మొలకల్లో మతలబులు
ABN , Publish Date - Feb 17 , 2026 | 02:42 AM
మొలకలు పోషకాల భాండాగారాలు. అయితే ఆ పోషకాలను శరీరం గరిష్ఠంగా శోషించుకోగలగాలంటే మొలకల విషయంలో కొన్ని నియమాలను పాటించాలంటున్నారు...
పోషణ
మొలకలు పోషకాల భాండాగారాలు. అయితే ఆ పోషకాలను శరీరం గరిష్ఠంగా శోషించుకోగలగాలంటే మొలకల విషయంలో కొన్ని నియమాలను పాటించాలంటున్నారు పోషకాహార నిపుణులు.
గింజలు మొలకెత్తినప్పుడు వాటిలోని పోషకాల అరుగుదలకూ, శోషణ పెరుగుతుంది. అన్ని గింజల్లో ఫైటేట్స్ అనే జీర్ణం కాని పోషకాలుంటాయి. ఇవి మనకు అవసరమే అయినా శక్తినిచ్చే ఇతర సూక్ష్మ పోషకాల శోషణకు ఫైటేట్స్ అడ్డుపడతాయి. కాబట్టి వీటి ప్రభావాన్ని తగ్గించడం కోసం గింజలను నానబెట్టుకోవాలి. మన శరీరం సమర్థంగా నూటికి నూరు శాతం ఐరన్‌ను శోషించుకోలేదు. దీనికి పలు కారణాలు లేకపోలేదు. కాబట్టి ఈ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం గింజలను నానబెట్టి, మొలకెత్తించి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల తేలికగా జీర్ణమవడంతో పాటు, పోషకశోషణకు అడ్డుపడే అంశాల మోతాదు తగ్గిపోతుంది.
రాగి మాల్ట్ మెరుగు
రాగులను మొలకెత్తించి, ఆరబెట్టి, దోరగా వేయించి పిండిలా దుంచుకోడాన్ని మాల్టింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల రాగుల్లోని పిండిపదార్థాలు మాల్ట్‌గా మారిపోతాయి. ఈ ప్రక్రియ కూడా పోషకాల శోషణకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది కాబట్టి శక్తి మోతాదులు పెరుగుతాయి. సాధారణ రాగి జావతో పోల్చితే, రాగి మాల్ట్‌తో పొందే పోషక ప్రయోజనం రెట్టింపు ఉంటుంది. వంద గ్రాముల రాగుల్లో 300 క్యాలరీలుంటే, వాటిని మొలకెత్తించకుండా తీసుకున్నప్పుడు ఆ క్యాలరీలన్నీ శరీరానికి అందవు. కానీ మొలకెత్తించి తీసుకున్నప్పుడు శరీరానికి అందే క్యాలరీల పరిమాణం పెరుగుతుంది.
మధుమేహులు అప్రమత్తంగా...
తొందరగా అరిగి, తొందరగా శోషణ చెందుతాయి. దాంతో రక్తంలో చక్కెర పెరిగిపోతుంది కాబట్టి మధుమేహులు మొలకలను సలాడ్‌తో కలిపి పరిమితంగా తీసుకోవాలి. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉండే రాగి జావ కూడా మధుమేహులు పరిమితం చేసుకోవాలి. అలాగే అనీమియాతో బాధపడేవారు, బాడీ మాస్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవారు అర కప్పు నుంచి ముప్పావు కప్పు వరకూ మొలకలు తీసుకోవచ్చు. అలాగే పెద్దలు మొలకలను నేరుగా కాకుండా పిండి రుబ్బి దోసెల రూపంలో తీసుకోవడం ఉత్తమం. క్యాన్సర్ రోగులు ఆవిరి మీద ఉడికించిన మొలకలు తినడం ఆరోగ్యకరం. ఆరోగ్యవంతులు మొలకలను నేరుగా తినాలి.
ఎంత పెద్ద మొలక
గింజలను మొలకెత్తించే విషయంలో, మొలక ఎంత పొడవు పెరిగిన తర్వాత తినాలి అనే విషయంలో పలు అనుమానాలుంటాయి. అయితే గింజ మొలకెత్తినప్పుడు దాని పొడవును బట్టి పోషకాల పరిమాణం కూడా మారుతూ ఉంటుంది. అయితే అరంగుళం నుంచి అంగుళం పొడవు పెరిగిన మొలకలను ఎంచుకోవడం మంచిది. అలాగే వాటిని నానబెట్టే నీళ్లు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మొలకెత్తిన గింజలను ఫ్రిజ్‌లో జాగ్రత్తగా భద్రపరుచుకుని తినాలి. అలాగే బూజు పట్టే అవకాశం ఎక్కువ కాబట్టి మొలకలను వీలైనంత జాగ్రత్తగా మొలకెత్తించుకోవాలి. సూపర్‌మార్కెట్లలో దొరికే మొలకల కోసం ఏ నీళ్లు ఉపయోగించారో, ఎలాంటి పరిసరాల్లో మొలకెత్తించారో తెలియదు కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది.
నానబెట్టడం ఉత్తమం
ఉలవలు, శనగలు, పెసలు, బొబ్బర్లు... ఇలా ఏ గింజకైనా ఈ సూత్రం వర్తిస్తుంది. వీటిని నానబెట్టి, మొలకెత్తించి, వాడుకోవాలి. మిల్లెట్స్‌ను కూడా నేరుగా వండుకోకూడదు. వాటిని కూడా రాత్రంతా నానబెట్టుకుంటే, పోషక శోషణ పెరుగుతుంది.
డాక్టర్ లత శశి,
చీఫ్ న్యూట్రిషనిస్ట్,
ఫెర్నాండెజ్ హాస్పిటల్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News