ఆమె స్నేహమే వాటికి రక్ష
ABN , Publish Date - Jul 23 , 2026 | 06:04 AM
ఒంటరితనాన్ని అధిగమించడానికి, అనారోగ్యాన్ని తట్టుకోవడానికి ఆమె మూగ జీవాలను స్నేహితులుగా చేసుకున్నారు. ఇప్పుడు వాటికి సంరక్షకురాలిగా మారారు. ఇప్పటివరకూ అయిదు వేలకు...
ఒంటరితనాన్ని అధిగమించడానికి, అనారోగ్యాన్ని తట్టుకోవడానికి ఆమె మూగ జీవాలను స్నేహితులుగా చేసుకున్నారు. ఇప్పుడు వాటికి సంరక్షకురాలిగా మారారు. ఇప్పటివరకూ అయిదు వేలకు పైగా మూగజీవాలను కాపాడారు. వాటికోసం ఇటీవల ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. ‘‘ఇదంతా ప్రేమతో చేస్తున్నాను. కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులున్నా ఎన్నడూ భారంగా అనిపించలేదు’’ అంటున్నారు పోలవరపు లావణ్య. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ఈ జంతు ప్రేమికురాలి కథ ఆమె మాటల్లోనే...
‘‘నేను చదువుకొనే రోజుల్లో నాతో స్నేహం చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. నా మనసులోని బాధను పంచుకుందామన్నా వినేవారు లేరు. ఈ కారణాలతో ఒక్కోసారి అనారోగ్యానికి గురై స్కూల్‌కు కూడా సక్రమంగా వెళ్లలేక ఇంటికే పరిమితమైన రోజులు ఉన్నాయి. ‘ఆరోగ్యం ఎలా ఉంది?’ అని అడిగే మిత్రులు లేకపోవడంతో ఒంటరితనం మరింత బాధించేది. ఇంటర్ చదువుతున్నప్పుడు... బీపీ తక్కువై సుస్తీ చేసింది. ఆసుపత్రికి వెళ్లాను. డాక్టర్ నా ముఖం చూసి ‘‘నువ్వు బాగా ఆలోచిస్తున్నావు ఏమయింది?’’ అని అడిగారు. ‘‘నాతో మాట్లాడటానికి, నన్ను అర్థం చేసుకోవడానికి స్నేహితులు ఎవరూ లేరు. ఒంటరిగా అనిపిస్తోంది’’ అని చెప్పాను. ‘‘నీకు కుక్కలంటే ఇష్టమా?’’ అని ఆయన అడిగారు. ‘‘అవును ఇష్టమే’’ అన్నాను. ‘‘ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు... ఆ మూగ జీవాల దగ్గరకు వెళ్లు. వాటికి తినడానికి ఏదైనా పెట్టు. నీ మనసులోని బాధను వాటితో పంచుకో. నువ్వు ఎంతసేపు మాట్లాడినా అవి విసుగు లేకుండా వింటాయి. అవి ఏ విషయంలోనూ తీర్పులు చెప్పవు’’ అన్నారు. ఆయన మాటలు నా జీవితం మీద చెరగని ముద్ర వేశాయి. అప్పటి నుంచి మూగ జీవాలతో సావాసం మొదలైంది. క్రమంగా కుక్కలు, పక్షులు, ఆవులు, గేదెలు... ఇలా ఎన్నో జంతువుల సంరక్షణలో నిమగ్నమయ్యా. అదే నన్ను యానిమల్ లవర్‌గా, యానిమల్ సంరక్షకురాలుగా మార్చేసింది.
వాటి కోసం గది అద్దెకు తీసుకున్నా...
మా అమ్మ వెంకటలక్ష్మి గృహిణి. నాన్న దుర్గాప్రసాద్, అన్నయ్య అనిల్‌కుమార్ బంగారం పనులు చేస్తుంటారు. వారు మూగ జీవాలపట్ల నాకున్న ప్రేమను అర్థం చేసుకున్నారు. నేను అడిగినంత డబ్బు ఇచ్చేవారు. ఇప్పటివరకు సుమారు 5 వేలకు పైగా మూగజీవాలను రక్షించాను. నేను చేసిన ప్రతి రెస్క్యూ సొంత డబ్బుతోనే చేస్తున్నాను. ఎక్కడ కుక్కలకు ప్రమాదాలు జరిగినా, అనారోగ్యానికి గురైనా, రేబిస్ ఉన్నా వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవడం అలవాటుగా మారింది. ఒక్కో సందర్భంలో నేను కాపాడిన కుక్కలు ఎక్కువగా ఉన్నపుడు ఎలా సంరక్షణ చేయాలో తెలియక... వారానికి 800 వందలు అద్దె చెల్లించి చిన్న గది తీసుకొనేదాన్ని. ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ ఏనాడు భారం అనిపించలేదు. వాటిని హృదయ పూర్వకంగా ప్రేమిస్తున్నా కాబట్టి భారాన్ని కూడా ఆనందంగా స్వీకరించడం అలవాటయింది. మూడు నెలల క్రితం ‘ప్రకృతి సంరక్షణ ట్రస్టు’ ఏర్పాటు చేశాను. ఈ సంస్థ తణుకు కేంద్రంగా పని చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్ ఎంతో ప్రోత్సాహం అందించారు. పట్టణంలోని డంపింగ్ యార్డు వద్ద షెడ్డు ఏర్పాటు చేశారు. కుక్కలకు ఆహారం, మందుల కోసం ఆర్థికంగా సహకరించారు. తణుకు జైన్ సంఘం, రాజమహేంద్రవరం ‘శ్రీ సుమతినాథ్ జీ జీవ దయా గ్రూపు’ ఎంతో సహకరిస్తున్నాయి. ఆపదలో ఉన్న కుక్కలకు, ఆవులకు రాష్ట్ర పశు ఆరోగ్య సంస్థ వైద్యుడు వాకాని ప్రసాద్, ఏడీ శ్రీధర్, డాక్టర్ పృధ్వీరెడ్డి, డాక్టర్ భవాని వైద్యం అందిస్తున్నారు.
బాధ్యతను మరచిపోను...
నేను బీకాం బీఈడీ పూర్తి చేశాను. వివాహాలు, ఇతర శుభకార్యాల్లో మేకప్ ఆర్టిస్టుగా పని చేస్తున్నాను. దీనిపై వచ్చే ఆదాయంలో నెలకు 15 వేల వరకు, అలాగే కుటుంబ సభ్యులు సాయంగా అందించే మొత్తాలను జంతు సంరక్షణ కోసం ఖర్చు చేస్తున్నాను. ప్రధానంగా గత ఏడేళ్ల నుంచి రెస్క్యూ కోసం మూగజీవాలు వస్తున్నాయి. తణుకు పరిసర ప్రాంతాలతోపాటు తాడేపల్లిగూడెం, కాకినాడ, పాలకొల్లు, హైదరాబాద్, రాజమహేంద్రవరం, భీమవరం, విజయవాడ, విశాఖపట్టణం తదితర పట్టణాల వాటిని తీసుకువస్తున్నారు. గాయాలైన వాటిని పూర్తిగా నయం చేసి వదిలేస్తాం. కుక్కలను రెస్క్యూ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో అవి నన్ను కరిచాయి. ఆ గాట్లు నా శరీరం మీద గుర్తులుగా ఉన్నాయి. స్కూటీపై తీసుకెళ్లే సందర్భంలోనూ కరుస్తుంటాయి. కానీ వాటి బాధ్యతను ఏ మాత్రం మరచిపోను. ప్రస్తుతం ఆపదలో ఉన్న మూగజీవాలను తీసుకురావడానికి ఒక వాహనం అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చే జంతువుల సంఖ్య ఎక్కువ కావడంతో ఖర్చులు పెరిగాయి. దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే మరింతగా నా సేవలు విస్తరిస్తాను. నేను చేసే ఈ పనులన్నిటికీ నా కుటుంబ సభ్యులు చాలా అండగా నిలుస్తున్నారు. నాకు కాబోయే భర్త చాపల హేమ రాజశేఖర్ ఆర్థికంగా సహకరిస్తున్నారు. వారి నమ్మకం, ప్రోత్సాహం లేకపోతే ‘యానిమల్ రెస్క్యూ లావణ్య’గా గుర్తింపు పొందేదాన్ని కాదు. నాకు శ్వాస ఉన్నంత వరకు... ప్రతి మూగజీవి కోసం నాకు చేతనైనంత పని చేస్తూనే ఉంటాను. జంతు సంరక్షణకు సంబంధించి ఎవరైనా సరే... 79816 38296 నంబరులో నన్ను సంప్రదించవచ్చు.’’
పీసీహెచ్ కృష్ణమూర్తి, తణుకు
Also Read:
కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం
గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి