Share News

గోశాల మరింత పటిష్ఠానికి చర్యలు

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:29 AM

వేముల వాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు సమ ర్పించే కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు.

గోశాల మరింత పటిష్ఠానికి చర్యలు

వేములవాడ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): వేముల వాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు సమ ర్పించే కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు. ఇటీవల ఐదు రాజన్న కోడెలు మృత్యువాత పడిన ఘటనపై బుధవారం తిప్పాపూర్‌ గోశాలను సందర్శించారు. గోశాల నిర్వహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూరప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశ్యంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించ వద్దని విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు. గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని, ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వపరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్‌ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్థక శాఖ సమన్వ యంతో పని చేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన వెంట రాజన్న ఆలయ ఈవో రమాదేవి, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 12:29 AM