Share News

కట్టుబాట్లు దాటిన కాంతిరేఖ

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:16 AM

ఏడు శతాబ్దాల పురుషాధిక్య కట్టుబాట్ల గోడలు బద్దలయ్యాయి. రాజస్థాన్‌ రాజసం ఒక సరికొత్త చరిత్రకు వేదికైంది. అనాదిగా వస్తున్న ‘పాగ్‌ కా దస్తూర్‌’ ఆచారాన్ని తిరగరాస్తూ ఖేర్వాగఢ్‌...

కట్టుబాట్లు దాటిన కాంతిరేఖ

ఏడు శతాబ్దాల పురుషాధిక్య కట్టుబాట్ల గోడలు బద్దలయ్యాయి. రాజస్థాన్‌ రాజసం ఒక సరికొత్త చరిత్రకు వేదికైంది. అనాదిగా వస్తున్న ‘పాగ్‌ కా దస్తూర్‌’ ఆచారాన్ని తిరగరాస్తూ ఖేర్వాగఢ్‌ సింహాసనాన్ని 13 ఏళ్ల బాలిక తేజస్వికుమారి జోధా అధిష్ఠించింది. నుదుట రక్త తిలకం, తలపై గులాబీరంగు తలపాగా ధరించిన ఆ చిన్నారి... లింగ వివక్షపై సామాజిక చైతన్య కేతనమై నిలిచింది.

రాజస్థాన్‌లోని పాలి జిల్లా ఒకప్పుడు రాథోడ్‌ వీరుల పాలనలోని జోధ్‌పూర్‌-మర్వార్‌ సామ్రాజ్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాంతం. ఇక్కడి ఖేర్వాగఢ్‌ రాజవంశానికి దాదాపు ఏడువందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. రాజ్‌పుత్‌ సంప్రదాయాల ప్రకారం ఒక వంశ పెద్ద లేదా రాజు మరణించినప్పుడు.. ఆ శోక దినాల ముగింపులో తదుపరి తరం మగవారసుడిని ఎంపిక చేస్తారు. వేదమంత్రాల సాక్షిగా రాజకుటుంబ పెద్దల సమక్షంలో కొత్త వారసుడి తలపై సంప్రదాయ ‘పాగ్‌’ (తలపాగా) చుడతారు. అనంతరం రాజ్‌పుత్‌ శౌర్యానికి ప్రతీకగా నుదుట రక్తతిలకం దిద్ది ‘వంశనాయకుడి’గా ప్రకటిస్తారు. దీనినే ‘పాగ్‌ కా దస్తూర్‌’ అంటారు. ఈ సంప్రదాయంలో స్త్రీలకు స్థానం లేదు. ఒకవేళ మగవారసులు లేకపోతే ఆ సింహాసనం ఖాళీగా ఉంటుంది తప్ప.. మహిళలకు ఆ పగ్గాలు అప్పగించే దాఖలాలు చరిత్రలో లేవు.

65 ఏళ్ల నిశ్శబ్దం

ఖేర్వాగఢ్‌ కోట చరిత్రను పరిశీలిస్తే.. గత 65 ఏళ్లుగా ఈ కోటలో ఏ పట్టాభిషేకమూ, తలపాగా చుట్టే కార్యక్రమమూ జరగలేదు. దానికి కారణం.. వంశంలో పురుష వారసుల కొరత. గత ఆరు దశాబ్దాలుగా మగ వారసుడు లేకపోవడంతో ఈ సంప్రదాయ క్రతువుకు గ్రహణం పట్టింది. కోట వైభవం కోల్పోయి.. కేవలం ఒక చారిత్రక కట్టడంగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఇటీవల ఈ వంశ పెద్ద హరీశ్‌చంద్ర జోధా అకాల మరణం చెందారు. ఆయనకు కూడా మగ సంతానం లేదు. 13 ఏళ్ల కుమార్తె తేజస్వికుమారి జోధా మాత్రమే ఉంది. ఈ దశలో వంశ గౌరవాన్ని నిలపాలన్నా, కోట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఒకే ఒక్క మార్గం మిగిలింది. అనాదిగా వస్తున్న అలిఖిత చట్టాన్ని తిరగరాయడం.. కాలంతోపాటు మారి ఒక బాలికకు పట్టం కట్టడం.


తెరవెనుక సంఘర్షణ

సంప్రదాయ రాజ్‌పుత్‌ సమాజం అత్యంత కఠినమైన నియమాలకు మారుపేరు. అందువల్ల ఈ నిర్ణయం అంత సులువుగా జరగలేదు. ఒక ఆడపిల్లకు వంశపగ్గాలు అప్పగించడమా? అని పాత తరం పెద్దల నుంచి, కొందరు సంప్రదాయవాదుల నుంచి అంతర్గతంగా తీవ్ర ప్రతిఘటనలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇది ఆచారాలకు విరుద్ధమని కొందరు వాదించారు. అయితే, ఖేర్వాగఢ్‌ వంశ హితైషులు, ఆధునిక విద్యావంతులు పాత ఆలోచనలను గట్టిగా ఎదిరించారు. స్త్రీ, పురుష భేదం చూపడం వల్ల వంశమే అంతరించిపోయే ప్రమాదం ఉందన్న నిజాన్ని పెద్దలకు అర్థమయ్యేలా చెప్పారు. లింగ సమానత్వాన్ని గౌరవించడం ద్వారానే సంస్కృతిని కాపాడుకోగలమని సుదీర్ఘ చర్చల అనంతరం కమ్యూనిటీ పెద్దలను ఒప్పించారు. అలా ఆ అంతర్గత సంఘర్షణపై ఆధునిక ఆలోచనలు విజయం సాధించాయి.

ఆస్తి హక్కుల కోణం

ఆధునిక భారతదేశంలో రాచరిక బిరుదులకు, సింహాసనాలకు చట్టపరమైన గుర్తింపు లేదు. మరి ‘ప్రాగ్‌ కా దస్తూర్‌’ ప్రాధాన్యం ఏమిటి? అనే ప్రశ్న కలగడం సహజం. ఈ వేడుక కేవలం ఒక నైతిక లేదా సంప్రదాయ గౌరవానికి మాత్రమే పరిమితం కాదు. ఈ క్రతువు ద్వారా ఖేర్వాగఢ్‌ కోటకు సంబంధించిన చారిత్రాత్మక ఆస్తులు, భూములు, ట్రస్టులపై తేజస్వికుమారికి చట్టపరమైన వారసత్వ హక్కులు లభిస్తాయి. రేపటి రోజున ఈ ఆస్తుల నిర్వహణ, వంశపరమైన ట్రస్టు పర్యవేక్షణ పూర్తిగా ఆమె ఆధీనంలోనే సాగుతాయి.

కత్తి పట్టినా కలమే ముద్దు

సాధారణంగా ఇలాంటి పెద్ద బాధ్యతలు నెత్తిన పెడితే చిన్న పిల్లలు భయపడతారు. కానీ తేజస్వి జోధా వేరు. వారసత్వంగా లభించిన రాజపగ్గాలను అందుకున్న తరుణంలో ఆమె చెప్పిన మాటలు సమాజానికి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చాయి. ‘నా తండ్రి ఆశయాలు, కలలే నా మార్గదర్శకాలు. ఈ కోట, ఈ ప్రజలు.. నా కుటుంబం. నన్ను వారసురాలిగా నమ్మినందుకు నా చదువును కొనసాగిస్తూనే మా గ్రామాల అభివృద్ధికి, ఇక్కడి ప్రజల సంక్షేమానికి నా ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేస్తాను’ అని స్పష్టంగా చెప్పింది.


4-Navya.jpg

సామాజిక చైతన్యానికి మైలురాయి

ఈ వేడుక కేవలం ఒక రాజకుటుంబానికి చెందినది కాదు, ఇదొక సామాజిక చైతన్యం. మార్పు అనేది చట్టాల ద్వారా మాత్రమే రాదు. సమాజపు ఆలోచనా విధానంలో రావాలని ఈ ఘటన నిరూపించింది. రాజస్థాన్‌ గడ్డపై ఇన్నాళ్లు క్రీనీడలా సాగిన పురుషాధిక్య కట్టుబాట్ల గోడలు బద్దలయ్యాయి. తేజస్వికుమారి తలపై మెరిసిన ఆ గులాబీ తలపాగా.. ఒక వంశ వారసత్వానికి చిహ్నం కాదు, ఈ దేశంలో కోట్లాదిమంది ఆడపిల్లల హక్కులకు, వారి అపారమైన సామర్థ్యానికి దక్కిన కిరీటం.

రక్త తిలకం సాక్షిగా...

జూన్‌ 25న గురువారం ఖేర్వాగఢ్‌ కోట ప్రాంగణం ఆ అద్భుతమైన చరిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన వందలాదిమంది ప్రజలు, రాజ్‌పుత్‌ సమాజ పెద్దల సమక్షంలో వేడుక ప్రారంభమైంది. ఒకవైపు హోమగుండం నుంచి వస్తున్న వేదమంత్రోచ్చారణలు.. మరోవైపు అనాదిగా వస్తున్న ఆచార ముసుగును తొలగిస్తూ సాగిన ఏర్పాట్లు జోధ్‌పూర్‌-మార్వార్‌ పూర్వ రాజకుటుంబం నుంచి ప్రత్యేకంగా పంపిన సంప్రదాయ గులాబీరంగు తలపాగాను 13 ఏళ్ల తేజస్వికుమారి తలపై చుట్టారు. రాజ్‌పుత్‌ శౌర్యానికి ప్రతీకగా ఆమె నుదిటిపై రక్తంతో తిలకం దిద్దారు. ఏడో తరగతి చదువుతున్న ఆ చిన్నారి.. ఏమాత్రం బెరుకు లేకుండా కళ్లలో రాజసం, ముఖంలో అంతులేని పరిణతితో ఆ సింహాసనంపై కూర్చున్న తీరు చూసి అక్కడికి వచ్చిన పెద్దల కళ్లు ఆనందంతో చెమర్చాయి.

ఇవి కూడా చదవండి

ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్‌: తుమ్మల

హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!

Updated Date - Jul 01 , 2026 | 05:16 AM