Share News

‘స్లీప్‌ డెబిట్‌’.. తీర్చకపోతే ప్రమాదమే!

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:25 AM

వారమంతా సరిగ్గా నిద్రపోకపోయినా శని, ఆదివారాల్లో ఎక్కువసేపు పడుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చాలామంది భావిస్తారు. అయితే, ఇది అపోహ మాత్రమేనని...

‘స్లీప్‌ డెబిట్‌’.. తీర్చకపోతే ప్రమాదమే!

వారమంతా సరిగ్గా నిద్రపోకపోయినా శని, ఆదివారాల్లో ఎక్కువసేపు పడుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చాలామంది భావిస్తారు. అయితే, ఇది అపోహ మాత్రమేనని అంటున్నారు నిపుణులు.

శరీరానికి కావలసిన నిద్రకు, మనం నిజంగా పోయే నిద్రకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సైన్స్‌ పరిభాషలో ‘స్లీప్‌ డెబిట్‌’ లేదా ‘నిద్ర అప్పు’ అంటారు. రోజూ రాత్రి 7 నుంచి 8 గంటలు పడుకోవాల్సిన వ్యక్తి 5 గంటలే పడుకుంటే, ప్రతిరోజూ 2 గంటల నిద్ర అప్పుగా మారుతుంది.

వీకెండ్‌ నిద్రతో భర్తీ కాదు: చాలామంది సోమవారం నుంచి శుక్రవారం వరకు తక్కువ నిద్రపోయి, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం వరకు పడుకుంటే ఆ అప్పు తీరిపోతుందని భావిస్తారు. కానీ మెదడు మెటాబాలిజం అలా పనిచేయదు.

సర్కాడియన్‌ రిథమ్‌ దెబ్బతింటుంది: వారంలో ఐదు రోజులు ఒకలా, వీకెండ్‌లో మరోలా పడుకోవడం వల్ల మన శరీరంలోని సహజమైన జీవ గడియారం (సర్కాడియన్‌ రిథమ్‌) కంగారుపడుతుంది. దీనివల్ల ఆదివారం రాత్రి మళ్లీ త్వరగా నిద్రపట్టక సోమవారం నీరసంగా మొదలవుతుంది.

జీవక్రియపై ప్రభావం: నిద్ర బకాయిలు పెరిగే కొద్దీ శరీరంలోని ఇన్సులిన్‌ నిరోధకత పెరుగుతుంది. ఇది ఆకలిని పెంచే ‘గ్రెలిన్‌’ హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది, ఫలితంగా బరువు పెరగడం, బీపీ, మధుమేహం వంటి సమస్యలు త్వరగా దాడి చేస్తాయి.

ఏకాగ్రత లోపిస్తుంది: నిద్ర లోపం వల్ల మెదడులోని ‘ప్రీఫ్రంటల్‌ కార్టెక్స్‌’ పనితీరు మందగిస్తుంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గడం, జ్ఞాపకశక్తి మందగించడం, డైవ్రింగ్‌ చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం పెరుగుతుంది.

చర్మారోగ్యం.. వృద్ధాప్య ఛాయలు: తగినంత నిద్ర లేకపోవడం వల్ల చర్మాన్ని సంరక్షించే ‘కొల్లాజెన్‌’ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, చిన్న వయసులోనే ముఖంపై ముడతలు రావడం జరుగుతుంది.

సరిదిద్దుకునే విధానం

  • వీకెండ్స్‌లో ఒకేసారి 4-5 గంటలు అదనంగా పడుకోవడానికి బదులు, రోజూ రాత్రి పడుకునే సమయాన్ని ఒక 30-45 నిమిషాలు ముందుకు జరపాలి.

  • రోజువారీ నిద్రను ఐదారు రోజుల్లో కొద్దికొద్దిగా పెంచుకుంటూ నిద్ర అప్పును క్రమంగా తీర్చుకోవాలి.

  • మధ్యాహ్నం వేళల్లో 20 నిమిషాలకు మించి పవర్‌ నాప్‌ తీసుకోకూడదు.

  • పడుకోవడానికి గంట ముందు నుంచి మొబైల్‌, టీవీ స్ర్కీన్‌లకు దూరంగా ఉండటం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది.

ఈ వార్తలూ చదవండి

ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక

నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే

Updated Date - Sep 28 , 2026 | 12:25 AM