Share News

కొత్తదారిలోనూ ఆమె ముద్ర

ABN , Publish Date - Jul 19 , 2026 | 02:59 AM

గాడ్‌ ఫాదర్స్‌ లేకుండా గ్లామర్‌ ప్రపంచంలో అడుగుపెట్టి, దశాబ్దంన్నర కాలంగా పాన్‌ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్న నటి తమన్నా భాటియా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఫోర్బ్స్‌ ఇండియా...

కొత్తదారిలోనూ ఆమె ముద్ర

గాడ్‌ ఫాదర్స్‌ లేకుండా గ్లామర్‌ ప్రపంచంలో అడుగుపెట్టి, దశాబ్దంన్నర కాలంగా పాన్‌ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్న నటి తమన్నా భాటియా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఫోర్బ్స్‌ ఇండియా తాజాగా ప్రకటించిన ‘డబ్ల్యూ-పవర్‌ 2026’ జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా నటనలోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తిరుగులేదని నిరూపించుకున్నారు.

ముంబైలోని ఒక సాధారణ సింధీ హిందూ కుటుంబంలో జన్మించిన తమన్నాకు చిన్నతనం నుంచే కళల పట్ల ఆసక్తి ఎక్కువ. 13 ఏళ్ల వయసులోనే థియేటర్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుని, ఆ తర్వాత మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ ద్వారా కెరీర్‌ ప్రారంభించారు. 15 ఏళ్ల వయసులో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినా ఆశించిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. భాష తెలియకపోయినా, సంభాషణలను అర్థం చేసుకుంటూ శ్రమించి నేర్చుకున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్‌’ చిత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘కళాశాల’, ‘అయాన్‌’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ వంటి సినిమాల విజయంతో టాలీవుడ్‌ కోలీవుడ్‌లోనూ తిరుగులేని నాయికగా అవతరించింది.

విభిన్న పాత్రల ప్రయోగాలు

సాధారణంగా గ్లామర్‌ పాత్రలకే పరిమితమయ్యే కథానాయికల మధ్య, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తమన్నా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బాహుబలి’లో ఆమె పోషించిన వీరనారి ‘అవంతిక’ పాత్ర ఆమెలోని అసలైన నటిని విశ్వవ్యాప్తం చేసింది. ఆ తర్వాత కూడా రొటీన్‌ ఫార్ములాకు భిన్నంగా ‘ఎఫ్‌2’, ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాలతోపాటు ఓటీటీ వేదికలపై ‘జీ కర్దా’, ‘ఆఖ్రీ సచ్‌’ వంటి వెబ్‌ సిరీ్‌సలలో వైవిధ్యమైన, బోల్డ్‌ పాత్రలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా నిత్యం సరికొత్త ప్రయోగాలు చేయడమే ఆమె విజయ రహస్యం.

వ్యాపార రంగంలో నయా సంచలనం

నటిగా అత్యున్నత దశలో ఉన్నప్పుడే భవిష్యత్తుపై స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు తమన్నా. గ్లామర్‌ ఇండస్ట్రీలో కెరీర్‌ శాశ్వతం కాదనే పచ్చి నిజం గ్రహించిన ఆమె.. తన అభిరుచికి వ్యాపార నైపుణ్యాన్ని జోడించారు. అలా పుట్టిందే ‘తమన్నా ఫైన్‌ జ్యువెలరీ బ్రాండ్‌’. ఒక సెలబ్రిటీగా బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయడమే కాకుండా, డిజైన్ల ఎంపికలో స్వయంగా భాగస్వామ్యమయ్యారు. నేటి ఆధునిక మహిళల అభిరుచికి తగ్గట్టుగా తేలికపాటి, రోజువారీ వినియోగానికి సరిపోయే ఆభరణాల శ్రేణిని మార్కెట్లోకి తీసుకురావడంలో ఆమె విజయం సాధించారు. స్టార్‌డమ్‌ అనేది స్ర్కీన్‌కే పరిమితం కాదని, దాంతో వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ఏలవచ్చని తమన్నా నిరూపించారు.


2-Navya.jpg

ఆర్థిక స్వేచ్ఛ

సహజంగా నటీమణులు కేవలం బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్లకే పరిమితమవుతారు. కానీ, ఒక సొంత వ్యాపార సంస్థను విజయవంతంగా నడుపుతూ, స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్న తమన్నా నేటి తరం మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ఫోర్బ్స్‌ ఇండియా ‘డబ్ల్యూ-పవర్‌’

జాబితాలో ఆమె స్థానం ఆమె వ్యక్తిగత విజయానికి దక్కిన గుర్తింపు మాత్రమే కాదు.. పట్టుదల, దార్శనికత ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా అగ్రస్థానం అందుకోవచ్చనే అద్భుతమైన నమ్మకానికి సజీవ సాక్ష్యం.

‘‘నాకు సినీ నేపథ్యం లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు పరిశ్రమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. కానీ, నా శ్రమను, ప్రేక్షకులను నమ్మాను. ఒక మహిళగా సినీ రంగంలో సుదీర్ఘకాలం రాణించడమే కాకుండా, వ్యాపార రంగంలో అడుగుపెట్టడం ఒక పెద్ద సవాలు. చాలామంది నటీమణుల కెరీర్‌ త్వరగా ముగిసిపోతుందని అంటుంటారు. కానీ మనం అనుకుంటే ఏ రంగంలోనైనా సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చని నేను బలంగా నమ్మాను. ఈ రోజు ఫోర్బ్స్‌ వంటి అంతర్జాతీయ వేదికపై ‘సెల్ఫ్‌ మేడ్‌’ మహిళగా గుర్తింపు పొందడం నా కల నిజమవడమే. ఇది నాలాంటి ఎంతోమంది సాధారణ అమ్మాయిలకు ఒక నమ్మకాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను’’

ఇవి కూడా చదవండి

దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Updated Date - Jul 19 , 2026 | 02:59 AM