విలాసాలు వదిలి.. విద్యాదాతగా
ABN , Publish Date - Jul 22 , 2026 | 01:53 AM
స్విట్జర్లాండ్‌లో విలాసవంతమైన జీవితం, దుబాయ్‌లో భారీ జీతంతో కార్పొరేట్ కొలువు, లగ్జరీ కార్లు, విదేశీ ప్రయాణాలు... కానీ, ఆ ఐశ్వర్యం ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేదు....
స్విట్జర్లాండ్‌లో విలాసవంతమైన జీవితం, దుబాయ్‌లో భారీ జీతంతో కార్పొరేట్ కొలువు, లగ్జరీ కార్లు, విదేశీ ప్రయాణాలు... కానీ, ఆ ఐశ్వర్యం ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేదు. విలాసాల ప్రపంచాన్ని వదిలేసి, రెండు జతల బట్టలతో భారత్‌లోని ఒక మారుమూల ద్వీపానికి చేరుకున్న ఆ స్విస్ మహిళ శాండ్రా లావి గోజ్కోవిచ్... పేద పిల్లల జీవితాల్లో విద్యా వెలుగులు నింపుతూ తన జీవిత పరమార్థాన్ని వెతుక్కున్నారు.
సొంత ఇల్లు, ఖరీదైన కారు, బ్యాంక్ నిండా డబ్బు... శాండ్రా లావి గోజ్కోవిచ్ జీవితం కాగితం మీద చూస్తే ఎంతో పరిపూర్ణంగా కనిపించేది. స్విట్జర్లాండ్‌లో పుట్టి పెరిగిన ఆమె, ఉన్నత చదువులు పూర్తి చేసి దుబాయ్‌లో ఒక ప్రతిష్ఠాత్మక కార్పొరేట్ కంపెనీలో చేరారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లు, బోర్డ్‌రూమ్ మీటింగ్‌ల మధ్య తిరుగుతున్నప్పుడు ఆమె మనసును ఒక ప్రశ్న నిరంతరం తొలిచేసేది. సమాజంలో చాలా మందికి కనీస అవసరాలు కూడా తీరడం లేదు, మరి నాకెందుకు దేవుడు ఇంతటి విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చాడు?.. ఆ ఒక్క ప్రశ్నే.. ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పదిహేనేళ్ల క్రితం శాండ్రా తీసుకున్న నిర్ణయం ఆమె చుట్టూ ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా విమానమెక్కి భారత్‌లో ల్యాండయ్యారు. ‘‘భారతదేశానికి రావడం నాకు ఒక పెద్ద కల్చర్ షాక్. కానీ నేను దేనికోసమైతే వెతుకుతున్నానో.. ఆ సరళత, జీవిత పరమార్థం నాకు ఇక్కడే దొరికాయి’’ అని శాండ్రా చెప్పుకొచ్చారు.
రెండు జతల బట్టలు.. వన్ వే టికెట్
‘‘నేను నా లగ్జరీ జీవితాన్ని వదిలి రెండు షర్టులు, రెండు జతల ప్యాంట్లతో ఇండియా వచ్చాను’’ అని గుర్తు చేసుకున్నారు. భారత్‌లో ఆమె ఒంటరిగా రైళ్లలో ప్రయాణించారు. ఎలాంటి భద్రత లేదు, తెలిసిన ముఖాలు లేవు. ‘‘ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కొంచెం పిచ్చితనంగా అనిపిస్తుంది. కానీ, నా జీవితంలో మొదటిసారి నేను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపించింది. నా దగ్గర తక్కువ వస్తువులే ఉన్నప్పటికీ గతంలో కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. మొదట్లో ఇప్పటికే ఉన్న స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం చేస్తే సరిపోతుందని అనుకున్నాను. కానీ ప్రజల నిజమైన అవసరాలకు అనుగుణంగా, పారదర్శకంగా ఉండే ఒక సుస్థిరమైన ప్రాజెక్టును నేనే ప్రారంభించాలని నిర్ణయుంచుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు శాండ్రా.
మారుమూల గ్రామాల నుంచే
‘‘భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకున్నాను. నిజమైన మార్పు ఎప్పుడూ గ్రామాల నుంచే ప్రారంభమవుతుంది’’ అని శాండ్రా అంటారు. విదేశీయులు అస్సలు వెళ్లని మారుమూల గ్రామాలకు తనను తీసుకెళ్లమని స్థానికులను కోరారు. అదే ఆమెను రెండున్నర గంటల రైలు ప్రయాణం, గంట పడవ ప్రయాణం తర్వాత సాగర్ ద్వీపానికి చేర్చింది. కపిల ముని ఆశ్రమం ఉన్న ఆ ఆధ్యాత్మిక ద్వీపంలో మూడు గ్రామాలను సందర్శించి, స్థానిక ప్రజలతో కూర్చుని వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అదే నేటి ఆమె సేవా కార్యక్రమాలకు బలమైన పునాదిగా మారింది.
ఇంటింటికీ తిరిగి...
ఒక మారుమూల గ్రామంలో ఉచిత బడిని ప్రారంభించడం శాండ్రాకు పెద్ద కష్టం కాలేదు. కానీ విదేశీ మహిళను నమ్మి తమ పిల్లల భవిష్యత్తును అప్పగించేలా తల్లిదండ్రులను ఒప్పించడం మాత్రం ఆమెకు పెద్ద సవాలుగా మారింది. ‘‘ఒక విదేశీయురాలిగా నేను మొదట వారి నమ్మకాన్ని గెలుచుకోవాలి. అందుకే గ్రామంలోని ప్రతి ఇంటి తలుపు తట్టి, పిల్లలను బడికి పంపమని బతిమాలాను’’ అని చెప్పారు. నేడు శాండ్రా సంస్థ ఐదు తరగతులతో కూడిన ఉచిత పైమ్రరీ స్కూల్‌ను నడుపుతోంది. ఇందులో 150 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇది కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే మరో 120 మంది పిల్లలకు ట్యూషన్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు ప్రతిరోజూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అలాగే 20 మంది స్థానిక మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నారు. కేవలం విద్య మాత్రమే కాకుండా గృహ హింస, బాల్యవివాహాలు, మానవ అక్రమ రవాణాపై కూడా ఆమె తన బృందంతో కలిసి గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
ఇదే నా జీవిత లక్ష్యం!
ఆ రంగుల కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలేసి పదిహేనేళ్లు అవుతున్నా.. శాండ్రా ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడామె తన విజయాన్ని ప్రమోషన్లతోనో, జీతం ప్యాకేజీలతోనో కొలవడం లేదు. తరగతి గదుల్లోని పిల్లల నవ్వులు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్న మహిళల ముఖాల్లోని ఆనందంలోనే ఆమె తన విజయాన్ని వెతుక్కుంటున్నారు. ‘‘భౌతిక సంపద తాత్కాలికం. అది కొంతవరకు సౌకర్యాన్ని ఇవ్వగలదు, కానీ శాశ్వత తృప్తిని ఇవ్వలేదు. నిజమైన ఆనందం ఇతరులకు సేవ చేయడంలో, అవకాశాలు లేని వారికి అండగా నిలబడటంలోనే ఉంది. పేదలకు సేవ చేయడం నా జీవిత లక్ష్యం. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ సేవను కొనసాగిస్తాను’’ అని శాండ్రా గర్వంగా చెబుతారు.
ఇవి కూడా చదవండి
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్
12వ అంతస్తు నుంచి కిందపడ్డ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న మహిళపై పడటంతో..