Share News

ఆధ్యాత్మిక అప్రమత్తత

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:41 AM

‘అప్రమత్తత ఉంటే సామాన్యుడు కూడా మహాత్ముడు కాగలడు’ అనేది పెద్దల మాట. అప్రమత్తత అనేది ఏదైనా ప్రమాదాన్ని లేదా పరిస్థితిని ముందుగానే పసిగట్టి... దానికి అనుగుణంగా...

ఆధ్యాత్మిక అప్రమత్తత

చింతన

‘అప్రమత్తత ఉంటే సామాన్యుడు కూడా మహాత్ముడు కాగలడు’ అనేది పెద్దల మాట. అప్రమత్తత అనేది ఏదైనా ప్రమాదాన్ని లేదా పరిస్థితిని ముందుగానే పసిగట్టి... దానికి అనుగుణంగా, సిద్ధంగా ఉండడాన్ని సూచిస్తుంది. మనసు ఒక అడవి గుర్రం లాంటిది. దానికి అప్రమత్తత అనే కళ్ళెం లేకపోతే... అది ఊబిలోకి తీసుకువెళ్తుంది. సంస్కృతంలో ‘ప్రమాదో మృత్యుః’ (అప్రమత్తత లేకపోవడమే మరణం) అంటారు.

ఆధ్యాత్మిక అప్రమత్తత అంటే మన మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనను గమనించడం. ‘మనం ఏం ఆలోచిస్తున్నాం? ఎందుకు కోప్పడుతున్నాం?’ అని మనల్ని మనం ఒక సాక్షిలా గమనించడమే నిజమైన మెలకువ. ‘ఏది నిత్యమైనది? ఏది అనిత్యమైనది?’ అని గుర్తించడమే అప్రమత్తత. లోకంలో మాయకు లోనుకాకుండా... ఆత్మజ్ఞానం వైపు పయనించడానికి ఆ మెలకువ అవసరం. మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటి విషయాలవైపు పరిగెడుతూ ఉంటాయి. అప్రమత్తంగా లేకపోతే అవి మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. ముక్తిని సాధించాలంటే... ప్రతి క్షణం ఆలోచనల మీద నిఘా ఉంచాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లేదా పని చేసేటప్పుడు అప్రమత్తంగా ఉంటే... ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. తద్బుద్ధియః... దేన్ని సాధించాలని సంకల్పించామో దాని మీద బుద్ధి లగ్నం కావాలి. తదాత్మానః... లక్ష్యంతో త్రికరణ శుద్ధిగా మమేకం కావాలి. తన్నిష్ఠాః... లక్ష్యంపై చెక్కుచెదరని నిష్ఠ అవసరం. ‘నిష్ఠ’ అంటే శ్రద్ధాసక్తులు. లక్ష్య సాధనపై స్పష్టత, ఆలోచనల్లో చురుకుదనం, పరిస్థితులపట్ల అప్రమత్తత, బుద్ధితో సకారాత్మక ఆలోచనలు చేయడం... వీటికి నియమాలతో కూడిన క్రమశిక్షణ తోడైతే కార్యం సఫలమవుతుంది. తత్పరాయణత... ఆలోచనలన్నీ సంకల్పిత లక్ష్యం దగ్గర పరిసమాప్తం కావాలి. నిశ్చలమైన నీటిలో గులకరాయి వేస్తే తరంగాలు ఎలాగైతే ఒడ్డున చేరి పరిసమాప్తం అవుతాయో.. ఆలోచనలు కూడా భగవంతుడిపైనే పరిసమాప్తి కావాలి. ‘‘త్రికరణ శుద్ధిగా ఎవరైతే ‘తద్భుద్ధియః, తదాత్మానః, తన్నిష్ఠాః, తత్పరాయణత’’ కలిగి ఉంటారో... వారు తాము ఎదిగిన స్థితి నుంచి పతనం కారు’’ అంటున్నాడు పరమాత్మ.


వర్తమానంలో ఉండాలి...

ఆధ్యాత్మికపరంగా అప్రమత్తత అంటే కేవలం బాహ్యప్రపంచం పట్ల జాగ్రత్తగా ఉండడం మాత్రమే కాదు... మన లోపల జరుగుతున్న ఆలోచనలు, భావోద్వేగాల పట్ల మెలకువగా ఉండడం. అప్రమత్తత కలిగిన సాధకుడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటాడు, చాలామంది గతం గురించి బాధపడుతూనో, భవిష్యత్తు గురించి భయపడుతూనో ఉంటారు. కానీ ఆధ్యాత్మిక అప్రమత్తత మనల్ని ఈ క్షణంలో (వర్తమానంలో) ఉంచుతుంది. భగవంతుణ్ణి లేదా సత్యాన్ని చేరుకోవడానికి వర్తమానంలో ఉండడమే ఏకైక మార్గం. నిజాయితీ, జ్ఞానం, ప్రేమ, ధైర్యం లాంటి సుగుణాలు మనిషిని ప్రమాదాలను గుర్తించేలా చేస్తాయి. తప్పులు చేయకుండా అప్రమత్తంగా ఉంచుతాయి. దీపం వెలగాలంటే ప్రమిద, నూనె, వత్తి (సుగుణాలు) ఉండాలి. అప్పుడు వచ్చే వెలుతురు అప్రమత్తత లాంటిది. సుగుణాలు అనే ఇంధనం లేకపోతే అప్రమత్తత అనే వెలుగు ఎక్కువకాలం నిలవదు. ‘‘అప్రమత్తత అన్ని సుగుణాలకు మూలం. సుగుణాలు అప్రమత్తతను పోషిస్తాయి’’ అని బుద్ధుడు చెప్పాడు.

మధ్యేమార్గం

అనవసరమైన మాటలు తగ్గించినప్పుడు... మన లోపలి శబ్దాన్ని వినే అప్రమత్తత పెరుగుతుంది. రోజూ ధ్యానం చేయడం వల్ల మనస్సు ఏకాగ్రతను పొంది, పరధ్యానం తగ్గుతుంది. మంచి వ్యక్తుల మధ్య ఉండడం వల్ల మనలోని ఆధ్యాత్మిక చైతన్యం నిరంతరం మేలుకొంటూ ఉంటుంది. జీవితంలో అతిగా సుఖాలను అనుభవించడం లేదా శరీరాన్ని అతిగా కష్టపెట్టుకోవడం... ఈ రెండూ కాకుండా మధ్యస్థంగా ఉండాలన్నాడు బుద్ధుడు. వీణ తంత్రి మరీ బిగుతుగా ఉండకూడదు, మరీ వదులుగా ఉండకూడదు. అప్పుడే సంగీతం పుడుతుందని ఆయన ఉదాహరణ ఇచ్చాడు. గదిలో వెలుతురు ఉంటే ఏది పామో, ఏది తాడో తెలుస్తుంది. అలాగే అప్రమత్తత అనే వెలుతురు మనలో ఉంటే... ఏది మనల్ని బంధిస్తుందో, ఏది విముక్తుల్ని చేస్తుందో స్పష్టంగా కనిపిస్తుంది. అరిషడ్వర్గాలు అనే దొంగలు చీకటి ఉన్నప్పుడే, అంటే ఏమరుపాటుగా ఉన్నప్పుడే దోచుకుంటాయి. అప్రమత్తత అనే దీపాన్ని వెలిగించి ఉంచితే... ఆ దొంగలు మన మనస్సులోకి ప్రవేశించలేవు. అప్రమత్తత ఉన్న చోట దుఃఖం ఉండదు. అందుకే అప్రమత్తతను ‘అమృతపథం’ అని పిలుస్తారు.

తరిగొప్పుల

విఎల్లెన్‌ మూర్తి


అన్నం తినేటప్పుడు టీవీ చూడకుండా, ఫోన్‌ వాడకుండా... కేవలం ఆ ఆహారం రుచిని, వాసనను, నమిలే విధానాన్నీ గమనించండి. అలాగే నడిచేటప్పుడు పాదాల స్పర్శను గమనించండి. సాధన వల్ల మెదడుకు ఏకాగ్రత అవసరం అవుతుంది. మనం చేసే ప్రతి చిన్న పని ఒక సంస్కారాన్ని మిగులుస్తుంది. అప్రమత్తంగా ఉండి చేసే పనులు మనల్ని కర్మబంధాల నుంచి విముక్తుల్ని చేస్తాయి. లక్ష్యం (ముక్తి) అనేది ఒక గమ్యమైతే... అప్రమత్తత ఆ గమ్యానికి తీసుకువెళ్ళే మార్గం. నిరంతర సాధన ద్వారా మాత్రమే ఆ గమ్యాన్ని చేరడం సాధ్యమవుతుంది.

ఇవి కూడా చదవండి..

కేబినెట్ భేటీలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

పంట గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 04:41 AM