కాసుల పేరుతో ట్రెండీగా...
ABN , Publish Date - Jun 22 , 2026 | 02:01 AM
ఒకప్పుడు రాణీతనానికి ప్రతీకగా నిలిచిన ‘కాసుల పేరు’ నేడు సరికొత్త హంగులద్దుకొని ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. గుండ్రని బంగారు కాసులను ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పొడవాటి హారంలా...
ఒకప్పుడు రాణీతనానికి ప్రతీకగా నిలిచిన ‘కాసుల పేరు’ నేడు సరికొత్త హంగులద్దుకొని ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. గుండ్రని బంగారు కాసులను ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పొడవాటి హారంలా తయారుచేస్తారు. ప్రతి కాసు మీద లక్ష్మీదేవి ప్రతిమ ఉంటుంది. బ్రైడల్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీల్లో ఈ కాసుల పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయ పోకడలకు మెరుగులు దిద్ది.. ఆధునిక మహిళల అభిరుచులకు అనుగుణంగా మరింత అందంగా కాసుల పేర్లను రూపొందిస్తున్నారు డిజైనర్లు. పొట్టి లేదా పొడుగు హారాల మాదిరి ఉండేవి, లేయర్స్ డిజైన్లు, నెక్లెస్ మోడల్స్... ఇలా ఎన్నో రకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. యువతులను సైతం ఆకట్టుకుంటున్న ఈ మోడరన్ కాసుల పేరు డిజైన్లపై ఓ లుక్కేద్దామా...
కంటె మోడల్
లక్ష్మీ కాసులను షార్ట్ నెక్లెస్‌లా జోడించి మధ్యలో చిన్న పెండెంట్‌ను అమరుస్తారు. దేవతా మూర్తులు, పూల ఆకృతులు, నెమళ్లు, హంసల డిజైన్లతో కూడిన పెండెంట్ ఈ మోడల్ ప్రత్యేకత. ఇది లంగా-ఓణీ, లెహంగాల మీద అందంగా కనిపిస్తుంది.
నెక్లెస్ మోడల్
మెడని అంటిపెట్టుకుని ఉండే గొలుసుకు లక్ష్మీ కాసులను వేలాడదీస్తారు. డిజైన్‌ను అనుసరించి గొలుసుకు మధ్య మధ్యలో కెంపులు, పచ్చలు, వజ్రాలు, బంగారు గుండ్లు అమరుస్తారు. చిన్న చిన్న పార్టీలు, ప్రత్యేక సందర్భాల్లో ధరిస్తే ఈ నెక్లెస్ మోడల్ కాసులపేరు సింపుల్‌గా గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అన్ని రకాల ఫ్యాన్సీ చీరల మీద అందంగా నప్పుతుంది.
లాకెట్ మోడల్
సంప్రదాయ కాసులపేరుకు పెద్ద లాకెట్‌ను జోడిస్తారు. కెంపులు, పచ్చలు, అమెరికన్ డైమండ్స్, ముత్యాలు పొదిగి బంగారు గుండ్లు కూర్చిన పెండెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేవతా మూర్తులతోపాటు నెమళ్లు, హంసలు, ఇతర ప్రకృతి చిహ్నాలు ఉన్న లాకెట్లను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ లాకెట్ మోడల్ కాసులపేరును పండుగలు, వివాహాది శుభకార్యాల్లో పట్టు చీరలు, లెహంగాల మీద ధరిస్తే గ్రాండ్ లుక్ వస్తుంది.
చెయిన్ మోడల్
పొడవాటి రెండు వరుసల గోలుసుకు మధ్య మధ్యలో కాసులను జోడిస్తారు. లేదంటే సింగిల్ చెయిన్‌కు లాకెట్‌ను అమర్చి దానికి ఇరువైపుల మూడు లేదా నాలుగు కాసులను హ్యాంగ్ చేస్తారు. డిజైన్ ప్రకారం నవరత్నాలు, బంగారు గుండ్లు పొదిగి మరింత ఆకర్షణీయంగా అందుబాటులోకి తెస్తున్నారు. వీటిని మధ్య వయసు మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. సన్నని గొలుసుకు దగ్గర దగ్గరగా కాసులు హ్యాంగ్ చేసిన మోడల్‌కు డిమాండ్ అధికంగా ఉంటోంది.
లేయర్స్ మోడల్
కాసులు అమర్చిన గొలుసులను రెండు లేదా మూడు వరుసలుగా జోడిస్తారు. మధ్య మధ్యలో ముత్యాలు లేదా పగడాలు కూర్చినవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్‌లో పొట్టి నెక్లెస్‌లు, పొడవైన హారాలు రూపొందిస్తున్నారు. సింపుల్, గ్రాండ్ డిజైన్లు రెంటినీ జెన్ జీ అమ్మాయిలు అధికంగా కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..