అదే ఆట... కొత్త బాట
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:45 AM
అనయా బంగర్... ఆర్యన్‌గా జన్మించి అనయాగా మారిన ఆమె జీవితంలో ఊహలకు అందని మలుపులు, సవాళ్లు ఎన్నో
అనయా బంగర్... ఆర్యన్‌గా జన్మించి అనయాగా మారిన ఆమె జీవితంలో ఊహలకు అందని మలుపులు, సవాళ్లు ఎన్నో.
భారత మాజీ ఆల్‌రౌండర్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ వారసుడిగా క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టిన ఆర్యన్... తన అసలైన గుర్తింపు కోసం పడిన మానసిక సంఘర్షణలు, అధిగమించిన సామాజిక అడ్డంకులు అనేకం.
తాజాగా ఆస్ర్టేలియాలో మహిళా కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు అనుమతి పొందిన అనయా భావోద్వేగ ప్రయాణం ఇది.
భారత క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ బంగర్ దారిలోనే నడిచింది అనయా. చిన్నతనంలోనే క్రికెట్ ఆమె జీవితంలో భాగమైంది. ఆర్యన్‌గా ముంబయి క్రికెట్‌లోకి అడుగుపెట్టి... ప్రతిభావంతమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. ఎడమచేతివాటం బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుత భారత క్రికెటర్లు సర్ఫరాజ్‌ఖాన్ తదితరులతో కలిసి ముంబయి అండర్-16, 19 విభాగాల్లో ఎన్నో మ్యాచ్‌లు ఆడింది. మైదానంలో రాణిస్తున్నా... ఆమెలో ఏదో తెలియని అలజడి. తొమ్మిదేళ్ల వయసు నుంచే తన శరీరానికి, మనసుకు మధ్య ఏదో తేడా ఉందని గమనించింది. సమాజం తనను అబ్బాయిగా చూస్తున్నా, అంతర్గతంగా తాను ఒక అమ్మాయిననే భావన ఆమెను వెంటాడింది.
‘‘చిన్నప్పుడు ఆర్యన్‌గా ఉన్నప్పుడు ఒక సాధారణ పిల్లాడిలా నేనెప్పుడూ సంతోషంగా లేను. ఏదో కోల్పోయినట్టు, ఒంటరిగా ఉన్నట్టు అనిపించేది. తొమ్మిది పదేళ్లప్పటి నుంచే నాలో ఈ గందరగోళం మొదలైంది. రహస్యంగా మా అమ్మ డ్రెస్సులు వేసుకొని, అద్దంలో చూసుకొంటూ... ‘నేను ఒక అమ్మాయిని. అమ్మాయిలానే బతకాలి’ అనుకునేదాన్ని. సమాజంలో తిరిగి మహిళలను చూసి, వారు ఎంత అదృష్టవంతులో అని ఈర్ష్యపడేదాన్ని’’ అంటూ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్న అనయాకు... ఒకవైపు పురుషుల క్రికెట్‌లో రాణిస్తూనే, మరోవైపు తన అసలైన గుర్తింపును దాచుకోవాల్సిరావడం తీవ్ర మానసిక వేదన మిగిల్చింది.
ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్నట్టు...
తండ్రి దేశానికి ప్రాతినిథ్యం వహించడం, బ్యాటింగ్ కోచ్‌గా భారత జట్టుకు సేవలు అందించడం చూసి క్రికెట్‌పై ఎంతో మక్కువ పెంచుకుంది అనయా. జిమ్‌లో వర్కవుట్స్ చేసింది. ముంబయిలోని అత్యుత్తమ కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకుంది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా చూడచక్కని షాట్స్‌తో అలరించేది. ‘‘కానీ పురుషుల క్రికెట్ ఆడుతున్నప్పుడు నా అంతర్గత గుర్తింపు దాచుకోవడం నరకంలా అనిపించేది. ముంబయి తరుఫున ఆడుతున్నప్పుడు ఒక సంఘటన నా ఆలోచనలను మార్చేసింది. ‘‘నా చివరి మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ షాట్ కొట్టాడు. బౌండరీకి వెళుతున్న బంతిని ఆపే ప్రయత్నంలో నా చెయ్యి విరిగింది. ఇకపై ఈ నకిలీ జీవితం గడపడం నావల్ల కాదనిపించింది. ఆ గాయం నన్ను తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి నెట్టింది. నాలోని స్ర్తీత్వాన్ని చంపేసుకోవడానికి ఎన్నో యాంటీ డిప్రెసెంట్ మందులు వాడాను. థెరపీలు తీసుకున్నాను. కానీ ఏదీ పని చేయలేదు. ఒక దశలో అయితే ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించింది. ఇక ఈ జీవితం చాలనే ఆలోచనలు కూడా వచ్చాయి’’ అంటూ గతాన్ని గుర్తుచేసుకున్న అనయాకు ఈ గందరగోళం, అశాంతి వెనుకవున్న అసలు విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది. 2022లో తానేమిటో తనకు తెలిసింది. ఈ క్రమంలో సమాజం నుంచి ఎదుర్కొన్న అవమానాలు, ఒక మహిళగా తన నిజమైన గుర్తింపు సాధించుకోవడం కోసం చేసిన పోరాటాలు, పడిన భావోద్వేగ సంఘర్షణలు ఎన్నో.
వెయిట్రెస్‌గా చేసి...
ఏదిఏమైనా తాను తనలా బతకాలనుకుంది. 2023లో లండన్ వెళ్లి ‘హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ’ (హెచ్‌ఆర్‌టీ) ప్రారంభించింది. ‘‘సాధారణ ప్రపంచంతో, నేను జీవిస్తున్న విధానంతో, ఇన్ని సంవత్సరాలుగా ఒక అబ్బాయిలా ఉండటానికి నేను చేస్తున్న ప్రయత్నంతో ఇక భరించలేని స్థితికి చేరుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చిన అనయా చికిత్సలో భాగంగా శారీరక మార్పులు, తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఖర్చుల కోసం చికిత్స కొనసాగిస్తూనే క్లబ్ క్రికెట్ ఆడింది. కొన్నిసార్లు డ్రెస్సింగ్ రూమ్‌ల్లో, ఇతర నగరాల్లో ఉన్న స్నేహితుల ఇళ్లల్లో తలదాచుకుంది.
‘‘మాంచెస్టర్ నుంచి లౌబరోకు ప్రయాణించడం అత్యంత కష్టమైనది. టికెట్ ధర 35 పౌండ్లు. క్రికెట్ సీజన్ ముగిశాక వెయిట్రెస్‌గా కూడా పని చేశాను. అది నాకు వింతగా, కొత్తగా అనిపించేది. ఎందుకంటే నా గత జీవితంలో నాకు అన్నీ అందుబాటులో ఉండేవి. లింగమార్పిడి ప్రక్రియలో ఉన్నందున నా ఖర్చులకు నేనే సంపాదించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను చాలా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. నా కోసం నిజంగా ఎవరూ లేరన్న భావన కలిగింది’’ అంటూ భావోద్వేగానికి గురైన అనయా... ఈ ఏడాది మార్చిలో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని, పూర్తి మహిళగా మారింది. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ తరువాత తండ్రి సంజయ్ బంగర్, ఇతర కుటుంబ సభ్యులు అనయా నిర్ణయాన్ని గౌరవించారు. ఆమెకు అండగా నిలిచారు. శస్త్రచికిత్స తరువాత ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన అనయా జీవితంలో క్రికెట్ ఎప్పుడూ ఒక భాగంగానే ఉంది. ఇప్పుడు అడ్డంకులు, సవాళ్లను అధిగమించి మళ్లీ మైదానంలో సెకండ్ ఇన్నింగ్స్‌తో అలరించడానికి సిద్ధమవుతోంది.
ఎంతో ‘ప్రత్యేకం’...
ప్రస్తుతం అనయా తనకు దక్కిన మరో జన్మతో సంతోషంగా ఉంది. మానసిక సంఘర్షణలు తగ్గి, కొత్త పేరుతో స్ఫూర్తిదాయక ప్రయాణానికి సిద్ధమయింది. ‘‘మొదట నేను అనన్య అనే పేరు ఎంచుకున్నాను. రెండు పేర్లకూ ‘ప్రత్యేకమైన’ అని అర్థం. నాలో అనయ ఛాయలు కనిపిస్తాయని ఒక స్నేహితురాలు చెప్పింది. నెమ్మదిగా ఆ పేరు నాకు అలవాటైపోయింది. ఒక రకంగా నా ప్రయాణం, నా కథ కూడా ప్రత్యేకమైనవే కదా.’’ ఐసీసీ నిషేధం వల్ల క్రికెట్‌కు శాశ్వతంగా దూరమయ్యానేమోనని ఏడ్చాను. చిన్నప్పటి నుంచి నా గుర్తింపునకు కారణమైన ఆటను వదిలేయడం కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడు ‘క్రికెట్ ఆస్ట్రేలియా’ ఆడేందుకు నాకు అనుమతినివ్వడం అత్యంత భావోద్వేగాలు నిండిన సందర్భం. ఇది ఏదో లీగ్‌లో ఆడటం గురించి కాదు... నేను ప్రాణంగా ప్రేమించే ఆటకు మళ్లీ దగ్గరవడం. భవిష్యత్తులో ఒక ట్రాన్స్‌ఉమన్‌గా కాకుండా ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీపడే మరో సాధారణ క్రికెటర్‌గా గుర్తింపు పొందడమే నా లక్ష్యం.