పిడికెడు బియ్యమే స్ఫూర్తి
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:09 AM
కోల్‌కతాలో పుట్టిపెరిగి.. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న షర్మిల మోనా సిన్హా అరుదైన గౌరవం అందుకున్నారు. అమెరికా ప్రతిష్ఠాత్మక...
కోల్‌కతాలో పుట్టిపెరిగి.. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న షర్మిల మోనా సిన్హా అరుదైన గౌరవం అందుకున్నారు. అమెరికా ప్రతిష్ఠాత్మక ‘నేషనల్ విమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకుని.. ఇంద్రా నూయి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. వాల్‌స్ట్రీట్ బ్యాంకర్ నుంచి ప్రపంచ స్థాయి సామాజిక కార్యకర్తగా మారిన ప్రయాణం ఆమె మాటల్లోనే...
‘‘సెప్టెంబర్ 2, 2026.. న్యూయార్క్‌లోని సెనెకా ఫాల్స్‌లో జరిగిన ఆ కార్యక్రమం నా జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకం. అమెరికా మహిళా హక్కుల ఉద్యమానికి పుట్టినిల్లయిన ఆ పవిత్ర వేదికపై, మానవ హక్కుల కోసం పోరాడిన రోసా పార్క్స్, కవయిత్రి మాయా ఏంజెలో, అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా వంటి ఎందరో మహనీయుల సరసన నిలబడటం గొప్ప గౌరవంగా, నా జన్మ ధన్యమైనట్లుగా భావిస్తున్నాను. అయితే, ఈ గౌరవాన్ని నేను నా ఒక్కదాని విజయంగా స్వీకరించడం లేదు. ఇది నా చేతుల్లో ఉంచిన ఒక పిడికెడు బియ్యం లాంటిది. దానిని పదిమందికి పంచి, వారి ఆకలి తీర్చాల్సిన బాధ్యత నాపై ఉంది.
అమ్మ నేర్పిన పంచుకునే గుణం
ఈ ‘పిడికెడు బియ్యం’ మాట వెనుక మా అమ్మ ఇచ్చిన స్ఫూర్తి, ఆమె నేర్పిన జీవన విధానం ఉంది. మాది కోల్‌కతా. మా అమ్మ ప్రతి ఉదయం వంట చేసే ముందు, అన్నం వండే బియ్యం డబ్బాలోంచి ఒక పిడికెడు బియ్యం తీసి ఒక ప్రత్యేక డబ్బాలో వేసేవారు. అలా నెల రోజులు పోగైన బియ్యాన్ని అవసరంలో ఉన్నవారికి, పేదవారికి దానం చేసేవారు. ఇవ్వడంలో, పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని, దాని వెనుక ఉన్న సామాజిక బాధ్యతను నేను చిన్నప్పుడే మా అమ్మను చూసి నేర్చుకున్నాను. ఆ పిడికెడు బియ్యం నాలో సమాజ సేవకు బీజం వేసింది.
బాల్యంలోనే లింగ వివక్ష...
మా ఇంట్లో నేను మూడో కుమార్తెగా పుట్టాను. ఆ రోజుల్లో ఆడపిల్ల పుడితే ఏదో కోల్పోయినట్లు సమాజం భావించేది. నా బాల్యంలో ఈ లింగ వివక్షను ఎన్నోసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎదుర్కొన్నాను. ‘అబ్బాయిగా పుట్టి ఉంటే బాగుండేది కదా’ అని నాలో నేనే ఎన్నోసార్లు మథనపడ్డాను. అబ్బాయిలకు ఉన్న స్వేచ్ఛ, వారు పొందుతున్న అవకాశాలు నాకెందుకు లేవని తీవ్రంగా ఆలోచించేదాన్ని. ఆడపిల్ల కాబట్టి ఇంట్లో పనులు చేయాలి, బయటకు వెళ్లకూడదు వంటి కట్టుబాట్లు నన్ను తీవ్రంగా బాధించేవి.
‘మదర్ థెరీసా’తో మారిన ఆలోచన
12 ఏళ్ల వయసులో కోల్‌కతాలోని మదర్ థెరీసా అనాథాశ్రమంలో వాలంటీర్‌గా చేరాను. ఆ అనుభవం నా జీవితాన్ని, ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అక్కడ అనాథలుగా ఉన్న ఆడపిల్లలతో పోలిస్తే అబ్బాయిలు చాలా తక్కువగా ఉండటం గమనించాను. ఉన్న కొద్దిమంది అబ్బాయిలను కూడా ఎవరో ఒకరు త్వరగా దత్తత తీసుకునేవారు. కానీ ఆడపిల్లలు మాత్రం ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోవడం నా మనసును కలచివేసింది. ఆడపిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్నచూపు, నిర్లక్ష్యం ఎంత లోతుగా పాతుకుపోయిందో అప్పుడే నాకు అర్థమైంది. వారి కోసం ఏదైనా చేయాలనే బలమైన సంకల్పం నాలో అప్పుడే మొదలైంది.
రక్తంలోనే పోరాట పటిమ
అదే సమయంలో మా అమ్మమ్మ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని, ఎందరో మహిళలను సంఘటితం చేసి పోరాటంలో వారిని భాగం చేశారని మా వాళ్ల ద్వారా తెలిసి ఆశ్చర్యపోయాను. సమాజం విధించిన కట్టుబాట్లను, నియమాలను ధిక్కరించే ధైర్యం నా రక్తంలోనే ఉందని అప్పుడే అర్థమైంది. ఆ స్ఫూర్తితోనే, నా కాళ్లపై నేను నిలబడాలని, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాను. 18 ఏళ్ల వయసులో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వచ్చేశాను. స్మిత్ కాలేజీలో ఎకనామిక్స్, ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాను.
సమాజ సేవకే అంకితం
కోట్ల రూపాయల జీతాన్ని, ఉన్నత పదవిని వదులుకొని పూర్తిస్థాయిలో సామాజిక సేవకు అంకితమయ్యాను. ‘విమెన్ మూవింగ్ మిలియన్స్’ సంస్థకు చైర్‌గా బాధ్యతలు స్వీకరించి, ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల అభ్యున్నతి కోసం పనిచేసే సంస్థలకు వందల మిలియన్ డాలర్ల నిధులు సమీకరించగలిగాను. ఆ తర్వాత ‘రైజింగ్ ఛేంజ్’ అనే సంస్థను స్థాపించి లింగ సమానత్వం కోసం కృషి చేస్తున్నాను.
వివక్షపై పోరాటం
ప్రస్తుతం ‘ఈక్వాలిటీ నౌ’ అనే అంతర్జాతీయ సంస్థకు గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ప్రపంచవ్యాప్తంగా స్త్రీల పట్ల వివక్ష చూపే చట్టాలను మార్చేందుకు అలుపెరగని కృషి చేస్తున్నాను. బాల్య వివాహాలు, లైంగిక హింస, ఆస్తి హక్కులో అసమానతలు వంటి ఎన్నో క్లిష్టమైన సమస్యలపై న్యాయపోరాటం చేస్తున్నాం. మా లక్ష్యం ఒక్కటే, చట్టం దృష్టిలో ప్రతి మహిళ పురుషుడితో సమానంగా గౌరవం పొందగలగాలి. సమాన హక్కులు పొందాలి.
పంచిన శక్తి... రెట్టింపు
అధికారం అనేది పరిమితమైనదని, ఒకరికి పంచితే మన దగ్గర తగ్గిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ నా జీవితం నాకు దానికి పూర్తి వ్యతిరేకమైన పాఠం నేర్పింది. ‘పంచిన శక్తి... రెట్టింపైన శక్తి’ అని నేను బలంగా నమ్ముతాను. ఎందరో మహానుభావులు, స్ఫూర్తిప్రదాతలు తమ శక్తిని, జ్ఞానాన్ని నాతో పంచుకోవడం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో నిలబడగలిగాను. మా అమ్మ నేర్పిన పాఠాన్ని అనుసరిస్తూ, ఈ రోజు నాకు లభించిన ఈ గౌరవాన్ని, ఈ శక్తిని ఒక పిడికెడు బియ్యంలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల అభ్యున్నతి కోసం పంచుతున్నాను. నా ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది.’’
వాల్‌స్ట్రీట్ నుంచి ఉన్నత శిఖరాలకు
చదువు పూర్తయ్యాక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్రమైన వాల్‌స్ట్రీట్‌లోని మోర్గాన్ స్టాన్లీలో ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకర్‌గా కెరీర్ ప్రారంభించాను. ఆ తర్వాత ప్రోక్టర్ అండ్ గాంబుల్, యూనిలీవర్ వంటి బహుళజాతి సంస్థల్లో ఉన్నత పదవులు చేపట్టాను. కార్పొరేట్ ప్రపంచంలో పేరు, డబ్బు, హోదా అన్నీ సంపాదించాను. కానీ, నా చిన్ననాటి అనుభవాలు, అనాథాశ్రమంలో నేను చూసిన దృశ్యాలు, సామాజిక మార్పు తీసుకురావాలన్న నా అంతరాత్మ పిలుపు నన్ను నిలవనీయలేదు. నా జీవిత లక్ష్యం ఇది కాదనిపించింది.
ఇవి కూడా చదవండి..
అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి..