Share News

భయం పోగొట్టి.. భవితవైపు నడిపిస్తూ...

ABN , Publish Date - Jun 08 , 2026 | 02:38 AM

మాతృభాషలో ఎలాంటి ప్రశ్న ఎదురైనా తడుముకోకుండా జవాబు చెప్పే పిల్లలు... ఇంగ్లీ్‌షకు వచ్చేసరికి తడబడతారు. దీనికి సరైన పునాది లేకపోవడం, పేదరికం, ఆ భాషంటే బెరుకు...

భయం పోగొట్టి.. భవితవైపు నడిపిస్తూ...

మాతృభాషలో ఎలాంటి ప్రశ్న ఎదురైనా తడుముకోకుండా జవాబు చెప్పే పిల్లలు... ఇంగ్లీ్‌షకు వచ్చేసరికి తడబడతారు. దీనికి సరైన పునాది లేకపోవడం, పేదరికం, ఆ భాషంటే బెరుకు లాంటి ఎన్నో కారణాలున్నాయంటోంది పదిహేడేళ్ళ రోషిణీ గుప్తా. అట్టడుగు వర్గాల పిల్లల్లో ఇంగ్లీష్‌ భాషా సామర్థ్యాన్ని పెంచడానికి మూడేళ్ళ క్రితం ఈ బెంగళూరు అమ్మాయి చేపట్టిన ప్రాజెక్ట్‌ అయిదు దేశాలకు విస్తరించింది.

‘‘తీవ్రమైన పోటీ ఉన్న ప్రస్తుత ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు... ముఖ్యంగా ఇంగ్లీష్‌ భాషలో సంభాషించగలగడం తప్పనిసరి. కానీ ఈ నైపుణ్యాలు అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలకు అందుబాటులో లేవు. వారిలో ఎక్కువమంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. చాలా పాఠశాలల్లో వారి భాషా నైపుణ్యాన్ని మెరుగుపరిచే పరిస్థితులు లేవు. ఈ విషయాలన్నీ స్పష్టంగా గమనించాను. నేను బెంగళూరులో పుట్టి పెరిగాను. తడబాటు లేకుండా మాట్లాడడం, ఏదైనా సందేహం వస్తే ప్రశ్నించడం, తోటి విద్యార్థులతో కలిసి వివిధ అంశాల మీద చర్చించడం... ఇలాంటి వాతావరణంలో నా చదువు సాగుతూ వచ్చింది. మూడేళ్ళ క్రితం ‘వన్‌ మిలియన్‌ ఫర్‌ వన్‌ బిలియన్‌ (1ఎం1బి) ఫౌండేషన్‌’ ద్వారా ఒక అనాథాశ్రమం నడుపుతున్న స్కూల్‌ను సందర్శించాను.

పరిష్కారం కోసం...

ఆ స్కూల్‌లో అంతా చాలా భిన్నంగా కనిపించింది. అక్కడి విద్యార్థులు పేదరికంలోం నుంచి వచ్చారు. చదువుకోవాలనే తపన, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి వారిలో ఎక్కువగానే ఉన్నాయి.. ఏవైనా ప్రశ్నలు అడిగినప్పుడు తమ మాతృభాషలో అయితే తడుముకోకుండా జవాబులు ఇస్తున్నారు. తమకు సుపరిచితమైన టాపిక్స్‌ మీద చర్చల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దేన్నయినా ఇంగ్లీషులో రాతపూర్వకంగా వివరించాలని కోరినప్పుడు... వారు రాసిన ప్రతిదీ సరిగ్గానే ఉంది. కానీ ఇంగ్లీషులో సంభాషించాల్సి వస్తే అంతకుముందు వారి గొంతుల్లో ఉన్న ఆత్మవిశ్వాసం మాయమైపోతోంది. ఆ ప్రశ్న వారికి అర్థం కాకపోవడం, సమాధానాలు తెలియకపోవడం కాదు... ఇంగ్లీషు మాట్లాడడంలో తడబాటు, భయం దీనికి కారణం. ఇదే పరిస్థితి చాలా ప్రభుత్వ పాఠశాలల్లోనూ కనిపించింది. వారిలో ఆత్మస్థైర్యం పెంచడం, భయం పొగొట్టడమే ఈ సమస్యకు పరిష్కారం అని అర్థమయింది. దానికోసం 2023లో ‘ప్రాజెక్‌ ్టవిద్య’ను ప్రారంభించాను. అప్పుడు నా వయసు పధ్నాలుగేళ్ళు.


1-Navya.jpg

ఆర్థిక అంశాల్లో కూడా...

బెంగళూరులోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం వర్క్‌షాపుల నిర్వహణతో ‘ప్రాజెక్ట్‌ విద్య’ కార్యకలాపాలు మొదలయ్యాయి. దీనికోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశాను. ఏవో ప్రశ్నలు వేయడం, నోట్‌ పుస్తకాల్లో సమాధానాలు రాయమనడం కాకుండా... విద్యార్థులతో వీలైనంతగా మాట్లాడించడం ద్వారా ఇంగ్లీష్‌ అంటే వారికి ఉన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేశాం. ‘‘తప్పు మాట్లాడినా పరవాలేదు. ధైర్యంగా మాట్లాడండి. పొరపాట్లు మెల్లగా అవే సరి అవుతాయి’’ అని ప్రోత్సహించాం. మరోవైపు ప్రాథమిక కంప్యూటర్‌ నైపుణ్యాల్లోనూ, పొదుపు, ఆర్థిక ప్రణాళిక లాంటి అంశాల్లోనూ తరగతులు నిర్వహించాం. కథల పుస్తకాలు, డిక్షనరీలు, ఇంగ్లీష్‌ భాషను నేర్చుకోడానికి సహాయపడే మెటీరియల్‌ను సేకరించి వివిధ అనాథ శరణాలయాలకు, మాతో భాగస్వాములుగా ఉన్న పాఠశాలలకు అందజేస్తున్నాం.

40 మంది వాలంటీర్లతో...

పదమూడు, పాతిక వయసు మధ్య ఉన్న దాదాపు 40 మంది వాలంటీర్లతో మా సంస్థ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మనదేశంలోని వివిధ నగరాలతో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, రువాండా, కెన్యా, లెసోతో... మొత్తం అయిదు దేశాల్లో స్థానిక వాలంటీర్లు చిన్న బృందాలుగా ఏర్పడి బోధన, సమన్వయం, బోధనాంశాల రూపకల్పన లాంటి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. 1,600కు పైగా పేద విద్యార్థులు ఇప్పటివరకూ ప్రయోజనం పొందారు. ‘1ఎం1బి ఫౌండేషన్‌’ మార్గదర్శకత్వం మా ప్రాజెక్ట్‌ నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతోంది. నేను ప్రస్తుతం ప్లస్‌వన్‌ చదువుతూ... ‘ప్రాజెక్ట్‌ విద్య’ కార్యకలాపాలను నడిపిస్తున్నా. భాషా నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు నేర్పే ఒక వేదికగా భవిష్యత్తులో ఇది మరింత విస్తరిస్తుందనే నమ్మకం నాకుంది.’’

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 02:38 AM