Share News

నయా నేషనల్‌ క్రష్‌!

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:49 AM

తాన్యా మిశ్రా... ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న పేరు. సెర్చ్‌ ఇంజన్లలో తెగ వెతికేస్తున్న గ్లామర్‌. నయా ‘నేషనల్‌ క్రష్‌’. చేసింది తక్కువ సినిమాలే అయినా....

నయా నేషనల్‌ క్రష్‌!

ట్రెండింగ్‌

తాన్యా మిశ్రా... ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న పేరు. సెర్చ్‌ ఇంజన్లలో తెగ వెతికేస్తున్న గ్లామర్‌. నయా ‘నేషనల్‌ క్రష్‌’. చేసింది తక్కువ సినిమాలే అయినా... వెబ్‌సిరీ్‌సలు, ఇన్‌స్టా పోస్ట్‌లతో లక్షలమంది అభిమానులను సంపాదించుకుంది. కలలు కని రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆమె... కోరి వచ్చిన ఏ ప్రాజెక్ట్‌నూ కాదనకుండా చేసుకుపోతోంది. కెరీర్‌ను పరుగులు పెట్టిస్తోంది.

‘నయా నేషనల్‌ క్రష్‌’... ప్రస్తుతం నెటిజనులు తాన్యాకు ఇచ్చిన ప్రశంస. గమ్మత్తయిన కళ్లు, ఆకర్షించే రూపం, అలరించే ఆహార్యం, నిర్మొహమాటంగా మాట్లాడే తత్వం... వేగంగా పెరుగుతున్న ఆన్‌లైన్‌ అభిమానగణం... తాన్య క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. బాలీవుడ్‌ చిత్రాలు, వెబ్‌సిరీ్‌సలు, మ్యూజిక్‌ వీడియోలు... వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది తాన్య. ఫలానా సబ్జెక్ట్‌ అయితేనే చేస్తానని గిరి గీసుకొని కూర్చోకుండా... వచ్చిన అవకాశాలను వచ్చినట్టు పూర్తిగా సద్వినియోగం చేసుకొంటూ... కెరీర్‌ను నిర్మించుకొంటోంది. పాత్రల్లో ఒదిగిపోతూ తానేమిటో నిరూపించుకొంటోంది.

గయ టు ముంబయి...

బిహార్‌లోని గయలో పుట్టిన తాన్య... ‘మగథ విశ్వవిద్యాలయం’ నుంచి కామర్స్‌ డిగ్రీ పొందింది. చిన్నప్పటి నుంచి నటనపై మక్కువతో అందులోనే తన కెరీర్‌ను వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే బిహార్‌ నుంచి ముంబయికి వెళ్లింది. గ్లామర్‌ ప్రపంచంలో మోడలింగ్‌తో మొదలైన ఆమె ప్రయాణం... ఫ్యాషన్‌ షోలు, క్యాట్‌ వాక్‌లతో బిజీగా మారింది. కొన్ని మ్యాగజైన్ల ముఖచిత్రమై మెరిసింది. 2019లో ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొంది. కానీ నాలుగో రన్నర్‌పతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఆ పోటీల్లో పొల్గొనడం తాన్యాకు కలిసివచ్చింది. ఆమెను బాలీవుడ్‌కు పరిచయం చేసింది.

సినిమాలు... వెబ్‌సిరీ్‌సలు...

మరుసటి ఏడాదే తాన్యాకు హిందీ చిత్ర పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. ‘ఘజనవి, ఛేజ్‌’ చిత్రాల్లో నటించింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఛేజ్‌’లో సీబీఐ ఇన్‌స్పెక్టర్‌గా చేసిన తాన్య... తన మోడలింగ్‌ ఇమేజ్‌ను దాటి, ఒక ప్రాధాన్యతగల పాత్రలో ఒదిగిపోయే అవకాశాన్ని పొందింది. తాజాగా హర్మన్‌ బవేజా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ‘చిడియా ఉద్‌’ వెబ్‌సిరీస్‌ ద్వారా దిగ్గజ నటుడు జాకీ ష్రాఫ్‌, సికందర్‌ ఖేర్‌, భూమికా చావ్లా తదితర ప్రముఖలతో కలిసి పని చేసే అవకాశం దక్కింది. చేసింది తక్కువ ప్రాజెక్ట్‌లే అయినా... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తాన్య.


మ్యూజిక్‌ వీడియోలు...

సినిమా అవకాశాలు ఉన్నా లేకపోయినా... మ్యూజిక్‌ వీడియోలను మాత్రం తాన్య ఎప్పుడూ వదులుకోలేదు. ఆమెకు ఇంతటి పేరు రావడానికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటివరకు ఆమె ఏడు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో నటించింది. ‘నఖ్రో, తూ మేరా హో జాయేగా’ లాంటి హిట్స్‌ వాటిల్లో ఉన్నాయి. సంగీత రంగంలో ఆమె చేసిన ప్రయత్నాలు డిజిటల్‌ ప్రేక్షకులకు చేరువ చేశాయి. లక్షలమంది అభిమానులు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పన్నెండు లక్షలమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అక్కడ తరచూ ప్రస్తుత, రాబోయే ప్రాజెక్ట్‌ వివరాలతో పాటు లేటెస్ట్‌ డ్రెస్‌లు ధరించిన తన ఫొటోలను తాన్య పోస్ట్‌ చేస్తుంటుంది. అప్పుడప్పుడు అభిమానులను పలుకరిస్తుంటుంది. తన ఫ్యాషన్స్‌ గురించి, మోడలింగ్‌ పాజెక్ట్‌ల గురించి చర్చిస్తుంటుంది. దీంతో నెటిజనులు ఆమెకు ఫిదా అయిపోయారు. విపరీతంగా కనెక్ట్‌ అయిపోయారు. ‘నయా నేషనల్‌ క్రష్‌’ అంటూ ట్యాగ్‌లైన్స్‌ పెట్టి నెట్టింట ఆమె పోస్టులను వైరల్‌ చేస్తున్నారు.

విజయం అంటే...

తాన్య దృష్టిలో విజయం అంటే కేవలం ప్రజాదరణ లేక ఆర్థిక విషయాలు మాత్రమే కాదు... వ్యక్తిగతంగా, వృత్తిగతంగా స్థిరమైన ఎదుగుదల. అంతేకాదు... నిజాయతీగా పని చేయడం, దానివల్ల కలిగే సంతృప్తి భావన కూడా మెరుగైన జీవన విధానానికి బాటలు వేస్తుందనేది ఆమె అభిప్రాయం. అర్థవంతమైన ప్రాజెక్ట్‌ల ద్వారా మైలు రాళ్లను అధిగమిస్తూ, అంచనాలను అందుకొంటూ, ప్రేక్షకులతో భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకోవడమే తన లక్ష్యం అంటుంది ఈ భామ. ‘‘నటన, కంటెంట్‌ క్రియేషన్‌, ఫ్యాషన్‌... ఇవే నన్ను తక్కువ సమయంలోనే అభిమానులకు ఇంతగా దగ్గర చేశాయి. నేను పంచుకొనే ప్రతి అంశం వెనుక అర్థవంతమైన విషయం ఉండాలని కోరుకొంటాను. అది సినిమా అయినా... సామాజిక మాధ్యమంలో కంటెంట్‌ అయినా. ట్రెండ్స్‌ వేగంగా మారుతుంటాయి. వాటిని ఆకళింపు చేసుకొంటూ ముందుకు సాగడం అంత సులువు కాదు. కానీ మనం నిజాయతీగా ఇచ్చే కంటెంట్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అందుకే నేను నా కెరీర్‌కు సంబంధించినవి అయినా, వ్యక్తిగత అంశాలైనా దాపరికం లేకుండా షేర్‌ చేస్తుంటాను’’ అంటుంది తాన్య.

సవాళ్లు ఎదురైనా...

వినోద పరిశ్రమలో నెట్టుకురావడం అంత సులువు కాదంటుంది ఈ తార. ‘‘తిరస్కరణలు, మూస ధోరణులు, మనపై నిరంతరం ప్రజల దృష్టి లాంటివి సవాళ్లు విసురుతుంటాయి. మన జీవితాన్న ప్రభావితం చేస్తుంటాయి. అయితే ఇక్కడ నేను విమర్శలకు కుంగిపోలేదు. అవి నా కెరీర్‌ను నిర్ణయించే అవకాశం ఇవ్వలేదు. కష్టాలు ఎదురైనప్పుడు, ఆ అనుభవాలను కెరీర్‌ను నిర్మించుకోవడానికి అవకాశాలుగా ఉపయోగించుకున్నాను. అనవసర విషయాలను పట్టించుకోకుండా, నా గురించి నేను శ్రద్ధ తీసుకోవడం, అవకాశం వచ్చినప్పుడు వంద శాతం అంకితభావంతో పని చేయడం... వీటిపైనే దృష్టి పెడతాను. బలహీనతలనే బలంగా మార్చుకొనే ప్రయత్నం చేస్తాను’’ అంటున్న తాన్య... వృత్తిగత, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకొంటూ సాగిపోతోంది.

ఇవి కూడా చదవండి..

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. లీటర్‌కు రూ.5, రూ.3 పెంచిన నయారా ఎనర్జీ

కొడుకును మార్చాలనుకుంది.. చివరకు తానే మారిపోయింది.. ఈ చైనా మహిళ కథేంటంటే..

Updated Date - Oct 04 , 2026 | 05:49 AM