Share News

గాడ్జెట్స్‌ కంట్రోల్‌ మీ చేతిలోనే

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:37 AM

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్‌తోనే సరిపోతోంది. ఈ గాడ్జెట్లు మన పనిభారాన్ని తగ్గిస్తున్నప్పటికీ.. తెలియకుండానే డిజిటల్‌ ఒత్తిడి, కంటిచూపు...

గాడ్జెట్స్‌ కంట్రోల్‌ మీ చేతిలోనే

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్‌తోనే సరిపోతోంది. ఈ గాడ్జెట్లు మన పనిభారాన్ని తగ్గిస్తున్నప్పటికీ.. తెలియకుండానే డిజిటల్‌ ఒత్తిడి, కంటిచూపు సమస్యలు, నిద్రలేమికి కారణమవుతున్నాయి. అలాగని ఫోన్లను పూర్తిగా పక్కన పెట్టలేం. అందుకే, ప్రశాంతమైన జీవితం కోసం గాడ్జెట్లను స్మార్ట్‌గా కంట్రోల్‌ చేసే సింపుల్‌ హ్యాక్స్‌ ఇవే!

గ్రేస్కేల్‌ విజన్‌ మోడ్‌: మన స్మార్ట్‌ఫోన్‌ స్ర్కీన్ల మీద కనిపించే రంగురంగుల ఐకాన్లు, ఆకర్షణీయమైన యాప్‌ డిజైన్లు మన మెదడులోని ‘డోపమైన్‌’ హార్మోన్‌ను ప్రేరేపిస్తాయి. దీనివల్ల పని ఉన్నా లేకపోయినా పదే పదే ఫోన్‌ అన్‌లాక్‌ చేసి స్ర్కోల్‌ చేయాలనే వ్యసనం పెరుగుతుంది. దీనికి చెక్‌ పెట్టడానికి మీ ఫోన్‌ సెట్టింగ్స్‌లోని ‘యాక్సెసిబిలిటీ’ విభాగానికి వెళ్లి ‘కలర్‌ ఫిల్టర్స్‌’ను ఆన్‌ చేసి ‘గ్రేస్కేల్‌ ’ఎంచుకుంటే స్ర్కీన్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ రంగులోకి మారిపోతుంది. రంగుల ఆకర్షణ పోవడం వల్ల కేవలం అవసరమైన పనికి మాత్రమే ఫోన్‌ వాడే అలవాటు పెరుగుతుంది.

క్యూఆర్‌ కోడ్‌ వైఫై బోర్డ్‌: ఇంటికి చుట్టాలు లేదా స్నేహితులు వచ్చినప్పుడు మీ ఇంటి వైఫై పాస్‌వర్డ్‌ ఏంటి? అని అడగడం సహజం. ప్రతిసారీ పని ఆపేసి, రాసిపెట్టిన పాస్‌వర్డ్‌ వెతికి చెప్పడం కాస్త విసిగించే విషయమే. దీనికోసం ఆన్‌లైన్‌లో లభించే ఉచిత క్యూఆర్‌ కోడ్‌ జెనరేటర్‌ వెబ్‌సైట్లలో మీ వైఫై నేమ్‌, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి ఒక ‘వైఫై క్యూఆర్‌ కోడ్‌’ తయారు చేయండి. దానిని ప్రింట్‌ తీసి, ఒక చిన్న ఫొటో ఫ్రేమ్‌లో పెట్టి టీపాయ్‌పై ఉంచండి. వచ్చిన అతిథులు స్కాన్‌ చేస్తే చాలు, నేరుగా వైఫై కనెక్ట్‌ అవుతుంది.

స్మార్ట్‌ బ్లూటూత్‌ ట్రాకింగ్‌: హడావుడిలో బైక్‌ తాళాలు, కార్‌ కీస్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, వర్క్‌ ఐడీ కార్డులు ఎక్కడో పెట్టి మరచిపోవడం, ఆపై ఇల్లంతా వెతకడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి, సమయం వృథా అవుతాయి. ఈ గందరగోళానికి ‘స్మార్ట్‌ బ్లూటూత్‌ ట్రాకర్లు’ చెక్‌ పెడతాయి. ఈ చిన్న పరికరాలను మీ తాళాల గుత్తికి లేదా బ్యాగ్‌కు తగిలించి ఉంచాలి. అవి కనిపించనప్పుడు ఫోన్‌లోని యాప్‌ ద్వారా క్లిక్‌ చేస్తే ఆ ట్రాకర్‌ బిగ్గరగా రింగ్‌ అయి, లొకేషన్‌ను చూపిస్తుంది.

నోటిఫికేషన్‌ షెడ్యూలింగ్‌: రోజంతా మనం పనిలో ఉన్నప్పుడు వాట్సాప్‌ మెసేజ్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌ లైక్‌లు, ఈమెయిల్స్‌ రూపంలో నోటిఫికేషన్‌లు రావడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. దీనికి పరిష్కారంగా ఫోన్‌లోని ‘షెడ్యూల్డ్‌ సమ్మరీ’ లేదా ‘ఫోకస్‌ మోడ్‌’ను ఆన్‌ చేసుకోవాలి. ఈ సెట్టింగ్‌ ద్వారా రోజంతా వచ్చే మెసేజ్‌లు, యాప్‌ అలర్ట్‌లన్నింటినీ మనకు వీలైన సమయంలో (ఉదాహరణకు మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 6 గంటలకు) మాత్రమే ఒకేసారి పొందేలా షెడ్యూల్‌ చేయవచ్చు.


బెడ్‌రూమ్‌ ‘నో ఫోన్‌’ రొటీన్‌: రాత్రి పడుకునే ముందు ఫోన్‌ స్ర్కోల్‌ చేయడం వల్ల స్ర్కీన్‌ నుంచి వచ్చే ‘బ్లూ లైట్‌’ మన శరీరంలో నిద్రను రప్పించే ‘మెలటోనిన్‌’ హార్మోన్‌ ఉత్పత్తిని ఆపేస్తుంది. దీనివల్ల రాత్రివేళల్లో సరిగా నిద్ర పట్టదు. పడుకోవడానికి కనీసం 30 నిమిషాల ముందే ఫోన్‌ను బెడ్‌రూమ్‌కు దూరంగా వేరే గదిలో ఛార్జింగ్‌కు పెట్టాలి. ఫోన్‌లో అలారమ్‌కు బదులుగా పాతకాలపు టేబుల్‌ క్లాక్‌ ఉపయోగించడం అలవాటు చేసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

స్మార్ట్‌ఫోన్లు మన జీవితాలను సులభతరం చేయడానికి రూపుదిద్దుకున్న సాధనాలు మాత్రమే. మన సమయాన్ని, ప్రశాంతతను శాసించే యజమానులు కావు. ఈ చిన్న చిన్న స్మార్ట్‌ సెట్టింగ్స్‌తో లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకుంటే డిజిటల్‌ యుగంలోనూ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని సొంతం చేసుకోవచ్చు!

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 05:37 AM