Share News

స్థిరమైన మార్పు కోసం

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:17 AM

విదేశాల్లో చదువు, ఉన్నతంగా స్థిరపడే అవకాశం... అన్నిటినీ వదిలిపెట్టి సామాజిక సేవకు అంకితమయ్యారు తేజస్విని. ఆమె స్థాపించిన సంస్థ వేలమంది మహిళలు, పిల్లల ఆరోగ్యం కోసం...

స్థిరమైన మార్పు కోసం

విదేశాల్లో చదువు, ఉన్నతంగా స్థిరపడే అవకాశం... అన్నిటినీ వదిలిపెట్టి సామాజిక సేవకు అంకితమయ్యారు తేజస్విని. ఆమె స్థాపించిన సంస్థ వేలమంది మహిళలు, పిల్లల ఆరోగ్యం కోసం, విద్య కోసం, ఉపాధి కల్పన కోసం కృషి చేస్తోంది. ఈ ఏడాది ‘గూంజ్‌ గ్రాస్‌రూట్స్‌ అవార్డ్‌’ అందుకున్న తేజస్విని స్ఫూర్తిమంతమైన ప్రయాణం ఇది.

‘‘సమాజానికి ఏదైనా చేయాలనే కోరిక నాలో హఠాత్తుగా వచ్చింది కాదు. అది చిన్న వయసులోనే మొదలైంది. బిహార్‌లోని జమాల్‌పూర్‌ మా స్వస్థలం. అక్కడ, డార్జిలింగ్‌లో నా బాల్యం గడిచింది. నాకు దాదాపు పదమూడేళ్ళు ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ గుర్తుంది. మా వంట మనిషి కుమార్తె ఒక రోజు మా ఇంటికి వచ్చింది. ఆమె గృహ హింస బాధితురాలు. ఆ సమయంలో మా అమ్మ ఇంట్లో లేదు. తన బాధలన్నీ ఆమె నాతో చెప్పింది. మా అమ్మ ఇంటికి వచ్చాక... ఆమెను మాతోపాటు ఉండనిద్దామని అమ్మను అడిగాను. ‘‘నువ్వు వేరొకరి జీవితాన్ని మార్చాలనుకుంటున్నప్పుడు... ఆ మార్పు తేగలిగే శక్తి నీలో ఎంత మేరకు ఉందో ఆలోచించావా?’’ అని అమ్మ అడిగింది. ఆ ప్రశ్నను అర్థం చేసుకొనే పరిపక్వత అప్పట్లో నాకు లేదు.

జవాబు తెలిసింది...

బ్రిటన్‌లో ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తి చేశాక... మహిళలపై అత్యాచారాలు, గృహహింసకు వ్యతిరేకంగా కొన్ని సంస్థలతో కలిసి లండన్‌లో కొంతకాలం పని చేశాను. మహిళల భద్రత, ఆరోగ్యం అనేవి వేర్వేరు అంశాలు కావనే అవగాహన నాలో కలగడానికి అది దోహదం చేసింది. మాస్‌ మీడియాలోనూ పీజీ డిగ్రీ తీసుకున్నాక... కొన్ని ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో ఉద్యోగాలు చేశాను. అయితే మన దేశంలో, ప్రత్యేకించి బిహార్‌ ప్రాంతంలో మహిళల కోసం, పిల్లల కోసం ఏదైనా చెయ్యాలని నిశ్చయించుకున్నాను. 2023లో సెలవుపై ఇండియాకు వచ్చాను. కొన్నాళ్ళు గ్రామాల్లో తిరిగి, పరిస్థితులను అధ్యయనం చేశాను. చాలాచోట్ల మహిళలకు నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి కనీసమైన అవగాహన లేదు. ఆశా కార్యకర్తల సహకారంతో... రీయూజబుల్‌ క్లాత్‌ ప్యాడ్స్‌ మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ లాంటివి కొందరికి అందజేశాను. నెల రోజుల తరువాత... వాటిని వినియోగించిన వారి స్పందన ఆశావహంగా ఉండడంతో... మరికొన్ని గ్రామాల్లో పంపిణీ చేశాను. ఆ కార్యకలాపాలను వ్యక్తిగతంగా కాకుండా... వ్యవస్థాగతంగా మార్చాలనుకున్నాను. అదే ఏడాది చివర్లో... కొందరు మిత్రులతో కలిసి ‘మురారి జ్యోతి వెల్ఫేర్‌ ఫౌండేషన్‌’ (ఎంజెడబ్ల్యూఎఫ్‌) అనే సంస్థను స్థాపించాను. చిన్నప్పుడు అమ్మ అడిగిన ప్రశ్నకు సమాధానం అప్పుడు నాకు తెలిసింది. ఎవరికైనా మీరు సాయం చేయాలనుకుంటే...వారికి నిజంగా అవసరమైనప్పుడు వారి జీవితంలో నిజమైన మార్పు తేగలిగే సామర్థ్యం, నిబద్ధత మీకు ఉండాలి. దానికి కేవలం సహానుభూతి మాత్రమే సరిపోదు. సమస్యను అర్థం చేసుకోవాలి. వాటి పరిష్కారాలపట్ల అవగాహన ఉండాలి. తగినన్ని వనరులు కావాలి. ఎంతోమంది సహకారం కావాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది.


3-navya.jpg

సంస్థ ఖర్చుల కోసం ఉద్యోగం...

ఎంజెడబ్ల్యూఎఫ్‌ ఖర్చుల కోసం కొన్నాళ్ళపాటు లండన్‌లో ఉద్యోగాన్ని కొనసాగించాను. బిహార్‌లో ఉన్న మిత్రులతో నిరంతరం మాట్లాడుతూ... సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించాను. నేను చదివిన ఎసెక్స్‌ యూనివర్సిటీ అధికారులకు, ఆరోగ్య రంగంలో పని చేస్తున్న ఒక కార్పొరేట్‌ సంస్థ అధికారులకు మా సంస్థ గురించి వివరించినప్పుడు... వారు సామాజిక కార్యక్రమాల కోసం ఉద్దేశించిన నిధులను మాకు ఇవ్వడానికి అంగీకరించారు. దాంతో మా సంస్థ మనుగడకు స్థిరత్వం వచ్చిందనిపించి... ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇప్పుడు పూర్తి సమయాన్ని ఎంజెడబ్ల్యూ

ఎ్‌ఫకే కేటాయిస్తున్నాను. మహిళల నెలసరి ఇబ్బందులను తీర్చడంతో ఆరంభమైన ఎంజెడబ్ల్యూఎఫ్‌ కార్యకలాపాలు ఈ మూడేళ్ళలో బహుముఖంగా విస్తరించాయి. ప్రభుత్వాసుపత్రులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. కేన్సర్‌ స్ర్కీనింగ్‌తో సహా వివిధ పరీక్షలను నిర్వహిస్తున్నాం. సర్వికల్‌ క్యాన్సర్‌, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, పోషకాహారలోపం... ఇలా వివిధ సమస్యలు ఉన్నవారికి ఉచిత వైద్యం, ఆర్థిక సహాయం అందేలా చూస్తున్నాం. ఇప్పటివరకూ దాదాపు నాలుగువేలమందికి పైగా మహిళలు, వందలమంది పిల్లలు వీటి ద్వారా లబ్ధి పొందారు. మరోవైపు... విద్య, ఉద్యోగకల్పన, స్వయం ఉపాధి అవకాశాల మీద దృష్టి పెట్టాం. పలు పాఠశాలల్లో పేద విద్యార్థులకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నాం.’’


అదే ప్రధానం...

ప్రస్తుతం ఖగారియా, భగల్పూర్‌ జిల్లాల్లో పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇతర ప్రాంతాల్లోనూ కొన్ని సంస్థలు మాతో కలిసి పని చేస్తున్నాయి. మహిళలు, పిల్లలతోపాటు పురుషులకు కూడా ఆరోగ్య తనిఖీలు చేస్తూ... కావలసిన గ్రామీణ స్థాయిలో సామాజిక, ఆర్థిక, ఆరోగ్యాభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలకు గుర్తింపుగా ఇచ్చే ‘గూంజ్‌ గ్రాస్‌రూట్స్‌ అవార్డు’ను ఈ ఏడాది జులైలో అందుకున్నాను. ఎంతమందికి సాయపడ్డామనే దానికన్నా... ఎందరి జీవితాల్లో నిలకడైన మార్పు తేగలిగామన్నదే ప్రధానమని నా నమ్మకం. మేము పని చేస్తున్న గ్రామాల్లో ఇదివరకటికన్నా మహిళలు, పిల్లల్లో అనారోగ్యాల శాతం తొంభైకి పైగా తగ్గింది. ఎంతోమందికి స్థిరమైన ఉపాధి లభించింది. మా కృషిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి ఇవన్నీ మాకు ప్రేరణగా నిలుస్తున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 04:17 AM