Share News

‘కో వర్కింగ్‌ స్పేస్‌’లో ఆమె ముద్ర

ABN , Publish Date - Mar 08 , 2026 | 02:34 AM

ఇరవయ్యేళ్ళ లోపే వివాహమై, ఒక బిడ్డకు తల్లి అయిన చాలామంది మహిళల కలలు అక్కడితో ఆగిపోతాయి. కానీ సుందరి పాటిబండ్లకు కొత్త కలలు కనడం ఇష్టం. అవి నెరవేరేవరకూ కష్టపడడం మరీ ఇష్టం. చదువు కొనసాగించి...

‘కో వర్కింగ్‌ స్పేస్‌’లో ఆమె ముద్ర

ఇరవయ్యేళ్ళ లోపే వివాహమై, ఒక బిడ్డకు తల్లి అయిన చాలామంది మహిళల కలలు అక్కడితో ఆగిపోతాయి. కానీ సుందరి పాటిబండ్లకు కొత్త కలలు కనడం ఇష్టం. అవి నెరవేరేవరకూ కష్టపడడం మరీ ఇష్టం. చదువు కొనసాగించి, 14 ఏళ్ళు ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ వృత్తిలో ఉన్న ఆమె... కో-వర్కింగ్‌ స్పేస్‌ రంగంలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో తొలి వైనరీ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తున్న సుందరి ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.

‘‘వ్యాపార రంగంలోకి నేను అడుగు పెట్టడానికి స్ఫూర్తి మా తాతగారు. మా చుట్టుపక్కల దాదాపు పాతిక గ్రామాల్లో... వ్యవసాయ సీజన్‌లో రైతులకు మా తాతయ్య రుణాలు ఇచ్చేవారు. అప్పట్లో బ్యాంకులు కూడా చాలా తక్కువ. వ్యవహారాలన్నీ ప్రామిసరీ నోట్ల ద్వారానే సాగేవి. ప్రామిసరీ నోట్లు రాయడం, డబ్బు లెక్కపెట్టడం లాంటి పనుల్లో తాతయ్యకు నేను సాయం చేసేదాన్ని. బిజినెస్‌ చేయాలనే ఆలోచన అప్పుడే నాలో అంతర్లీనంగా కలిగిందేమో. నేను ప్రకాశం జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టాను. చదువుకు చాలా ప్రాధాన్యం ఇచ్చేదాన్ని. నాకు పద్ధెనిమిదేళ్ళు ఉన్నప్పుడు... మా తాతయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నా పెళ్ళి చూడాలని ఆయన కోరుకున్నారు. చదువు కొనసాగించడానికి ఒప్పుకుంటేనే పెళ్ళి చేసుకుంటానని చెప్పాను. ఆ షరతు మీదే వివాహం చేసుకున్నాను. నాకు 19 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మాయి పుట్టింది. ఆ తరువాత ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ పూర్తి చేశాను.


మహిళలంటే చిన్నచూపు

ఉద్యోగం చెయ్యడం కన్నా సొంతంగా సీఏ ప్రాక్టీస్‌ చేయాలనుకున్నాను. అయితే అది అంత సులువు కాదు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడం, ఐటి అధికారులతో మాట్లాడడం మహిళలకు ఇబ్బందే. కాబట్టి తల్లిదండ్రులో, భర్తో ప్రాక్టీ్‌సలో ఉంటే తప్ప... మహిళలు సీఏ ప్రాక్టీస్‌ చేసేవారు కాదు. నేను ధైర్యం చేశాను. 2013 నుంచి పధ్నాలుగేళ్ళపాటు ప్రాక్టీస్‌ చేశాను. ఇదంతా నిబద్ధత వల్ల, కష్టపడి పని చేయడం వల్ల సాధ్యమయింది. అయితే వ్యాపార రంగంలో ప్రవేశించాలనేది నా కోరిక. దానికి అవసరమైన పెట్టుబడిని ప్రాక్టీస్‌ చేస్తూ సమకూర్చుకున్నాను. ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా చాలామంది విదేశీ క్లయింట్లకు మన దేశంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి సాయం చేశాను. ఆ అనుభవాల దృష్ట్యా రియల్‌ ఎస్టేట్‌ రంగం అనువైనదని అనిపించింది. కో-వర్కింగ్‌ ప్లేస్‌ అనేది రియల్‌ ఎస్టేట్‌లో ఒక భాగం. అందుకే దాన్ని ఎంచుకున్నాను. 2017లో ‘ఐస్రౌట్స్‌’ను స్థాపించాను. మొదటగా హైదరాబాద్‌లో 1200 చదరపు అడుగుల్లో దాదాపు 200 సీట్లు ఉండే కార్యాలయంతో అది ప్రారంభమయింది. పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే రంగం ఇది. మహిళలంటే చిన్న చూపు, అణచివేత ధోరణి కూడా ఉంటాయి. మేము రియల్‌ ఎస్టేట్‌తో అనుసంధానమై ఉంటాం. బిల్డర్స్‌తో, రకరకాల కంపెనీలతో వ్యవహరించాల్సి ఉంటుంది. దాదాపు ఎన భై శాతం పురుషులే ఉండే పరిస్థితుల్లో... మహిళలకు ఇది ఎప్పుడూ సవాలే. అయితే ప్రతి విభాగంలో అనుభవజ్ఞులతో బృందాల్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో మాకు పెద్దగా సమస్య ఎదురవలేదు. కానీ ఇతర నగరాలకు వెళ్ళినప్పుడు... అవి మాకు అపరిచితమైన ప్రాంతాలు కావడం వల్ల, పోటీ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అక్కడి వాళ్ళతో సమావేశాలు జరపడం, మా సేవల గురించి వివరించడం, ఒప్పించడం లాంటివి చేశాం. క్రమంగా ఆ అవరోధాలన్నిటినీ దాటాం. ఇతర నగరాలకు విస్తరించాం. కొవిడ్‌ వచ్చే సమయానికి... 2,50,000 చదరపు అడుగులకు మా కార్యాలయాల విస్తీర్ణాన్ని పెంచగలిగాం.

అది గర్వంగా చెప్పగలను...

కొవిడ్‌ సమయంలో మా కార్యకలాపాలకు ఆటంకాలు ఎదురయ్యాయి. అందరూ ఇళ్ళ దగ్గరనుంచే పని చేయడంతో... పెద్ద కంపెనీలు తమ భవనాలను ఖాళీ చేశాయి. పరిస్థితులు చక్కబడిన తరువాత కో-వర్కింగ్‌ ప్రదేశాల మీద దృష్టి సారించాయి. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో కంపెనీలు మాకు కస్టమర్లుగా ఉన్నాయి. వారి అవసరాలకు అనుగుణంగా... కస్టమైజ్డ్‌ వర్కింగ్‌ ప్లేసుల్ని ఆఫర్‌ చేస్తున్నాం. మా దగ్గర 700 మందికి పైగా ఉద్యోగులున్నారు. వారిలో 45 నుంచి 50 శాతం మంది మహిళలే. ఇది ఒక మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను గర్వంగా చెప్పగలను. అంతేకాదు... సపోర్టింగ్‌ స్టాఫ్‌ మెజారిటీ మహిళలే. వారి భద్రత, సౌకర్యం కోసం అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్నాం.


మహిళలు అంకితభావంతో శ్రమిస్తే వారు అనుకున్నది సాధించగలరు. మా సంస్థ ప్రారంభించిన తొలి సంవత్సరాల్లో, కొవిడ్‌ సమయంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాను. అవన్నీ దాటాను. ఇప్పుడు మరో ఛాలెంజింగ్‌ ప్రాజెక్ట్‌ను... తెలంగాణలో తొలి వైనరీ ప్రాజెక్ట్‌ ప్రారంభించబోతున్నా. ఈ రంగంలోనూ మహిళలు కనిపించరు. ఈ వ్యాపారం ఒక మహిళ ఎలా చేస్తారన్న వ్యాఖ్యలు నాకు ఎదురయ్యాయి. కానీ నేను స్థిరంగా నిలబడ్డాను.

6-Navya.jpg

గ్రేప్‌ కల్చర్‌ను మళ్ళీ తీసుకొస్తా...

తెలంగాణకు మళ్ళీ గ్రేప్‌ కల్చర్‌ తీసుకురావాలనేది నా ఆశయం. దీనికోసం ప్రభుత్వంతో కలిసి మూడేళ్ళు పని చేశాం. అవసరమైన లైసెన్సులు తీసుకున్నాం. త్వరలోనే తొలివిడత ఉత్పత్తి పూర్తవుతుంది. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల వ్యవసాయ రంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. పాతికేళ్ళ క్రితం ద్రాక్ష పండ్లకు హైదరాబాద్‌ ఎంతో ప్రసిద్ధి చెందింది. వాటిని ఎగుమతి కూడా చేసేవారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం విస్తరించడంతో... ఆ తోటలన్నీ మాయమైపోయాయి. వాస్తవానికి ఇతర రాష్ట్రాలకన్నా ఈ నేల మీద రెండింతల దిగుబడిని మేము సాధించాం. కాబట్టి రైతులకు అవగాహన కల్పించి, శిక్షణ అందించి, వేర్వేరు వైనరీ కంపెనీలను ఆహ్వానిస్తే... కాలక్రమేణా అదొక వ్యవస్థగా మారుతుంది. ఈ దిశగా కంపెనీలు, ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. నా మొత్తం ప్రయాణంలో మా అమ్మ నాకు గట్టి మద్దతుగా నిలిచింది. ఇక, మా అమ్మాయి కూడా ఛార్టర్డ్‌అకౌంటెంట్‌. ఎంబియే కూడా చేసింది. ఇప్పుడు మా వ్యాపారాల్లో సాయపడుతోంది. వీరిద్దరూ నాకు స్ట్రాంగ్‌ పిల్లర్స్‌.’’

కృష్ణశర్మ

నాలుగేళ్ళ క్రితం ఈ రంగాన్ని పరిశీలిస్తే... కో వర్కింగ్‌ స్పేస్‌లో మహిళల భద్రత, ఇతర సదుపాయాల్లాంటి వాటి గురించి క్లయింట్లలో అపోహలు ఉండేవి. వాటి గురించి వివరించి, ఒప్పించాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది పూర్తిగా పరిణామం చెందిన పరిశ్రమ. పూర్వం ఒక కంపెనీలో 200 సిబ్బంది ఉంటే... వాళ్ళు ఒక భవనం తీసుకొని, దాన్ని తమకు అనువుగా తీర్చిదిద్దుకోవడానికి పెట్టుబడి పెట్టి, నిర్వహణ కోసం శ్రమపడాల్సి వచ్చేది. కో-వర్కింగ్‌ స్పేస్‌ల వల్ల ఇప్పుడు అది సులువయింది. మేము అరవై రోజుల్లో వారికి కావలసిన విధంగా కార్యాలయాన్ని తయారు చేసి ఇస్తాం. కాబట్టి ప్రస్తుతం కంపెనీలకి ఇది చాలా చక్కటి ఎంపికగా మారింది. మా కో-వర్కింగ్‌ స్పేసె్‌సలో నాణ్యతా ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి. ఫుడ్‌కోర్ట్స్‌, కెఫెటేరియా, జిమ్‌, యోగా, క్రచ్‌... ఇలా ఎన్నో సౌకర్యాలు వాటిలో అందిస్తున్నాం. మా ఆఫీసులు మెట్రో స్టేషన్స్‌కు దగ్గర్లో ఉంటాయి. ఒక విధంగా మేము ఫైవ్‌ స్టార్‌ సౌకర్యాలను సమకూరుస్తున్నాం. ఏదైనా సమస్య తలెత్తితే 24 గంటల్లో పరిష్కరిస్తున్నాం. ఇది కంపెనీలకు, వాటి ఉద్యోగులకు ఎంతో సౌలభ్యంగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి..

ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ

Updated Date - Mar 08 , 2026 | 02:34 AM