దేశం కాని దేశంలో... ఆమె అండాదండా
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:14 AM
బతుకుతెరువు కోసం పరాయి గడ్డపై అడుగుపెట్టిన ఆమె... కష్టాలకోర్చి... సవాళ్లను అధిగమించి ఒంటరిగా నిలబడ్డారు. తన కోసం... తనపై ఆధారపడిన కుటుంబం కోసం... అవమానాలు భరించి... ఆకలి బాధలు దిగమింగి...
సంకల్పం
బతుకుతెరువు కోసం పరాయి గడ్డపై అడుగుపెట్టిన ఆమె... కష్టాలకోర్చి... సవాళ్లను అధిగమించి ఒంటరిగా నిలబడ్డారు. తన కోసం... తనపై ఆధారపడిన కుటుంబం కోసం... అవమానాలు భరించి... ఆకలి బాధలు దిగమింగి... ఎడారి దేశంలో మౌనంగా ఎదిగారు. నేడు గల్ఫ్‌కు వస్తున్న తనలాంటి వేలాదిమంది మహిళలకు ధైర్యాన్నిచ్చి... విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి అండగా నిలుస్తున్నారు. సామాజిక కార్యకర్త... కువైట్‌లో తెలుగువారికి భరోసా... షేక్ రషీదా బేగమ్ ‘నవ్య’తో తన అనుభవాలను పంచుకున్నారు.
‘‘అవమానం జరిగిన చోటే నిలదొక్కుకోవడం... కాదు పొమ్మన్నవారితోనే ప్రశంసలు అందుకోవడం... మనపై మనకు నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. మరో అడుగు ముందుకు వేయడానికి ధైర్యాన్నిస్తుంది. పొట్ట చేత పట్టుకుని కువైట్‌కు వచ్చిన నేను... ఇవాళ ఒక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగిగా గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నానంటే... అందుకు నా పట్టుదల, తెగువే కారణమని కచ్చితంగా చెప్పగలను. నెల్లూరు జిల్లా గూడూరు మా సొంతూరు. స్కూల్లో బాగా చదివేదాన్ని. డబుల్ ప్రమోషన్స్‌తో 6, 8 తరగతులు చదవలేదు. టెన్త్‌లో ఉన్నప్పుడే నాకు పెళ్లి చేసేశారు. పెళ్లి తరువాత టెన్త్ పరీక్షలు రాయలేకపోయాను. పరీక్షల ఫీజు కట్టడానికి పాతిక రూపాయలు కూడా అప్పుడు అమ్మ దగ్గర లేవు. ఎవర్నీ అడగలేక పరీక్షలు మానేశాను.
పరాయి దేశానికి ఒంటరిగా...
అయితే నా వైవాహిక జీవితం అంత సజావుగా సాగలేదు. మాకు ఇద్దరు మగపిల్లలు. నా భర్త మద్యానికి బానిస కావడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో బాగా ఇబ్బందులు పడ్డాను. కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నాం. ఇల్లు గడవడమే కష్టంగా మారింది. కువైట్‌లో మా వదిన ఉన్నారు. ఆమె సహాయంతో 2003లో నేను ఒంటరిగా అక్కడకు వెళ్లాను... టైలరింగ్ పని కోసం. జీతం 30కేడీ (కువైట్ దినార్లు). అంటే అప్పట్లో ఐదు వేల రూపాయలు. తరువాత బ్యూటీషియన్‌గా మారాను. పది వేల రూపాయల జీతం. పిల్లల్ని చదివించాలి. అమ్మావాళ్లను చూసుకోవాలి. సంపాదన సరిపోయేది కాదు. దాంతో సేల్స్ గాళ్‌గా కొంత కాలం చేశాను. ఆ సమయం లో అవమానాలు ఎన్నో ఎదురయ్యాయి. ఇతర సేల్స్ గాళ్స్ ఎవరూ నాతో మాట్లాడేవారు కాదు. అందరూ మన తెలుగువారే. అప్పుడు నేను ముఖానికి బుర్ఖా, చేతులకు గ్లౌజ్‌లు వేసుకొని వెళ్లేదాన్ని. ఆ బుర్ఖా కూడా చిరిగిపోతే కుట్టుకున్నాను. వాళ్లంతా మోడ్రన్ డ్రెస్‌ల్లో వచ్చేవారు. ఒకరోజు వాళ్లల్లో నస్రీన్ అనే అమ్మాయి పాత డ్రెస్‌లు తీసుకువచ్చి ఇచ్చింది. అప్పుడు తెలిసింది... నన్ను ఎందుకు దూరం పెట్టారో. ఆ డ్రెస్‌లు తనకే ఇచ్చేసి, మరుసటి రోజు ప్యాంట్, షర్ట్ వేసుకొని, తలకు గుడ్డ కట్టుకొని డ్యూటీకి వెళితే నన్ను వాళ్లు గుర్తుపట్టలేదు. మనం కట్టే దుస్తులు, మాట్లాడే మాట, మన ప్రవర్తన ఎంత ముఖ్యమో ఈ అనుభవం చెప్పింది.
ఫొటోగ్రఫీ నేర్చుకొని...
‘ఇక్కడ మహిళా ఫొటోగ్రాఫర్లకు మంచి జీతాలు ఉంటాయి. ప్రయత్నించ’మని కొందరు చెప్పారు. అలా ఫొటోగ్రఫీ నేర్చుకున్నా. దాంతోపాటు మల్టీమీడియా కూడా రావాలని నాకు తెలియదు. నాకేమో కంప్యూటర్ ఆన్... ఆఫ్ చేయడం కూడా రాదు. ఎక్కడా ఉద్యోగాలు దొరకలేదు. అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక ఫొటో స్టూడియోకు వెళ్లి ‘నాకు జీతం వద్దు. పని నేర్చుకొంటాను’ అని అడిగాను. అక్కడ ఫొటోగ్రఫీలో మెళకువలతో పాటు మల్టీమీడియా కూడా నేర్చుకున్నా. ఏడాది తిరిగేలోపు కువైట్‌లో నెంబర్ వన్ ఫొటోగ్రాఫర్‌గా ఎదిగాను. ఇక్కడకు వచ్చాక అరబ్బీ నేర్చుకున్నాను. ఆన్‌లైన్‌లో టెన్త్, ఇంటర్, బీకాం పూర్తి చేశాను.
అవగాహన లేకనే అవస్థలు...
ఇంట్లో గడవకో, కుటుంబ పరిస్థితులవల్లనో చాలామంది, ముఖ్యంగా మహిళలు అరబ్ దేశాలకు వస్తుంటారు. ఇక్కడ బాగా డబ్బు సంపాదించి ఇంటికి పంపుదామని అనుకుంటారు. కానీ వారికి ఇక్కడ పరిస్థితులు ఏమిటి? నిబంధనలు ఏమిటి? అనే విషయాల్లో కనీస అవగాహన, పనిలో అనుభవం ఉండదు. ఇక్కడకు వచ్చేటప్పుడు వాళ్లకు బాధ్యతలుంటాయి. బాధలుంటాయి. డబ్బు వస్తుందంటే ఏదీ ఆలోచించకుండా ఏజెంట్లను నమ్మి విమానం ఎక్కుతారు. ముఖ్యంగా మన తెలుగువాళ్లు ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఫిలీప్పీన్స్ నుంచి కూడా మనలా పని మనుషులుగా వస్తుంటారు. కాకపోతే వచ్చేముందు ట్రైనింగ్ తీసుకొంటారు. ఇంగ్లీష్ మాట్లాడతారు.
నిబంధనలు వారికీ ఉంటాయి...
ఇక నిబంధనలు పనివారిని పిలిపించుకున్న యజమానులకూ వర్తిస్తాయి. ఇంట్లో పనికి వచ్చిన వారు పారిపోతే యజమానులకు వీసాలు రావు. కరెంటు కట్ చేస్తారు. జైల్లో పడిన వారి టికెట్ డబ్బు ప్రభుత్వం సదరు అరబ్బీల నుంచే వసూలు చేస్తుంది. అంటే వారికి ఫైన్ వేసినట్టు. కనుక ఇంట్లో నుంచి పారిపోగానే అరబ్బీలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారు. ఆ కేసు నుంచి బయటపడాలంటే జైలుకు వెళ్లి, కొంతకాలం శిక్ష అనుభవించాలి. మూడు రకాల జైళ్లలో పెడతారు. ఇంకోసారి తమ దేశానికి రాకుండా పంపించేస్తారు. ఇంత అవసరమా? నాకు తెలిసి తప్పు మనదే. చట్టాలు తెలియకుండా రావడం. పారిపోయినవారు బయట అక్కడక్కడ తల దాచుకొంటూ, దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటారు. ఆర్టికల్ 20 కింద కువైటీల ఇళ్లల్లో పనికి వచ్చే కొంతమంది... యజమానులకు కొంత డబ్బు ఇచ్చి, బయటి పనులు చేసుకొంటారు... ఆజాద్ వీసా లేకుండా. అలాంటివారు ఇక్కడ 70 శాతం ఉన్నారు. ఎప్పుడైతే వీళ్లు పట్టుపడతారో, అరబ్బీలు రెసిడెన్సీ వీసా రద్దు చేస్తారు. అలా కూడా వీళ్లు రోడ్డున పడతారు.
చైతన్యం కోసం...
ఇలాంటివాళ్లలో కొందరు నా దగ్గరకు వస్తుంటారు. ‘జైల్లో పడ్డాము. రక్షించండి’ అని. వారిని కాదనకుండా నాకు వీలైనంతవరకు సాయం చేస్తున్నాను. ఆరంభంలో ఇక్కడ నేనూ ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నాను. నాలాగా మరెవరూ ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఏపీలో ప్రతి మహిళనూ చైతన్యవంతురాలిని చేయాలని నిర్ణయించాను. వెయ్యి మందితో ఒక వాట్సప్ గ్రూప్ పెట్టాను. ఇప్పుడు అది ఐదు లక్షల మందికి చేరింది. మహిళలు బయటి దేశాలకు వస్తే ఉన్నత ఉద్యోగాలు, గౌరవప్రదమైన జీవితం కోసం రావాలి. ఇలా ఇంటి పని కోసం కాకూడదనేది నా ఆకాంక్ష. ఈ లక్ష్యంతో వాట్సమ్ గ్రూప్ పెట్టి, అందరికీ టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు, మగ్గం వర్క్, పచ్చళ్ల తయారీ నేర్పిస్తున్నాను. అమ్మమ్మ చేతిలో కూడా విద్య ఉందని, వారు నెల నెలా పింఛన్ కోసం ఎదురుచూసే అవసరం ఉండకూడదనే ఉద్దేశం నాది. అందుకే వారితో పచ్చళ్లు తయారు చేయించి విదేశాలకు పంపిణీ చేస్తున్నాం. అమ్మమ్మలు కూడా విమానం ఎక్కి విదేశాల్లో వ్యాపారం చేయాలనేది నా కోరిక.
హనుమా

మొదటి మహిళను...
తరువాత మా పెద్దబ్బాయి నా దగ్గరకు రావాలనుకున్నాడు. కానీ అప్పుడు నా వీసా ఆర్టికల్ 20. అంటే పని మనుషులకు మాత్రమే ఇచ్చే వీసా. ఆ వీసా మీద మనం ఎవర్నీ తీసుకురాలేం. ఎలాగైనా మా అబ్బాయిని తెచ్చుకోవాలని ఒక ఏజెంట్‌కు డబ్బు కట్టాను. నాలుగైదు నెలలు తిప్పి, చివరకు చేతులెత్తేశారు. ఎక్కడ లోపం ఉందో ఆరా తీస్తే... అప్పుడు తెలిసింది ఆజాద్ వీసా ఉంటేనే అది సాధ్యమని. దాంతో నా రెసిడెన్సీని ఆర్టికల్ 18 కిందకు మార్చుకుని, అబ్బాయిని తెచ్చుకున్నాను. ఆజాద్ వీసా ఉంటే బయట ఎక్కడైనా పని చేసుకోవచ్చు. పట్టుదలగా ఏడాది ప్రయత్నించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాను. ప్రస్తుతం మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్‌లో ఉద్యోగం. పబ్లిక్ రిలేషన్స్ ఫారిన్ అఫైర్స్ విభాగంలో స్పెషల్ ఫొటోగ్రాఫర్‌ని. అంటే ప్రధాని, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యక్రమాలను కవర్ చేస్తుంటాను. ఈ హోదా పొందిన తొలి మహిళా ఉద్యోగిని నేనే.
ఇక్కడ ఎలా ఉంటుందంటే..!
ఉదాహరణకు పని మనుషులు కావాలని అరబ్బీలు నాలాగా ఇక్కడ స్థిరపడినవారిని అడుగుతారు. వాళ్లు ఒక ఆఫీసు తెరిచి, తెలిసినవాళ్లందరినీ ‘కువైట్‌కు రండి... ఊళ్లో పనికి పోతే నెలకు ఐదు వేలు కూడా రాదు. ఇక్కడ 30 వేల జీతం వస్తుంది’ అని పిలుస్తారు. అరబ్బీల దగ్గర లక్షల్లో డబ్బు తీసుకొంటారు. రమ్మని చెప్పినవారు అక్కడకు వెళ్లి మంచిగా స్థిరపడ్డారు కనుక... వాళ్లలా తాము కూడా బాగా బతకవచ్చని భావిస్తారు. సదరు వ్యక్తిని నమ్మి వచ్చిన వారికి అరబ్బీల కండిషన్లు ఏమిటని చెప్పడు. వాస్తవానికి ఇంటి యజమానులు తమ కండిషన్లు ఏంటో ముందే స్పష్టంగా చెబుతారు... ‘తెల్లవారి 4 గంటలకు నిద్ర లేవాలి. ఇల్లు ఊడవాలి. వంట చేయాలి. పిల్లలను రెడీ చేసి స్కూల్‌కు పంపాలి’ అని. అయితే ఇక్కడకు వచ్చాక వారికి భాష రాదు. వాళ్లు చెప్పేది వీళ్లకు అర్థం కాదు. ఇల్లు చిమ్మాలి అనగానే మనం ఊళ్లలోలాగా ఊహించుకొంటాం. కానీ ఇక్కడ నాలుగైదు అంతస్తుల బిల్డింగ్‌లు ఉంటాయి. వాటిని అద్దంలా ఉంచాలి. ఆ ఇల్లు చూడగానే వీళ్లకు భయం వేస్తుంది. కుటుంబంలో ఇరవై మందికి పైనే ఉంటారు. అంతమంది దుస్తులు ఇస్త్రీ పెట్టాలి. ఇవన్నీ చేయలేరు. ఒంటరిగా వస్తారు. ఒంటరినని బాధపడతారు. బానిస బతుకనిపిస్తుంది. చివరకు పిచ్చెక్కినట్టు అవుతుంది. ఇంటి నుంచి పారిపోయి అక్కడక్కడా తల దాచుకొంటూ ఏదో పని చేసుకుంటూనో, దొంగతనాలు చేస్తూనో బతుకుతారు. జైల్లో పడతారు. ఇవన్నీ వచ్చేముందే ఏజెంట్లు అవగాహన కల్పించాలి. అలా అన్నీ చెబితే వారికి డబ్బు రాదు. బాగా బాగుపడేది ఎవరంటే ఏజెంట్లే.
ఇవి కూడా చదవండి:
ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ
తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి