Share News

బాలల హక్కుల అగ్నిశిఖ

ABN , Publish Date - Aug 05 , 2026 | 01:57 AM

ఈ ప్రశ్నకు సమాధానం... ‘‘పాఠశాలల్లో వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడమే’’ అంటున్నారు శిఖా అగ్నిహోత్రి. పిల్లల భద్రతే ధ్యేయంగా ఆమె ప్రారంభించిన సంస్థ 1,500కు పైగా విద్యా సంస్థలతో కలిసి...

బాలల హక్కుల అగ్నిశిఖ

బడి అనగానే పాఠాలు, పరీక్షలు, ర్యాంకులు... వీటి గురించే ఆలోచిస్తాం. మరి పిల్లల భద్రత మాటేమిటి?

ఈ ప్రశ్నకు సమాధానం... ‘‘పాఠశాలల్లో వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడమే’’ అంటున్నారు శిఖా అగ్నిహోత్రి. పిల్లల భద్రతే ధ్యేయంగా ఆమె ప్రారంభించిన సంస్థ 1,500కు పైగా విద్యా సంస్థలతో కలిసి పని చేస్తోంది. రెండున్నర రక్షల మందికి పైగా బాలల భద్రతకు భరోసా కల్పించిన శిఖ ప్రయాణం ఇది...

‘‘పిల్లలతో గడపడం, వారి ఎదుగుదలకు దోహదం చేసే విషయాలను నేర్పడం... నాకు ఎంతో ఇష్టమైన అంశాలివి. నేను క్రిమినల్‌ సైకాలజీ చదివాను. అక్రిడేటెడ్‌ ఛైల్డ్‌ సైకాలజీ ట్రైనర్‌ను.. బాలల హక్కుల కార్యకర్తను. 2010 నుంచి విద్యావేత్తగా... ఎన్నో పాఠశాలలను సందర్శించాను. విభిన్న నేపథ్యం కలిగిన పిల్లలకు బోధన చేశాను. పాఠాలను ప్రయోగాల రూపంలో విద్యార్థుల అనుభవంలోకి తీసుకువచ్చి, వారు సులువుగా అర్థం చేసుకోవడానికి దోహదం చేయడం నా పని. ఈ క్రమంలో నేను గమనించిన విషయాలు, పిల్లలతో మాట్లాడి తెలుసుకున్న అంశాలు... నన్ను ఎంతో కలవరానికి గురిచేశాయి. అవన్నీ పాఠశాలలో బాలల భధ్రతకు సంబంధించినవే. ప్రత్యేకించి... 2015లో ఒక విద్యార్థిని తను లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు చెప్పిన మాటలు ఎన్నో రాత్రులు నాకు నిద్రలేకుండా చేశాయి. ‘ఆమెకు ఎలాంటి సలహా ఇవ్వగలను? ఎలాంటి సాయం చెయ్యగలను?’ అని ఆలోచించాను. పోలీస్‌ స్టేషన్లకు వెళ్ళి అధికారులతో మాట్లాడాను. మానసిక వైద్యులతో, న్యాయ నిపుణులతో చర్చించాను. చివరకు... మార్పు విద్యా సంస్థల్లోనే మొదలుకావాలని గ్రహించాను. ఈ అంశాలపై మూడేళ్ళపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. మరోవైపు... ‘పోక్సో చట్టం’ గురించి పాఠశాలల్లో, సంస్థల్లో అవగాహన కల్పించడానికి నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ అందించే సర్టిఫికేషన్‌ కోర్సు చేసి... శిక్షకురాలిగా మారాను. 2018లో ‘రైట్‌ సైడ్‌ స్టోరీ’ అనే సంస్థను ఏర్పాటు చేశాను.

బాధ్యత ఎవరిది?

విద్యార్థుల్లో కొందరు భౌతికంగా, మానసికంగా, లైంగికంగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడానికి, వాటి గురించి చర్చించడానికి విద్యా సంస్థలు ఇష్టపడవు. సమస్య తీవ్రమైనప్పుడు... ఆ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారు తప్ప.... దాన్ని ఎలా నివారించాలనే విషయం మీద దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే నివారణ చర్యలు చాలా అసౌకర్యంగా అనిపిస్తాయి. తమ సంస్థలో ఏదైనా తప్పు జరిగిందనో, జరగడానికి ఆస్కారం ఉందనో నిర్వాహకులు అంగీకరించాల్సి ఉంటుంది. అందుకే తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే తప్ప... ఈ వాస్తవాన్ని వారు ఒప్పుకోరు. తోటి విద్యార్థుల నుంచి, బోధకుల నుంచి, ఇతర సిబ్బంది నుంచి ఎదురయ్యే వేధింపులతో పాటు కుటుంబాల్లో రక్త సంబంధీకుల నుంచి ఎదురయ్యే వేధింపుల గురించి కూడా పిల్లల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. లైంగిక వేధింపులకు గురయ్యేది బాలికలు మాత్రమే కాదు... బాలురు కూడా. కానీ మగ పిల్లలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసినప్పుడు... తల్లిదండ్రులు తరచూ కొట్టి పారేస్తారు. లేదా వాటికి పాలక్పడినవారిని నేరుగా నిలదీయడానికి ఇష్టపడరు. వీటిని నిరోధించే వ్యవస్థలు కానీ, జవాబుదారీతనం కానీ విద్యా సంస్థల్లో లేదు. ఏదైనా సమస్య తలెత్తితే... దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఎవరికి ఫిర్యాదు చెయ్యాలి? అనే స్పష్టత, అవగాహన లేదు. ‘మా విద్యా సంస్థలో అలా ఎన్నటికీ జరగదు’ అనే ధీమా, గుడ్డి నమ్మకం... నిర్లక్ష్యానికి కారణమవుతుంది. సమర్థవంతమైన వ్యవస్థల ఏర్పాటుకు అవరోధంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడం కోసం... ఒక ప్రత్యేకమైన కార్యాచరణను మా సంస్థ ద్వారా రూపొందించాను.


బహుముఖ సేవలు...

పలు విద్యా సంస్థల నిర్వాహకులను కలిసి మా కార్యాచరణ గురించి వివరించినప్పుడు.. ‘‘ఇప్పటికే మేము చాలా అమలు చేస్తున్నాం. వాటిని మార్చాలనుకోవడం లేదు’’ అని చెప్పారు. చివరకు మేమే సమావేశాలు ఏర్పాటు చేశాం. దానికి పాఠశాల యాజమాన్యాలను, ఉపాధ్యాయులను, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆహ్వానించాం. విద్యా సంస్థలు సురక్షితంగా ఉంటేనే పిల్లల్లో సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని వారిని ఒప్పిం చాం. మెల్లమెల్లగా విద్యా సంస్థలు ఆసక్తి చూపడం మొదలుపెట్టాయి. దాంతో మా సంస్థ కార్యకలాపాలు విస్తరించాయి. ప్రస్తుతం దేశంలోని నలభైకి పైగా నగరాల్లో.. 1,500కు పైగా పాఠశాలలు, కళాశాలలతో కలిసి పని చేస్తున్నాం. రెండు లక్షల మందికి పైగా విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించగలిగాం. విద్యా సంస్థల్లో సురక్షితమైన, భరోసా కల్పించేందుకు అవసరమైన శిక్షణను, అండదండలను అందించడం మా ప్రధానమైన లక్ష్యం. పాఠశాలల్లో భద్రతా తనిఖీలు, విధానాల రూపకల్పన, సిబ్బందికి శిక్షణ, విద్యార్థులకు, తల్లిదండ్రులకు వర్క్‌షా్‌పలు, ఉచిత పాఠశాల భద్రతా హెల్ప్‌లైన్‌, సేఫ్టీ ఆడిట్‌ లాంటి బహుముఖ సేవలను అందిస్తున్నాం. వీటి ద్వారా తమ సమస్యలను విద్యార్థులు స్పష్టంగా, నిర్భయంగా తెలియజేసే వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. వచ్చిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. వచ్చే ఏడాదికల్లా మరో వెయ్యి విద్యా సంస్థలతో మా సంస్థ భాగస్వామి కావాలనేది నా లక్ష్యం.’’

Also Read:

మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

Updated Date - Aug 05 , 2026 | 01:57 AM