గులాబీ మొక్క సరిగా పెరగట్లేదా...
ABN , Publish Date - Apr 29 , 2026 | 02:41 AM
నర్సరీ నుంచి గులాబీ మొక్కను తెచ్చి కుండీలో నాటిన మూడో రోజే ఎండిపోవడం చూస్తుంటాం. అలాంటప్పుడు మొక్కను కాపాడి పూలు పూయించే చిట్కాల గురించి తెలుసుకుందాం...
నర్సరీ నుంచి గులాబీ మొక్కను తెచ్చి కుండీలో నాటిన మూడో రోజే ఎండిపోవడం చూస్తుంటాం. అలాంటప్పుడు మొక్కను కాపాడి పూలు పూయించే చిట్కాల గురించి తెలుసుకుందాం...
ముందుగా మొక్కను పరిశీలించాలి. ఎండిపోయిన కొమ్మలు, ఆకులతోపాటు నల్లగా మారిన భాగాలను కత్తెర సహాయంతో తొలగించాలి. కత్తిరించిన చోట పసుపు లేదా ఫంగిసైడ్ రాయడం వల్ల మొక్కకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి. క్రమంగా కొత్త చిగుర్లు రావడం గమనించవచ్చు.
గులాబీ మొక్కలకు రోజుకు కనీసం ఆరు గంటలపాటు ఎండ తగలాలి. కుండీలను నీడలో పెడితే పూలు పూయవు.
తరచూ నాణ్యమైన కంపోస్టు, సేంద్రీయ ఎరువులు కలుపుతూ ఉంటే మట్టిలో పోషకాలు పెరుగుతాయి. దీంతో మొక్క బలంగా పెరిగి కొమ్మలు, ఆకులు, పువ్వులతో నిండుతుంది. నెలకోసారి పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు అందించాలి. వాడేసిన టీ పొడిని శుభ్రంగా కడిగి మట్టిలో కలపవచ్చు. కోడిగుడ్డ పెంకులను పొడి చేసి మట్టిలో కలిపితే మొక్కకు కావాల్సిన కాల్షియం లభిస్తుంది.
రోజూ గులాబీ మొక్కకు పరిమితంగా నీటిని అందించాలి. కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కుండీ కింద రంధ్రం మట్టితో పూడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. కుండీలో మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలా చూడాలి. అలాగని ఎక్కువగా నీళ్లు పోసి మట్టిని బురదలా మార్చేయకూడదు. వేళ్లకు గాలి తగిలేలా వారానికి ఒకసారి మట్టిని పైపైన తవ్వుతూ ఉండాలి.
గులాబీ మొక్కను నేలలో నాటినట్లయితే దానికి దగ్గరలో మరే ఇతర మొక్కలను నాటకూడదు. కొమ్మలు ఏపుగా పెరగడానికి వీలుండేలా ఏర్పాటు చేయాలి.
ఇవి కూడా చదవండి:
జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు
మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ