కొత్త సారథి
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:35 AM
‘సవాలు ఎదురైనప్పుడు నా అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుంది’... కొన్నేళ్ల కిందట స్మృతి మంధాన చెప్పిన మాటలివి. నిజమే... ఆమె కెరీర్‌ను పరిశీలించిన ఎవరికైనా ఇది అర్థమవుతుంది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ టోర్నీల్లో...
సంకల్పం
‘సవాలు ఎదురైనప్పుడు నా అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుంది’... కొన్నేళ్ల కిందట స్మృతి మంధాన చెప్పిన మాటలివి. నిజమే... ఆమె కెరీర్‌ను పరిశీలించిన ఎవరికైనా ఇది అర్థమవుతుంది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ టోర్నీల్లో... కీలక సమయాల్లో... అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును నిలబెట్టిన తీరు ప్రత్యర్థుల ప్రశంసలు సైతం అందుకుంది. ఎక్కడో చిన్న గ్రామం నుంచి వచ్చిన 30 ఏళ్ల స్మృతి ప్రయాణం... ఆరాధ్య ఆటగాళ్ల స్ఫూర్తితో... అచంచలమైన ఆత్మవిశ్వాసంతో నేడు భారత మహిళల క్రికెట్ జట్టు సారథిగా శిఖరాగ్రానికి చేరింది.
భారత మహిళల క్రికెట్ ఇప్పటివరకు అందించిన అత్యుత్తమ క్రీడాకారిణుల్లో ఒకరు స్మృతి మంధాన. ఇది క్రికెట్ పండితుల మాట. టెస్టులు, వన్డేలు, టీ20లు... ఫార్మాట్ ఏదైనా అందులో ఇట్టే ఒదిగిపోయి... జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వడం అలవాటుగా మార్చుకుంది ఈ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌వుమన్. తొమ్మిదేళ్లకే మహారాష్ట్ర అండర్-15 జట్టుకు ఎంపికై, పదకొండేళ్లకు అండర్-19 జట్టులో చోటు సంపాదించుకున్న స్మృతి పుట్టింది ముంబయిలో. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన, సోదరుడు శ్రావణ్ కూడా జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెటర్లే. తల్లి స్మిత గృహిణి. శ్రీనివాస్ ఒకప్పుడు కెమికల్ డిస్ర్టిబ్యూటర్. స్మృతికి రెండేళ్లప్పుడు ఆమె కుటుంబం ముంబయి నుంచి మహారాష్ట్ర మాధవ్‌నగర్ శివార్లలోని సంగ్లీకి మారింది. చిన్నప్పటి నుంచీ అన్నయ్య మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించిన ఆమె... ఆటపై మక్కువ పెంచుకుంది. తరువాత అతనితో కలిసి సాధన చేసింది. పేపర్లలో వచ్చిన అతని మ్యాచ్ క్లిప్పింగ్స్‌ను కట్ చేసి భద్రపరుచుకునేది. ‘ఒక రోజు నేను కూడా ఇలానే పరుగులు సాధిస్తాను. అన్నయ్యతో కలిసి నెట్స్‌కు వెళతానని చెప్పినప్పుడు మా నాన్న ఎప్పుడూ వద్దనలేదు’ అంటూ ఓ సందర్భంగా గుర్తుచేసుకున్న స్మృతి వాస్తవానికి కుడిచేతి వాటం క్రీడాకారిణే. కానీ ఆమె తండ్రి తన బిడ్డను ఎడమచేతి వాటం బ్యాట్స్‌వుమన్‌గా తీర్చిదిద్దాలనుకున్నారు. అలా ఆయన నేతృత్వంలో ఆమె లెఫ్ట్‌హ్యాండర్‌గా సాధన చేస్తూవచ్చింది.
పదహారేళ్లకే టీమ్ ఇండియా జెర్సీ...
సంగ్లీ చింతామణ్‌రావ్ కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఈ స్టార్ ఓపెనర్ 2013లో లిస్ట్-ఎ అండర్-19 మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. అది మొదలు స్మృతి రికార్డులు తిరగరాస్తూ... భారత జట్టు తలుపు తట్టింది. అదే ఏడాది భారత టీ20, వన్డే జట్టుకు ఎంపికైంది. బంగ్లాదేశ్‌తో టీ20 ద్వారా తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే సమయానికి ఆమె వయసు 16 సంవత్సరాలు. ‘‘నేను మొదటిసారి భారత జట్టుతో కలిసినప్పుడు అక్కడి ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని, కోచ్‌లను చూడటం ఒక గొప్ప అనుభూతినిచ్చింది. డ్రెస్సింగ్‌రూమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు భయమేసింది. అప్పుడు ఝులన్ గోస్వామి నా దగ్గరకు వచ్చి... ‘‘ప్రతిఒక్కరికీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇది చాలా సాధారణం’ అని చెప్పింది. అప్పుడు తను నా రూమ్‌మేట్. ఎన్నో విషయాల్లో అండగా నిలిచింది. ఇప్పుడు నేను కూడా జట్టులోకి ఎవరైనా కొత్త క్రీడాకారిణి వచ్చినప్పుడు, వారితో మాట్లాడి, భయం పోగొట్టి, సౌకర్యంగా ఉండేలా చూసుకొంటున్నాను’’ అంటుంది ఈ స్టార్ ఓపెనర్.

ద్రవిడ్ ఇచ్చిన బ్యాట్‌తో...
కెరీర్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌ల్లో స్మృతి ఓవర్‌సైజ్‌డ్ బ్యాట్‌తో బరిలోకి దిగింది. ఆ బ్యాట్‌కు ఒక ప్రత్యేకత ఉంది. క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సంతకం చేసి ఇచ్చిన బ్యాట్ అది. ‘‘అన్నయ్య రాహుల్ సర్‌ను కలిసి ఒక బ్యాట్ ఇవ్వగలరా అని అడిగాడు. ఆయన నా పేరుతో సంతకం చేసి ఇచ్చారు. నా కోసం అన్నయ్య ఆ బ్యాట్ తీసుకున్నాడు. దాన్ని ఒక మెమరీగా దాచుకొందామని అనుకున్నాను. కానీ చేతిలోకి తీసుకోగానే బ్యాలెన్స్ అద్భుతంగా అనిపించింది. దాంతో ఆడటం మొదలుపెట్టాను’’ అంటూ చెప్పుకొచ్చిన స్మృతి ఆ బ్యాట్‌తోనే గుజరాత్‌తో జరిగిన అండర్-19 మ్యాచ్‌లో 150 బంతుల్లో 224 పరుగుల రికార్డు స్కోరు చేసింది. 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి టెస్ట్ ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో 22, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేసి జట్టు చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించింది. నాటి నుంచి భారత జట్టులో స్మృతి విలువైన సభ్యురాలిగా మారింది. మాజీ కెప్టెన్, ఆరాధ్య క్రికెటర్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లతో పాటు భారత బ్యాటింగ్‌కు మూల స్తంభం అయింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పది వేలకు పైగా పరుగులు సాధించింది. వీటిల్లో 18 సెంచరీలున్నాయి. మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన తొలి భారత మహిళ కూడా.

ఎన్నాళ్లో వేచిన ఉదయం...
ఎన్నో ఏళ్ల నుంచి స్మృతి భారత మహిళా జట్టు కెప్టెన్ రేసులో పోటీపడుతోంది. జట్టుకు అద్భుతమైన ఆరంభాన్నిస్తూ, ఆపద సమయాల్లో ఆదుకొంటూ తనదైన ముద్ర వేసింది. వాస్తవానికి సారథ్య బాధ్యతలు ఆమెకు అప్పగించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ బీసీసీఐ హర్మన్‌ప్రీత్‌ను కొనసాగిస్తూ వచ్చింది. ఆసియా కప్‌కు ముందు ‘మీరు కెప్టెన్సీ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారా?’ అని అడిగిన ప్రశ్నకు ‘సిద్ధమే’నని సమాధానం ఇచ్చింది స్మృతి. గత సంవత్సరం స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ గెలిచిన తరువాత కెప్టెన్సీ మార్పు ఉంటుందని అందరూ భావించారు. కానీ నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన అనంతరం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రకటించింది. దాంతో స్మృతికి పగ్గాలు అప్పగిస్తున్నట్టు సెలక్షన్ కమిటీ వెల్లడించింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఇన్నేళ్లకు ప్రసరించింది. జట్టులో అందరికంటే మెరుగ్గా రాణిస్తున్నా, ప్రతిభకు కొదవ లేకపోయినా స్మృతికి సుదీర్ఘ కాలం నిరీక్షణ తప్పలేదు. ఇదే ఆమెను అసహనానికి గురి చేసింది. వ్యక్తిగతంగా కూడా స్మృతి ఊహించని సమస్యలు ఎదుర్కొంది. ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని తపించినా... చివరకు ఆ బంధం అర్ధంతరంగా ముగిసింది. కానీ ఆ ప్రభావం ఆటపై పడకుండా ఎంతో పరిణతితో వ్యవహరించింది స్మృతి. నేడు భారత జట్టు సారథిగా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఆమె మరిన్ని చిరస్మరణీయ విజయాలను అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
అవార్డుల పంట...
దశాబ్దానికి పైగా భారత మహిళల క్రికెట్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన స్మృతి ఎన్నో పురస్కారాలు అందుకుంది. నాలుగుసార్లు ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. ‘‘నాకు తొమ్మిదేళ్లప్పుడు నాకంటే నాలుగైదు ఏళ్లు పెద్దవాళ్లయిన అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేదాన్ని. వాళ్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనగలిగాను. అది చూసి మా నాన్న నన్ను సెలక్షన్ ట్రయల్స్‌కు తీసుకువెళ్లాలని అనుకున్నారు. మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించడం మొదలుపెట్టాక... మిథాలీరాజ్, ఝులన్ గోస్వామి గురించి విన్నాను. నేను కూడా ఈ గొప్ప క్రీడాకారులతో కలిసి భారత జట్టుకు ఆడగలనని అనిపించేది’’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్న స్మృతి... పట్టుదల, అంకితభావంతో అనుకున్నది సాధించింది.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ