స్థితప్రజ్ఞతే మావాడి ప్రత్యేకత
ABN , Publish Date - Aug 05 , 2026 | 02:00 AM
ఒకప్పుడు జాతీయ వాలీబాల్ క్రీడాకారిణిగా రాణించిన ఆమె... పెళ్లి తరువాత గృహిణి పాత్రలో ఒదిగిపోయారు. కానీ కొడుకును ఆటల్లో ప్రోత్సహించి... బ్యాడ్మింటన్ స్టార్‌ను చేసి...
సంకల్పం
ఒకప్పుడు జాతీయ వాలీబాల్ క్రీడాకారిణిగా రాణించిన ఆమె... పెళ్లి తరువాత గృహిణి పాత్రలో ఒదిగిపోయారు. కానీ కొడుకును ఆటల్లో ప్రోత్సహించి... బ్యాడ్మింటన్ స్టార్‌ను చేసి... అతడిలో తనను చూసుకొంటున్నారు. ఇటీవల ‘ఆల్ ఇంగ్లండ్’ జూనియర్ టైటిల్ గెలిచి... ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన సాయి నచికేత్ తల్లి... భట్రాజు నాగమణితో ‘నవ్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
‘‘ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అంటే తెలుగువాళ్లకు గుర్తుకువచ్చేది పుల్లెల గోపీచంద్ గారే. ఆయన తర్వాత జూనియర్ విభాగంలో ఆ ప్రతిష్ఠాత్మక టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయుడు, తెలుగువాడు, మా పెద్దబ్బాయి సాయి నచికేత్‌నే కావడం తల్లిగా, మాజీ వాలీబాల్ క్రీడాకారిణిగా చాలా సంతోషంగా ఉంది. ఆల్ ఇంగ్లండ్ గెలిచిన వారం వ్యవధిలోనే టర్కీ జూనియర్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో విజేతగా నిలవడం మా ఆనందాన్ని రెట్టింపు చేసింది. అయితే, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అనేది బాగా తెలిసినవాడు సాయి నచికేత్. ఈ విజయాలకు పొంగిపోకుండా ఇకపై టోర్నీల్లో మరింత బాధ్యతగా ఆడాలి. దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. ఆ సంకల్పంతోనే తను ముందుకు వెళుతున్నాడు.
నాన్న ప్రోత్సాహంతో...
మావారు ప్రకాష్ బ్యాంక్ మేనేజర్. ఆయన స్వస్థలం గుంటూరు. ఉద్యోగరీత్యా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు తిరిగి, చివరికి హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. పిల్లలు సాయి నచికేత్, సాయి హృషికేత్... ఇద్దరూ బ్యాడ్మింటన్ క్రీడాకారులే. నేను పుట్టి, పెరిగింది విజయనగరం. గజపతిరాజుల ‘మాన్సస్ ట్రస్టు’ బాలికల తెలుగు మీడియం పాఠశాలలో నేను ఎనిమిదో తరగతి చదువుతుండగా వాలీబాల్ మొదలుపెట్టాను. స్కూల్‌లో బాగా ఆడతుండడం గమనించిన పీఈటీ రామకృష్ణ సార్... నన్ను ప్రముఖ వాలీబాల్ కోచ్ భగవాన్‌దా్‌స దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశారు. విజయనగరం గ్రౌండ్స్‌లో కొంతకాలం శిక్షణ తీసుకున్నాక విశాఖపట్టణంలోని శాప్ వాలీబాల్ అకాడమీ సెలెక్షన్ ట్రయల్స్ కోసం అక్కడికి వెళ్లాను. ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చి, అకాడమీలో చోటు దక్కించుకున్నా. క్రీడాకారిణిగా నా కెరీర్‌ను మలుపు తిప్పిన సందర్భం అది. అప్పటివరకు విజయనగరంలోనే ఉన్నాను. ఒక వైపు చదువు... మరోవైపు వాలీబాల్... ఇదే నా లోకం. అకాడమీ కోసం విశాఖ వెళ్లాలంటే ఇంట్లో పంపిస్తారో లేదో అనుకున్నా. కానీ మా నాన్న సత్యనారాయణ... విషయం చెప్పగానే ఒప్పుకున్నారు. మాది సంప్రదాయ కుటుంబమైనా నాన్న చాలా విషయాల్లో అభ్యుదయవాదిగా, ముందు చూపుతో ఆలోచించేవారు. ఆయన ప్రోత్సాహంతో వాలీబాల్‌ను కెరీర్‌గా ఎంచుకొని, మంచి వాలీబాల్ సెట్టర్‌గా గుర్తింపు తెచ్చుకోగలిగాను.
మిలిటరీ ట్రైనింగ్...
నేను 1995-1999 మధ్య ‘శాప్’ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నప్పుడుఅర్జున, ద్రోణచార్య పురస్కారాల గ్రహీత అయిన దిగ్గజ ఆటగాడు శ్యామ్‌సుందర్ సార్ మాకు ప్రధాన కోచ్. రోజూ ఉదయం ఐదున్నరకు మైదానంలో లైనప్ అవ్వాల్సిందే. సాధనలో కానీ ఆటలో కానీ ఏ మాత్రం తప్పిదాలు చేసినా కోర్టులో రోల్ అవుట్ చేయించేవారు. ఆయన దగ్గర తీసుకున్న శిక్షణతో భీమవరంలో జరిగిన జూనియర్ నేషనల్స్‌కు ఎంపికవడం, ఆ పోటీల్లో ఆంధ్రా జట్టు రన్నర్‌పగా నిలవడం నా కెరీర్‌లో మధుర అనుభూతి. సీనియర్ నేషనల్స్‌లో రెండుసార్లు ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాను. ఆంధ్రా యూనివర్సిటీ వాలీబాల్ జట్టుకు మూడుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించాను. యూనివర్సిటీలో ఎమ్‌కాం చదివాను. పీజీ చేస్తుండగా నాకు పెళ్లయింది.
చేతన్ ఆనంద్ శిష్యరికంలో...
మావారి ఉద్యోగరీత్యా గుంతకల్లులో కొన్నాళ్లు ఉన్నాం. అక్కడ నచికేత్‌కు పదేళ్లప్పుడు బ్యాడ్మింటన్‌పై ఆసక్తి కలిగింది. అలా కోచ్ ఫణి వద్ద బ్యాడ్మింటన్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత మావారు హైదరాబాద్ బదిలీ కావడంతో ఇక్కడికి వచ్చేశాం. జాతీయ బ్యాడ్మింటన్ మాజీ కోచ్ భాస్కర్‌బాబు దగ్గర మా అబ్బాయి ప్రాథమిక శిక్షణ తీసుకున్నాడు. కొవిడ్ తర్వాత దిగ్గజ షట్లర్ చేతన్ ఆనంద్ అకాడమీలో చేరాడు. సాయి నచికేత్ క్రమశిక్షణ, కష్టపడే తత్వం చేతన్ సార్ దృష్టిలో పడింది. అప్పటివరకు కొంచెం బొద్దుగా ఉండే సాయి, ఆయన సూచనల మేరకు ఆటతో పాటు ఫిట్‌నె్‌సకు సమాన ప్రాధాన్యం ఇచ్చాడు. ఉదయం ఐదున్నరకల్లా అకాడమీకి వెళ్లిపోయేవాడు. అక్కడ 7.30 వరకు తొలి సెషన్, 8.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రెండో సెషన్, తిరిగి సాయంత్రం 4.30 నుంచి 8.30 వరకు మూడో సెషన్. ఐదేళ్లగా ఇదే సాయి దినచర్య. చేతన్ సార్ వాడిని ఆటలో అంతలా లీనం చేశారు. అయితే ఏ రోజూ బ్యాడ్మింటన్ గురించి మా ఇంట్లో చర్చే ఉండదు. అంతా గురు, శిష్యుల మధ్యనే ఉంటుంది. పోటీలకు ఎలా సన్నద్ధమవ్వాలి, ఎలాంటి ప్రణాళికలు అనుసరించాలి లాంటివన్నీ చేతన్ గారే చూసుకుంటారు. నచికేత్ ఆటల్లో పడి చదువును నిర్లక్ష్యం చేయలేదు. పదో తరగతిలో 87 శాతం, ఇంటర్మీడియేట్‌లో 60 శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్నాడు.
ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ...
సాయికి బాల్యం నుంచి ఆధ్యాత్మిక భావాలు మెండు. జయాపజయాలను ఒకే విధంగా చూస్తాడు. దేనికీ పొంగిపోడు, కుంగిపోడు. స్థితప్రజ్ఞతతో ఉంటాడు. అదే వాడిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటాడు. మా ఇంట్లో టీవీ అనేది లేదు. ఖాళీ సమయంలో పుస్తకాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత... వీటిపైనే చర్చించుకుంటాం. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా కుటుంబమంతా రామకృష్ణ మఠానికి వెళతాం. అంతర్జాతీయ పోటీలకు వెళ్లడం మొదలుపెట్టాకే స్మార్ట్ ఫోను వాడడం ప్రారంభించాడు. అంతకుముందు వరకు కమ్యూనికేషన్ కోసం సాధారణ ఫోన్ వాడేవాడు. క్రమశిక్షణ, కష్టపడే గుణం సాయిని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ప్రస్తుతం వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో 21 స్థానంలో ఉన్నాడు. వాడు సాధించాల్సింది ఇంకా ఎంతోవుంది.
‘‘సాయి నచికేత్ చాలా ప్రతిభావంతుడు. తాజా విజయాలు గత రెండేళ్లగా అతడు చేస్తున్న కఠోర శ్రమకు నిదర్శనం. నచికేత్ మరింత వేగం, బలం పుంజుకోవాల్సి ఉంది. ఇదే జోరును వచ్చే రెండేళ్లలో సీనియర్ విభాగంలోనూ కొనసాగిస్తాడని ఆశిస్తున్నా’’ అంటూ అపూర్వ విజయాల అనంతరం చేతన్ ఆనంద్ గారు నచికేత్‌ను అభినందించారు.
తీరు మారాలి...
పిల్లలను తల్లిదండ్రులు మరీ సున్నితంగా, గారాబంగా పెంచుతున్నారు. ఫలితంగా ఉపాధ్యాయులు, కోచ్‌లు ఎవరైనా కొంచెం కఠినంగా ప్రవర్తించినా వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. వారిని సరైన మార్గంలో పెట్టడానికి కాస్త గట్టిగా చెప్పినా తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదులు చేయడం, వారితో గొడవ పడటంలాంటివి జరుగుతున్నాయి. తద్వారా గురువులు వారికి ఏదీ గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఈ ధోరణి పిల్లల భవిష్యత్‌పైనే చెడు ప్రభావం చూపుతుంది. వారి జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులైనా తట్టుకొనేలా రాటుదేలాలంటే గురువుల మార్గదర్శనంలో నడవాలి. వారు చెప్పినవి పాటించాలి.
ఎస్.ఎ్‌స.బి.సంజయ్
నిరీక్షించాల్సి వచ్చింది...
నా బ్యాడ్మింటన్ ప్రయాణం అంత సజావుగా ఏమీ సాగలేదు. అండర్-13 స్థాయిలో విజయవంతమయ్యాక పెద్ద టోర్నీలో గెలవడానికి చాలా ఏళ్లు ఓపికతో నిరీక్షించాల్సి వచ్చింది. అండర్-17 నుంచి చేతన్ సార్ దగ్గర శిక్షణ ప్రారంభించాక నా కెరీర్ మలుపు తిరిగింది. అండర్-17 జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో కాంస్యం గెలిచాక కెరీర్ గాడిలో పడింది. అథ్లెట్ ప్రయాణంలో గెలుపు, ఓటమి సహజం. అయితే ఎలాంటి సందర్భంలోనూ మనపై మనం నమ్మకం కోల్పోకూడదు. అదే ముఖ్యం. నా మొదటి అంతర్జాతీయ టైటిల్ ఆల్ ఇంగ్లండ్ టోర్నీ కావడం చాలా సంతోషంగా ఉంది. ఆ వెంటనే టర్కీ ఓపెన్ గెలవడం ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. నా ఎదుగుదలలో మా అమ్మానాన్నల పాత్ర వెలకట్టలేనిది. వారి త్యాగాలు, ప్రేమ, ఆప్యాయతలు, మద్దతుతోనే ఇక్కడివరకు రాగలిగాను.
సాయి నచికేత్
Also Read:
మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు
శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు