్తాం. సాల్ట్‌మాల్ట్‌ రూ. 40, స్వీట్‌మాల్ట్‌ రూ. 50కి విక్రయిస్తాం. రోజుకు రూ. 400 వరకు మిగులుతుంది. ఆ తర్వాత ఇళ్లకు వెళ్లి రెడీ అయి కాలేజీకి వెళ్తాం.


6-navya.jpg

సొంత సంపాదనతో సంతృప్తి

మా చదువుల ఖర్చులు అమ్మానాన్నలే చూసుకుంటారు. కానీ మా చిన్న చిన్న వ్యక్తిగత అవసరాలకు మాత్రం వారిపై ఆధారపడకుండా ఈ కష్టార్జితాన్ని వాడుకుంటున్నాం. స్వశక్తితో సంపాదించిన ఆ చిన్న మొత్తంలో లభించే ఆత్మవిశ్వాసం, సంతృప్తి ఎంతో గొప్పగా ఉంటాయి.

తల్లిదండ్రుల ప్రోత్సాహం

చదువుకునే అమ్మాయిలు రోడ్డు పక్కన రాగిమాల్ట్‌ అమ్మడం గురించి మా తల్లిదండ్రులు ఏమాత్రం సంకోచించలేదు. ‘మీ ఖర్చులకు మీరు సంపాదించుకుంటామంటే కాదంటామా?’ అని మమ్మల్ని ప్రోత్సహించారు. చిన్న వ్యాపారమైనా దీనివల్ల మార్కెట్‌ మెళకువలు, ఆర్థిక క్రమశిక్షణ అలవడుతాయని వారు భావించారు.

ఏ పనీ తక్కువ కాదు

మన అభివృద్ధికి ఏమాత్రం పనికిరాని పనులకు నేటి జెన్‌ జీ యువత దూరంగా ఉండాలి. నిజ జీవితంలో బాధ్యత తెలుసుకోవాలి. పని ఏదైనా సరే.. అందులో శ్రమించే గుణం ఉన్నప్పుడు ఏ పనీ తక్కువ కాదనే విషయాన్ని గ్రహించాలి. చదువుతో పాటు ప్రాక్టికల్‌ అనుభవం సంపాదించడం నేటి తరం ఆలోచనా విధానంలో భాగం కావాలి.

చంద్రశేఖర్‌, అనంతపురం

యువతకు స్ఫూర్తి

ఉదయం దొరికే కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల చదువుకు ఎలాంటి ఆటంకం ఉండదు. శ్రమలో ఆనందాన్ని వెతుక్కోవడం ఒక మంచి ట్రెండ్‌గా మారితే సమాజంలో ఎంతో మార్పు వస్తుంది. మేము వేసిన ఈ చిన్న అడుగు తోటి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపితే అంతకంటే ఆనందం ఏముంటుంది?

ఈ వార్తలనూ చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 01:36 AM