యాలాలొ యాలాలొ ఎన్నెన్ని అందాలో..
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:36 AM
సహజసిద్ధ ప్రకృతి అందాలకు నిలయం సీలేరు. ఎత్తైన పచ్చని కొండలు, లోయలు, జలపాతాలు, రిజర్వాయర్లు, జల విద్యుత్ కేంద్రాలు.. ఇలా ఎన్నో అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. జీకే వీధి మండలం సీలేరులో సినిమా షూటింగ్‌లకు అనువైన ఎన్నో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి.
మంత్రముగ్ధులను చేస్తున్న సీలేరు సౌందర్యాలు
సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు
ఇరుముడి సినిమాతో అందరి చూపు ఇటువైపు..
టూరిజం హబ్‌గా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం
వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు
సీలేరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సహజసిద్ధ ప్రకృతి అందాలకు నిలయం సీలేరు. ఎత్తైన పచ్చని కొండలు, లోయలు, జలపాతాలు, రిజర్వాయర్లు, జల విద్యుత్ కేంద్రాలు.. ఇలా ఎన్నో అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. జీకే వీధి మండలం సీలేరులో సినిమా షూటింగ్‌లకు అనువైన ఎన్నో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఇరుముడి సినిమా షూటింగ్ ఈ ప్రాంతంలో జరిగిందే. కేరళం తరహా సుందర ప్రదేశాలు సీలేరులో ఉన్నాయని ప్రముఖ నటులు రవితేజ, సాయికుమార్, దర్శకుడు శివ నిర్వాణ ప్రతి ఇంటర్వ్యూలో చెబుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి సీలేరుపై పడింది.
సీలేరు పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల విడుదలై విజయవంతమైన ఇరుముడి సినిమా షూటింగ్ ఇక్కడే జరిగిందని తెలిసి సీలేరు గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. సీలేరుకు అరకిలోమీటరు దూరంలో మారెమ్మ ఆలయం, కిలోమీటరు దూరంలో గుంటవాడ డ్యామ్, రెండు కిలోమీటర్ల దూరంలో జల విద్యుత్ కేంద్రాలు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఐస్‌గెడ్డ, 17 కిలోమీటర్ల దూరంలో ధారాలమ్మ ఆలయం, అక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో రెయిన్‌గేజ్, అలాగే సీలేరు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో పొల్లూరు జలపాతం ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతాల్లో గతంలో షూటింగ్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లకు నిలిచాయి. గతంలో సీలేరులో షూటింగ్ చేసిన శోభన్‌బాబు, కాంచన నటించిన కల్యాణ మండపం, కృష్ణ, విజయనిర్మల నటించిన పాడిపంటలు, చంద్రమోహన్, విజయశాంతి నటించిన పెళ్లిచూపులు, తదితర సినిమాలు ఘన విజయం సాధించాయి. ఇటీవల ధారాలమ్మ ఆలయంలో ధీర ధాత్రీ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.
టూరిజం హబ్‌గా చేయాలని ప్రభుత్వ నిర్ణయం
సీలేరు ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సీలేరు మారెమ్మ ఆలయం ఎదురుగా ఉన్న గుంటవాడ జలాశయంలో వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు నిర్మించడానికి ఏపీ ఎయిర్ పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం గత ఏప్రిల్ 2న ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాంత వాసులు అనుకూలంగా ఉన్నట్టు ప్రజాభిప్రాయ సేకరణలో తెలిపారు. ధారకొండలో గల ధారాలమ్మ ఆలయాన్ని టెంపుల్ సిటీగా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలో ఇవి కార్యరూపం దాల్చనున్నాయి.
ప్రకృతి అందాలకు నటులు, దర్శకులు ఫిదా
సీలేరులో ఇరుముడి షూటింగ్‌లో పాల్గొన్న సందర్భాన్ని ప్రముఖ నటులు రవితేజ, సాయికుమార్, దర్శకుడు శివ నిర్వాణ తరచూ గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా పలు ఇంటర్వ్యూల్లో ఈ ప్రాంత అందాల గురించి చెప్పారు. కేరళంలో తరహా అందాలు ఇక్కడ ఉన్నాయని కొనియాడారు. తమిళనాడు, కర్ణాటకకు చెందిన అభిమానులు ఈ ప్రకృతి అందాలను చూడాలంటే ఎలా వెళ్లాలని అడుగుతున్నారని నటుడు సాయికుమార్ ఇటీవల తెలిపారు. ఇక్కడి ప్రజల అభిమానాన్ని మరువలేమని ఆయనతో పాటు రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ పలు సందర్భాల్లో చెప్పారు.