Share News

పిల్లల ప్రేమే నడిపిస్తోంది

ABN , Publish Date - Aug 23 , 2026 | 02:35 AM

టీచర్‌గా పిల్లలకు పాఠాలు చెప్పాలన్నది ఆమె కల. అందుకోసం భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఆ అంకితభావమే ఆమెను జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా...

పిల్లల ప్రేమే నడిపిస్తోంది

టీచర్‌గా పిల్లలకు పాఠాలు చెప్పాలన్నది ఆమె కల. అందుకోసం భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఆ అంకితభావమే ఆమెను జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నిలబెట్టింది. ఆమె మరెవరో కాదు... బొంపల్లి భవాని. దేశవ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక కాగా వారిలో తెలంగాణ నుంచి ఈమె ఒక్కరే స్థానం దక్కించుకోవడం విశేషం.

ఈ సందర్భంగా ఆమె తన ప్రయాణాన్ని ‘నవ్య’తో ఇలా పంచుకున్నారు.

‘‘మా ఊరు గాంధారి. నేను ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి, గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదివాను. నేను చిన్నప్పటి నుంచీ టీచర్‌ అవ్వాలనుకున్నా. ఏ విషయం గురించైనా నాకు తెలిసినంత వరకు వివరంగా చెప్పేదాన్ని. అది గమనించి కాలేజీలో లెక్చరర్లు నన్ను ప్రోత్సహించారు. టీటీసీ ఎగ్జామ్‌ రాయమన్నారు. దీంతోపాటు ఎంసెట్‌ కూడా రాశాను. రెండిట్లో ఫ్రీ సీట్లు వచ్చాయి. నా కోరిక ప్రకారం మెదక్‌ డైట్‌లో రెండేళ్ల టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తిచేశాను. వెంటనే డీఎస్సీ రాసి మా ఊళ్లోనే టీచర్‌గా ఎంపికయ్యాను. ఊరివాళ్లంతా నామీద ఎంతో అభిమానం చూపిస్తుంటారు. ఎంతో నమ్మకంతో మా స్కూలుకి పిల్లలను పంపిస్తుంటారు. ప్రైవేట్‌ స్కూళ్లనుంచి కూడా పిల్లలు మా స్కూలుకి వస్తుంటారు. వారికి బాగా చదువుకోవడంతోపాటు వాళ్ల స్వభావంలో వచ్చిన మార్పుల గురించి చెబుతూ తల్లిదండ్రులు సంతోషపడుతుంటే గర్వంగా అనిపిస్తుంది. పెద్దవాళ్లను గౌరవించడం, సంస్కారం, దేశభక్తి లాటివాటిని పిల్లలకు నేర్పిస్తాం. గుడ్‌ మార్నింగ్‌, గుడీవినింగ్‌లకు బదులు వందేమాతరం చెబుతారు మా స్కూలు పిల్లలు. అటెండెన్స్‌ పలికేటప్పుడు జై హింద్‌ అంటారు.

గర్వంగా ఉంది...

మా స్కూల్లో చదువుకున్న విద్యార్థుల్లో చాలామంది ఆర్మీలో చేరారు. కొందరు ప్రొఫెసర్లుగా రాణిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, వ్యవసాయ విభాగాల్లో స్థిరపడినవారున్నారు. మా ఊళ్లోనే స్కూల్‌ అసిస్టెంట్లుగా కూడా పనిచేస్తున్నారు. ఏ వృత్తిలో ఉన్నా మా విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉండడం గర్వంగా అనిపిస్తుంది. నేను పద్దెనిమిదేళ్లుగా ఈ మారుమూల గ్రామంలో పనిచేస్తున్నా. నా కృషిని గుర్తించి ప్రభుత్వం ఈ విధంగా నన్ను ప్రపంచానికి పరిచయం చేయడమనేది నా జీవితంలోనే మరిచిపోలేని ఘటన.


పిల్లలే నడిపించారు

నామీద పిల్లలు చూపించే ప్రేమను మాటల్లో వర్ణించలేను. చికెన్‌ గున్యాతో బాధపడుతూ కూడా ఎక్కువగా సెలవులు తీసుకోలేదు. వాటర్‌ బాటిల్‌ మూత తీయడం కూడా కష్టంగా ఉండేది. అప్పుడు పిల్లలు అందించిన సహకారాన్ని మర్చిపోలేను. కొంతమంది పిల్లలైతే రోజూ గుడికి వెళ్లేవాళ్లు. నాకు జ్వరం తగ్గగానే దేవుడికి కొబ్బరికాయలు కొట్టారు. వారు చూపించే నిర్మలమైన ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తుందనుకుంటాను.

ప్రేమతోనే సాధించా...

‘మీరు ఇంత యాక్టివ్‌గా ఎలా ఉంటారు? స్కూల్‌ నుంచి వచ్చిన తరువాత కూడా ఎలా వర్క్‌ చేస్తారు? వ్యక్తిగత జీవితాన్ని వృత్తి పరమైన బాధ్యతలను ఎలా మేనేజ్‌ చేస్తారు?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. మా స్కూలు విద్యార్థుల అభిమానం, సహకారం వల్లనే అదంతా సాధ్యమవుతుందని చెబుతుంటాను. పిల్లలంతా ఒకే రకంగా ఉండరు. కొందరు బాగా అల్లరి చేస్తుంటారు. మా స్కూల్లో పదిమంది స్పెషల్‌ నీడ్‌ (ప్రత్యేక అవసరాలు కలిగిన) పిల్లలు ఉన్నారు. వీరి పట్ల చాలా ఓపికతో వ్యవహరించాలి. కథలు చెబుతూ వీడియోలు చూపిస్తూ వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తాం. మేము ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌లో ఉన్నప్పుడు బిచ్చమెత్తుకుంటున్న నలుగురు చిన్న పిల్లలు కనిపించారు. వీళ్లకి తల్లిదండ్రులు లేరు. 80 ఏళ్ల తాతమ్మ సంరక్షణలో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి పిల్లల బాగోగులు స్వయంగా చూసుకుంటామని చెప్పి ఒప్పించి స్కాలర్‌షిప్‌ ఇప్పిస్తామని బతిమలాడి మా స్కూల్లో చేర్పించాం. ఈ పిల్లల వల్ల చాలా సమస్యలు వచ్చాయి. వాళ్లు పుస్తకాలు, పెన్సిళ్లు దొంగతనం చేస్తుండడంతో మిగతా పిల్లల తల్లిదండ్రులు వచ్చి గొడవపడేవాళ్లు. అవన్నీ భరించాను. వారిని కోప్పడకుండా మంచి మంచి కథలు చెబుతూ వారిలో సత్ప్రవర్తనకోసం ఏడాదిన్నరపాటు కష్టపడ్డాను. ఇప్పుడు వాళ్లు మూడోతరగతి చదువుతున్నారు. చాలా క్రమశిక్షణగా ఉంటారు. ప్రేమ, అభిమానం, కేరింగ్‌తోనే పిల్లలను మార్చగలం.


ఆయన అండతోనే...

వృత్తిపరంగా ఇలా పూర్తి బాధ్యతలను నిర్వహిస్తున్నానంటే మా ఆయన సుధీర్‌ అందించే సహకారం వల్లనే. ఆయన హైదరాబాద్‌ ఐబీఎంలో సీనియర్‌ మేనేజర్‌. ఆయనకు కూడా టీచింగ్‌ అంటే చాలా ఇష్టం. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉన్నప్పుడు, వారాంతాల్లో కామారెడ్డికి వచ్చి స్కూలు పిల్లలకు కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ గురించి చెబుతుంటారు. 2008లో టీచర్‌గా చేరినప్పటి నుంచి నేను గాంధారి దాటలేదు. ఆయన హైదరాబాద్‌లోనే ఉండేవారు. లాక్‌డౌన్‌ తరువాతనే మేము కామారెడ్డిలో కలిసి ఉంటున్నాము’’.

పంచరెడ్డి ప్రశాంత్‌, కామారెడ్డి

వరుసగా అవార్డులు

పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గాను ఎన్నో అవార్డులు అందుకున్నాను. 2024లో జిల్లా అవార్డు వచ్చింది. 2025లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నాను. ప్రభుత్వం నుంచి అందిన రూ. 10 వేల నగదు ప్రోత్సాహకానికి నేను మరో రూ.10 వేలు కలిపి పాఠశాలకు కంప్యూటర్‌ సమకూర్చాను. ఫిన్‌లాండ్‌లో విద్యావిధానం పరిశీలన కోసం గత ఏప్రిల్‌లో ప్రభుత్వం పంపిన 28 మంది టీచర్ల బృందంలో నేను కూడా ఉన్నాను.

ఎలా వచ్చిందంటే...

నేను ఈ అవార్డు కోసం అప్లయ్‌ చేసుకున్నాక మూడు విడతలుగా జరిగిన ప్రక్రియలో 15 మంది టీచర్లు ఎంపికయ్యారు. ఢిల్లీ నుంచి ఓ ప్రతినిథి వచ్చి ఆరుగురిని షార్ట్‌లిస్ట్‌ చేశారు. ఆన్‌లైన్‌ జ్యూరీ ఇంటర్వ్యూలో నేను ఒక్కదాన్నే సెలక్టయ్యాను. ఆ ఇంటర్వ్యూలో మీ స్కూలు విద్యార్థులకు మంచి ర్యాంక్‌లు ఎలా వస్తున్నాయి? వాళ్ల భవిష్యత్తు కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అడిగారు. మా స్కూల్లో ఏటా పది నుంచి పదిహేను మంది విద్యార్థులు గురుకుల్‌దాస్‌, ఎంజీపీఎస్‌ ఎంట్రెన్స్‌లలో ర్యాంక్‌లు సాధిస్తున్నారు. విద్యార్థులకు సెలవు రోజుల్లో స్పెషల్‌ క్లాస్‌లు తీసుకుంటుంటాను. పోటీ పరీక్షకు అవసరమయ్యే ఈజీ టిప్స్‌ చెబుతుంటాను. ర్యాంక్‌ వస్తుందా? లేదా? అన్న విషయాన్ని పక్కన పెట్టి ముందుగా పోటీ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు చిన్నప్పటి నుంచే వివరించి చెబుతాను. అప్పుడు పిల్లలు పరీక్షలంటే భయపడరు. సబ్జెక్టును నేర్చుకోవడం మీదనే దృష్టి పెడతారు అని చెప్పాను.

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 02:36 AM