లినక్స్ శిఖరంపై తెలుగు తేజం
ABN , Publish Date - Mar 02 , 2026 | 05:30 AM
ప్రపంచంలో అతి శక్తిమంతమైన సాఫ్ట్‌వేర్ లినక్స్. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, ఏటీఎంలు, ‘అంతరిక్ష నౌకలు, స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు, డేటా సెంటర్లు, ప్రపంచవ్యాప్తంగా సూపర్ కంప్యూటర్లు,క్లౌడ్ కంప్యూటింగ్...
ప్రపంచంలో అతి శక్తిమంతమైన సాఫ్ట్‌వేర్ లినక్స్. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, ఏటీఎంలు, ‘అంతరిక్ష నౌకలు, స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు, డేటా సెంటర్లు, ప్రపంచవ్యాప్తంగా సూపర్ కంప్యూటర్లు,క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేధ... ఇవన్నీ లినక్స్ ఆధారంగా పని చేస్తాయి. ఈ అద్భుతమైన ఓపెన్ సాఫ్ట్‌వేర్ రూపకల్పన, నిర్వహణలో ‘లినక్స్ ఫౌండేషన్ ఫెలో’గా తెలుగు మహిళ షువాఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగానూ ఆమెచరిత్రకెక్కారు. అపూర్వమైన షువాఖాన్ ప్రయాణం గురించి ‘నవ్య’ ప్రత్యేక కథనం ఇది.
షువాఖాన్ స్వస్థలం ఒంగోలు. ఆమె తండ్రి ప్రభుత్వ పశువైద్యాధికారి కావడంతో... షువాఖాన్ చదువు రాష్ట్రంలోని పలుచోట్ల సాగింది. మారుమూల పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో, బాపట్ల ఏబీఎం, సరస్వతీ మెమోరియల్ పాఠశాలల్లో చదువుకున్నారు. మోదుకూరులో పదోతరగతి పూర్తి చేశారు. గుంటూరు మహిళా కళాశాలలో ఇంటర్ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకొని ఎదిగానని ఆమె సగర్వంగా చెప్పుకుంటారు. భారత్‌లో కొన్నేళ్ళు పని చేసిన తరువాత... 1988లో అమెరికాలోని కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సులో మాస్టర్స్ పూర్తి చేశారు. బే ఏరియాలో తొలి ఉద్యోగం అనంతరం ‘లూసెంట్ ఏటీ అండ్ టీ బెల్ ల్యాబ్స్’లో పని చేశాక... హ్యూలెట్ ప్యాకర్డ్ (హెచ్‌పి)లో పదమూడేళ్ళు సేవలు అందించారు. ఆ సమయంలోనే లినక్స్‌తో ఆమెకు ప్రత్యక్ష అనుబంధం ఏర్పడింది. హెచ్‌పీ హార్డ్‌వేర్‌ను లినక్స్‌తో అనుసంధానించే ప్రాజెక్టులో లినక్స్ డెవలపర్లకు నేరుగా సహకరించే అవకాశం వచ్చింది. 2007లో ఓపెన్ సోర్స్ రంగంలో అడుగుపెట్టారు. 2011 నుంచి స్వతంత్ర లినక్స్ కంట్రిబ్యూటర్‌గా మారారు. తరువాత అయిదేళ్ళు శాంసంగ్‌లో పని చేశారు. లినక్స్ ఫౌండేషన్ సాంకేతిక సలహాదారుల మండలి చొరవతో ప్రారంభించిన ‘కె-సెల్ఫ్‌టెస్ట్’ నిర్వాహకురాలుగా... 2014లో ఆ ఫౌండేషన్ సభ్యురాలుగా చేరారు.
ఏమిటీ లినక్స్ ఫౌండేషన్?
లినక్స్‌ను నడిపించే లినక్స్ కర్నెల్ నిర్వహణ సున్నితమైన, భద్రతాపరమైన అంశాలతో ముడిపడి ఉంది. కర్నెల్ కోడ్‌లో చిన్న పొరపాటు పెనుముప్పునకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాని నిర్వహణ, భద్రత కేవలం ముగ్గురి చేతుల్లో మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లతో పాటు... తమ వాణిజ్య ప్రయోజనాలకి సంబంధించిన అవసరాల మేరకు కంపెనీలు సమర్పించే కర్నెల్ కోడ్ అప్‌డేట్స్‌ను సమీక్షించడంతోపాటు... లినక్స్‌పై ఆధారపడే వారందరికీ లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను ఈ త్రిసభ్య బృందం పర్యవేక్షిస్తుంది. ఈ బృందానికి జీతభత్యాలు, చట్టపరమైన రక్షణ అందించే నిమిత్తం ‘లినక్స్ ఫౌండేషన్’ ఏర్పడింది. ఈ త్రిసభ్య బృందాన్ని ‘లినక్స్ ఫౌండేషన్ ఫెలో’లుగా పిలుస్తారు. లినక్స్ నుంచి లబ్ధి పొందే దిగ్గజ సంస్థలు ఈ ఫౌండేషన్‌లో సభ్యులుగా చేరి... కర్నెల్ అభివృద్ధికి ఆర్థిక, సాంకేతిక సహకారం అందించడంతోపాటు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. తద్వారా ‘లినక్స్ కర్నెల్’పై గుత్తాధిపత్యానికి తావులేకుండా...
కేవలం దాని అభివృద్ధిని, భద్రతను సమీక్షించే వనరులను మాత్రమే కల్పిస్తారు. అంటే కర్నెల్ డెవలపర్లకు, కార్పొరేట్ సంస్థలకు మధ్యవర్తిగా లినక్స్ ఫౌండేషన్ వ్యవహరిస్తుంది. అయినప్పటికీ కర్నెల్ వ్యవహారాల్లో ఈ ఫౌండేషన్ జోక్యం చేసుకోదు. లినక్స్ ఫౌండేషన్ ఫెలో.... ఓపెన్-సోర్స్ ప్రపంచంలో లభించే అత్యున్నత గౌరవం. ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలో దీర్ఘకాలంగా సేవలందించడం., విలువైన సాఫ్ట్‌వేర్ కోడ్ అందించడం, నాయకత్వం లాంటి వాటికి గుర్తింపుగా ఈ సభ్యత్వం లభిస్తుంది. 1991లో మొదలైన లినక్స్ ప్రయాణంలో ఇప్పటివరకూ కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఈ ఫెలో హోదా పొందారంటేనే దాని ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది. ఆ ముగ్గురు ‘లినక్స్ ఫౌండేషన్’ ద్వారా నేరుగా ‘లినక్స్ కర్నెల్’ అభివృద్ధికి పూర్తి సమయం కృషి చేస్తున్నారు. లినక్స్ ఫౌండేషన్ ఫెలో అయిన తొలి మహిళగా షువాఖాన్ ఘనత సాధించారు.
సాంకేతిక న్యాయమూర్తి లాంటి పాత్ర...
షువాఖాన్ 2019 నుంచి .లినక్స్ ఫౌండేషన్ ఫెలో’గా లినక్స్ కర్నెల్ నాణ్యతను కాపాడే బాధ్యత నిర్వహిస్తున్నారు. లినక్స్ కర్నెల్ మెయింటెయినర్‌గా వ్యవహరిస్తూ... లినక్స్ సెల్ఫ్‌టెస్ట్ ఫ్రేమ్ వర్క్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో విస్తారంగా ఉపయోగపడే యూఎస్బీ ఓవర్ ఐపీ డ్రైవర్ లాంటి సబ్ సిస్టమ్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. డెవలపర్లు తమ మార్పు వల్ల కర్నెల్‌కు ఎలాంటి నష్టం జరగదని నిర్ధారించుకోవడానికి వీలు కల్పించే కె-సెల్ఫ్‌టెస్ట్ రూపొందించడంలో, ఆండ్రాయిడ్ డ్రైవర్లను మెయిన్ లైన్ లినక్స్‌లో విలీనం చేసే ప్రయత్నాల్లో ఆమె కీలకపాత్ర పోషించారు. వీటి ఆధారంగా, ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలో సేవల ఆధారంగా ఆమెను ‘లినక్స్ ఫౌండేషన్ ఫెలో’గా ఎంపిక చేశారు. ‘‘రోజువారీ పనిలో భాగంగా... డెవలపర్లు రాసిన కోడ్‌ను సమీక్షిస్తాను. అది అప్పటికే ఉన్న సిస్టమ్‌తో సరిగ్గా కలుస్తుందా? దానివల్ల కర్నెల్ పాడవుతుందా? నాణ్యతా ప్రమాణాలకు అది అనుగుణంగా ఉందా? లాంటి అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటాను. ఇది ఒక సాంకేతిక న్యాయమూర్తి లాంటి పాత్ర’’ అంటారు షువాఖాన్. యువ డెవలపర్లను తీర్చిదిద్దడంలోనూ ఆమె శ్రద్ధ వహిస్తున్నారు. ‘లినక్స్ ఫౌండేషన్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్’ను స్థాపించి, నాయకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వందలాదిమంది కొత్త డెవలపర్లను కర్నెల్ అభివృద్ధిలోకి తీసుకువస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో రిమోట్‌గా పాల్గొనే అవకాశం ఉంది. స్టైఫండ్ కూడా ఇస్తారు. మహిళలు కర్నెల్ కమ్యూనిటీలో మరింత కీలకంగా వ్యవహరించేలా షువా చొరవ తీసుకుంటున్నారు.

కొరవడుతున్న ఆలోచన, అవగాహన
మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో తన అనుభవాల గురించి ఆమె మాట్లాడుతూ ‘‘కొందరు విద్యార్థులు కృత్రిమ మేధ ద్వారా తయారు చేసిన కోడ్‌ను సమర్పిస్తున్నారు. కానీ కోడ్ సమీక్ష సమయంలో దాని వెనుక ఉన్న అసలైన ఆలోచన, అవగాహన విద్యార్థుల్లో కొరవడుతున్నాయి. అందుకే ముందుగా మౌలిక అంశాలను లోతుగా అధ్యయనం చేశాక... అవసరమైన సాంకేతిక సహాయాన్ని వినియోగించాలి. సాఫ్ట్‌వేర్ రంగంలో తార్కిక, సృజనాత్మక అంశాలు రెండూ కలిసి ఉంటాయి. ఓపెన్ సోర్స్ రంగం నాకు స్వేచ్ఛ ఇచ్చింది. కార్పొరేట్ సంస్థల్లో వారి వాణిజ్య అవసరాలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లతో సమన్వయం చెయ్యడం, వారికి సహకరించడం, మెంటార్‌గా పని చెయ్యడం లాంటి అంశాలు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి’’ అని చెబుతున్నారు షువాఖాన్. సాంకేతికంగా కఠినమైన లినక్స్ కర్నెల్ లాంటి రంగంలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అక్కడ నుంచి గవర్నెన్స్ స్థాయికి ఎదగడం, ఓపెన్ సోర్స్ విలువలను కాపాడే ప్రయత్నం చేయడం, గ్లోబల్ టెక్ గవర్నెన్స్‌లో కీలక పాత్ర పోషించడం లాంటివి షువాఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చాయి.
కిలారు గోకుల్‌కృష్ణ, డాలస్, అమెరికా
ఏఐ... మంత్రదండం కాదు
ఓపెన్ సోర్స్ లేకుండా కృత్రిమ మేధ (ఏఐ) లేదు. ఎన్విడియా లాంటి సంస్థలు ఓపెన్ సోర్స్‌పై ఆధారపడి ఏఐ వ్యవస్థలు నిర్మిస్తున్నాయి. కానీ ఏఐని నడిపే మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎంలు) కొందరి గుప్పిట్లోనే ఉండడం ఆందోళనకరం. వాటిని ఓపెన్ సోర్స్‌గా మార్చే ప్రయత్నాలు ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఉంది. పదేళ్ళ క్రితమే లినక్స్ కమ్యూనిటీ ఏఐ ద్వారా స్వయంచాలితంగా కర్నెల్ సమస్యలు గుర్తించే పద్ధతులు ప్రయోగించింది. ఏఐ అనేది మంత్రదండం కాదు. సమీకృత సహకారం లేకుండా ఏదీ సాధించలేరు. ఏఐ మోడల్స్‌లో నిష్పాక్షికతకు పెద్దపీట వేయాలి. అది సాధించే సత్తా కేవలం ఓపెన్ సోర్స్‌కు మాత్రమే ఉంది. నా కోడ్ రివ్యూలలో ఏఐని వినియోగించడం లేదు. ఏదిఏమైనా ఏఐ ఫలాలు అందరికీ అందుబాటులోకి రావాలి.
- షువాఖాన్
ఆత్మసంతృప్తే నిజమైన విజయం
సమాజం ఆశించేది చేయడం కోసం పరుగులు పెట్టకండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీ కలలను తెలుసుకోండి. మీ బలాలు, బలహీనతలు గుర్తించండి. మీకు ఆనందాన్ని ఇచ్చే పనిని ఎంచుకోండి. ఆత్మ సంతృప్తి లేకపోతే ఏ విజయమూ నిలవదు.
షువాఖాన్
ఇవి కూడా చదవండి
భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి
గ్రోక్ జోస్యం! చెప్పిన తేదీకే మొదలైన యుద్ధం! మస్క్ రియాక్షన్ ఇదీ