Share News

అదే నిజమైన స్వేచ్ఛ

ABN , Publish Date - Aug 14 , 2026 | 03:07 AM

రాజకీయపరమైన స్వాతంత్య్రం భౌతికంగా మనకు, మన దేశ సరిహద్దులకు విముక్తిని అందించింది. నిజమైన స్వేచ్ఛ మన మనసులకు విముక్తిని కల్పిస్తుంది. అహం, కోరికలు, కాలం చెల్లిన మానసిక ధోరణులు...

అదే నిజమైన స్వేచ్ఛ

రాజకీయపరమైన స్వాతంత్య్రం భౌతికంగా మనకు, మన దేశ సరిహద్దులకు విముక్తిని అందించింది. నిజమైన స్వేచ్ఛ మన మనసులకు విముక్తిని కల్పిస్తుంది. అహం, కోరికలు, కాలం చెల్లిన మానసిక ధోరణులు అనే బలమైన సంకెళ్ళ నుంచి మన ఆంతరాత్మకు లభించే సంపూర్ణమైన విముక్తే నిజమైన స్వేచ్ఛ. మరో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్న ఈ తరుణంలో ‘‘బాహ్యమైన స్వేచ్ఛను గెలుచుకున్నాం, కానీ వాస్తవానికి మనం నిజమైన స్వేచ్ఛలో జీవిస్తున్నామా?’’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం సముచితం. మిమ్మల్ని... మీ అంతరంగాన్ని... సరికొత్తదైన, అత్యుత్తమమైన ఒక ఫోన్‌లా ఊహించుకోండి. కొన్న వెంటనే అది అద్భుతంగా, శక్తిమంతంగా, వేగంగా, అనంతమైన సామర్థ్యంతో పని చేస్తుంది. కానీ కాలక్రమేణా ఏమవుతుంది? మీరు బరువైన యాప్‌లను (అహం) డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. దాగి ఉన్న కాష్‌ డేటాను, జంక్‌ ఫైల్స్‌ను (సంస్కారాలు) పోగు చేసుకుంటారు. ఏకకాలంలో అనేక బ్యాక్‌గ్రౌండ్‌ ప్రాసె్‌సలను (అంతులేని కోర్కెలు) నడవనిస్తారు. మీ ఫోన్‌ పాడైపోలేదు. దాని కోర్‌ ప్రాసెసర్‌ ఇప్పటికీ అద్భుతంగానే ఉంది. కానీ అది నెమ్మదిస్తుంది, వేడెక్కిపోతుంది, స్తంభించిపోతుంది. మీ ఆత్మ కూడా కచ్చితంగా అంతే. అక్కడ శక్తి ఉంది. కానీ ‘డిజిటల్‌ చెత’్త అనే పర్వతం కింద చిక్కుకుపోయింది. ఆధ్యాత్మిక సాధన అనేది ఆ చెత్త నిల్వను ఖాళీ చెయ్యడానికి ఫ్యాక్టరీ రీసెట్‌ చెయ్యడం లాంటిది.

‘మనకు నచ్చినది ఏదైనా చేసే అవకాశం ఉండడమే స్వేచ్ఛ’ అని భావిస్తూ ఉంటాం. వాస్తవానికి, మనకు కలిగే ప్రతి కోరికనూ వెంబడించడం మరింత లోతైన అంతర్గత బానిసత్వాన్ని సృష్టిస్తుంది. నిజమైన స్వేచ్ఛ అనేది అంతర్గతంగా ఉండాలి. దాన్నే ‘స్వేచ్ఛ నుంచి స్వేచ్ఛ’గా చారీజీ మాస్టర్‌ అభివర్ణించారు. దీని అర్థం ఏమిటంటే... మీ విలువలు చాలా దృఢంగా ఉన్నట్టయితే... ఎవరూ మిమ్మల్ని గమనించనప్పుడు కూడా మీరు సరైన మార్గాన్నే ఎంచుకుంటారు. సంతోషం కోసం శరీరం, మనసు లేదా అహం మీద ఆధారపడడం మానేస్తారు. దానికి బదులుగా... మీరు మీ అసలైన స్వభావంలో పూర్తిగా స్థిరపడతారు.


ఎలా తొలగిద్దాం?

మీ ఆధ్యాత్మిక వ్యవస్థలో ఏర్పడిన అవరోధాలను తొలగించాలంటే ప్రతిరోజూ స్పృహతో కూడిన ప్రయత్నం అవసరం. దాని కోసం...

మనసును శుద్ధి చేసుకోండి: గతం తాలూకు భావోద్వేగ శిథిలాలను, ప్రవర్తనా సరళిని తొలగించడం కోసం క్రమం తప్పకుండా ధ్యానం చేయండి.

విచక్షణను ఉపయోగించండి: ఒక పని చేసే ముందు ఆగండి. తాత్కాలికంగా ఆహ్లాదం కలిగించేదానికి బదులు... సరైన దాన్ని ఎంచుకోండి.

మనసును అదుపు చేయండి: మనసు మిమ్మల్ని శాసించడానికి బదులు... అది మీకు సేవ చేసే విధంగా మీ ఆలోచనలను అవి ఉండాల్సిన చోట ఉంచండి.

జీవితంతో కలిసి కొనసాగండి: మీ చైతన్యాన్ని ఉన్నత సత్యాలతో అనుసంధానించండి.

రాజకీయ స్వేచ్ఛ.... మన పూర్వీకులు మనకు అందించిన వరం. ఆధ్యాత్మిక స్వేచ్ఛ మన వ్యక్తిగతమైన బాధ్యత. అంతర్గతమైన గందరగోళాన్ని తొలగించుకుంటే మన అసలైన స్వభావం భయం లేకుండా, శాంతిలో స్థిరపడి... సహజంగానే ప్రకాశిస్తుంది.


నాలుగు అంతర్గత అవరోధాలు

ఒక కార్డియాలజిస్టుగా... గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను నేను తరచూగా చూస్తూ ఉంటాను. అనేక సందర్భాలలో... దీనికి ప్రధానమైన కారణం జంక్‌ ఫుడ్‌. అది శరీరంలోని ధమనులు మూసుకుపోయేలా చేస్తుంది. అదే విధంగా అంతర్గతమైన కొన్ని అలవాట్లు మన చైతన్యాన్ని అడ్డుకుంటూ ఉంటాయి. అవి:

అహం: ఇది మనల్ని భౌతికమైన వస్తువుల కోసం నిరంతరం పరుగులు పెట్టేలా చేస్తుంది. మనసును నిలకడలేని కోతిలా మారుస్తుంది.

ఎంపికల్లోని వైవిధ్యం: భోగాలు, విలాసాలు మనకు మొదట్లో స్వేచ్ఛలా అనిపిస్తాయి. కానీ అవి వేగంగా మనల్ని మన ఇంద్రియాలకు బానిసలుగా మారుస్తాయి.

సంస్కారాల భారం: మనలో లోతుగా పాతుకుపోయిన గతం తాలూకు ముద్రలు, భావోద్వేగాలు మన అంతర్గతమైన కాంతిని మనసకబారుస్తాయి.

విడిపోవడం వల్ల కలిగే ఘర్షణ: మనం విశ్వ సత్యాలకు అనుగుణంగా జీవించనప్పుడు... సహజమైన జీవన స్రవంతిలో కాకుండా నిరంతర పోరాటంలో బతుకుతూ ఉంటాం.

డాక్టర్‌ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్‌

ట్రైనర్‌ హార్ట్‌ఫుల్‌నెస్‌, 9440087532

ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

Updated Date - Aug 14 , 2026 | 03:07 AM