Share News

డ్రగ్‌ రెసిస్టెన్స్‌కు అడ్డుకట్ట

ABN , Publish Date - May 26 , 2026 | 03:28 AM

ఎవరికి వారు ఔషధాలను యధేచ్ఛగా వాడుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా డ్రగ్‌ రెసిస్టెన్స్‌ ముప్పు విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా శక్తివంతమైన మందులకు...

డ్రగ్‌ రెసిస్టెన్స్‌కు అడ్డుకట్ట

పరిశోధన

ఎవరికి వారు ఔషధాలను యధేచ్ఛగా వాడుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా డ్రగ్‌ రెసిస్టెన్స్‌ ముప్పు విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా శక్తివంతమైన మందులకు సైతం సూక్ష్మజీవులు తలవంచని పరిస్థితి. ఈ కోవకు చెందిన డ్రగ్‌ రెసిస్టెన్స్‌ బ్యాక్టీరియాను చంపే ఒక కాంపౌండ్‌ను శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. మరిన్ని వివరాలు....

కెంట్‌ యూనివర్శిటీ, యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌కు చెందిన పరిశోధకులు, ‘సెంటెల్లా ఏసియాటికా’ మూలిక నుంచి సేకరించిన, కె బ్యూటీలో ముఖ్యమైన దినుసు అయిన, ‘కాసిక్‌ యాసిడ్‌’, శక్తివంతమైన బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉన్నట్టు కనిపెట్టారు. చర్మానికి మేలు చేసే ఈ వృక్షాధారిత సమ్మేళనం, యాంటిబయాటిక్‌ రెసిస్టెన్స్‌ను సాధించిన ఇ కొలై బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకోగలుగుతున్నట్టు పరిశోధకులు తెలుసుకున్నారు. ఈ సమ్మేళనాన్ని మరింత శక్తివంతమైన వెర్షన్స్‌కు మార్చవచ్చనీ, మందులకు లొంగని సూక్ష్మజీవులతో పోరాడే సమర్థవంతమైన ఔషధ తయారీకి ఉపయోగించుకోవచ్చనీ, కంప్యూటర్‌ మోడలింగ్‌, ప్రయోగశాల పరీక్షల ద్వారా, పరిశోధకులు తెలుసుకున్నారు. ఈ సమ్మేళనం, బ్యాక్టీరియా జీవించడానికీ, శ్వాసించడానికీ అవసరమైన ‘సైటోక్రోమ్‌ బిడి కాంప్లెక్స్‌’ అనే నిర్దిష్ట ప్రొటీన్‌ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ ప్రొటీన్‌ మానవ శరీరాల్లో తయారవదు కాబట్టి దీన్ని శరీరానికి అందించగలిగితే, మానవ జీవవ్యవస్థకు ఏ మాత్రం భంగం కలిగించకుండా, ఎలాంటి దుష్ప్రభావాలకూ ఆస్కారం లేకుండా ప్రమాదకరమైన సూక్ష్మక్రిములను తటస్థీకరిస్తుంది. యాంటీమైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి నాలుగు కోట్ల మరణాలు సంభవించే ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపధ్యంలో, త్వరితమైన, సురక్షితమైన, ప్రాణాలను కాపాడే ఇలాంటి సరికొత్త ఔషధాల ఉత్పత్తి అవసరం ఎంతైనా ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు

చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..

Updated Date - May 26 , 2026 | 03:28 AM