Share News

కృత్రిమ చక్కెరలో అదనపు క్యాలరీలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:39 AM

చక్కెర తినడానికి వెనకాడే వాళ్లు కృత్రిమ తీపిని మరో ఆలోచన లేకుండా తినేస్తున్నారు. కానీ నిజానికి సుగర్‌ ఫ్రీ స్వీట్లు, జీరో సుగర్‌ కోలాలు సుగర్‌ ఫ్రీ కావు.,,,

కృత్రిమ చక్కెరలో  అదనపు క్యాలరీలు

సుగర్‌ ఫ్రీ?

చక్కెర తినడానికి వెనకాడే వాళ్లు కృత్రిమ తీపిని మరో ఆలోచన లేకుండా తినేస్తున్నారు. కానీ నిజానికి సుగర్‌ ఫ్రీ స్వీట్లు, జీరో సుగర్‌ కోలాలు సుగర్‌ ఫ్రీ కావు.

ఇప్పుడు ఏ సూపర్‌మార్కెట్లోకి అడుగు పెట్టినా, జీరో సుగర్‌ ఉత్పత్తులే కనిపిస్తున్నాయి. స్టీవియాతో తయారైన చాక్లెట్లు, సుగర్‌ ఫ్రీ బిస్కెట్లు, చక్కెర కలపలేదనే లేబుల్‌ కలిగి ఉండే ఐస్‌క్రీమ్స్‌, కేకులు, తీపి పదార్థాలు...ఇలా లెక్కలేనన్ని ఆహార ఉత్పత్తులు మనల్ని ఆకర్షిస్తున్నాయి. తీపి తెచ్చే చేటు గురించి అవగాహన కలిగిన వాళ్లు సుగర్‌ ఫ్రీ ఉత్పత్తులను ఆకర్షితులవడం సహజమే! అయితే సుగర్‌ లేదని చెప్పుకుంటున్న ఈ పదార్థాలు, వాటి తయారీలో ఉపయోగించిన కృత్రిమ చక్కెరలు ఎంతవరకూ ఆరోగ్యకరం?

కృత్రిమ చక్కెరలు లెక్కలేనన్ని...

ఉత్పత్తుల మీద లేబుళ్లను చదివి, వాటి తయారీలో ఉపయోగించిన దినుసులను పరిశీలించి, క్యాలరీలను లెక్కించే అలవాటు మనలో పెరిగిపోయింది. ఇలా పెంచుకున్న ఆరోగ్య అవగాహనతో ‘జీరో సుగర్‌’, ‘సుగర్‌ ఫ్రీ’ లేదా ‘నో యాడెడ్‌ సుగర్‌’ అని రాసి ఉన్న ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు. కానీ నిజానికి సుగర్‌ ఫ్రీ అని పేర్కొన్నంత మాత్రాన ఆ ఉత్పత్తుల్లో చక్కెర లేదని అనుకోడానికి వీల్లేదు. బదులుగా ప్రత్యామ్నాయ తీపి పదార్థాలైన స్టీవియా, సుక్రలోజ్‌, ఆస్పర్టేమ్‌, ఏస్‌సల్ఫేమ్‌ పొటాషియం, ఎరిత్రిటాల్‌, సార్బిటాల్‌ లాంటి సుగర్‌ ఆల్కహాల్‌ను ఉపయోగిస్తారు. ఆ విధంగా సాధారణ చక్కెరను ఏమాత్రం ఉపయోగించకుండా లేదా అతి కొద్ది పరిమాణంలో ఉపయోగించి ఈ ఉత్పత్తులకు తీపిని జోడిస్తారు. కొన్ని కృత్రిమ తీపి పదార్థాలు విపరీతంగా తీయగా ఉంటాయి. కాబట్టి ఉత్పత్తిదారులు వాటిని కొద్ది పరిమాణాల్లో ఉపయోగిస్తారు. స్టీవియా రెబాడియానా మొక్క ఆకులతో తయారుచేసే స్టీవియాలో స్టీవియాల్‌ గ్రైకొసైడ్స్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సాధారణ చక్కెర కంటే ఎంతో ఎక్కువ తీయగా ఉంటుంది. అలాగే సుక్రలోజ్‌ తీయదనం కూడా ఎక్కువే! సుగర్‌ ఆల్కహాల్స్‌ను సాధారణంగా ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌లో ఉపయోగిస్తారు. తీపి రుచిని అందిస్తూనే క్యాలరీల మోతాదును తగ్గించడం కృత్రిమ చక్కెరలను వినియోగించే ఉత్పత్తి దారుల ప్రధాన లక్ష్యం.


దినుసుల మీద కన్నేసి..

కృత్రిమ చక్కెరలతో క్యాలరీల మోతాదు తగ్గే మాట వాస్తవమే అయినా, పదార్థం తయారీలో ఉపయోగించే దినుసుల రూపంలో మన శరీరంలోకి ఎన్ని క్యాలరీలు చేరుకుంటున్నాయో గమనించాలి. సాధారణంగా ప్యాకెట్ల మీద కనిపించే ‘సుగర్‌ ఫ్రీ’ అనే ఆకర్షణీయమైన అక్షరాలే మనల్ని ఆకట్టుకుంటాయి. కానీ పదార్థం తయారీలో ఉపయోగించిన దినుసులు, సర్వింగ్‌ సైజు, మొత్తం కార్బొహైడ్రేట్లు, చక్కెర మోతాదుల మీద దృష్టి పెట్టాలి.

వాటి ఆధారంగా తినే పదార్థం పరిమాణాన్ని లెక్కించి తీసుకోగలిగితే, కృత్రిమ చక్కెరల రూపంలో మన శరీరంలోకి చేరే అదనపు చక్కెరలకు అడ్డుకట్ట వేయవచ్చు.

ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 05:39 AM