Share News

రోల్‌మోడల్‌

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:04 AM

కన్నవారు కాదనుకున్నా... సమాజం వెలివేసినట్టు చూసినా... ఆమె తన సంకల్పాన్ని వదులుకోలేదు. ఉన్నత చదువులు చదివి... స్వశక్తితో ఎదిగి...

రోల్‌మోడల్‌

స్ఫూర్తి

కన్నవారు కాదనుకున్నా... సమాజం వెలివేసినట్టు చూసినా... ఆమె తన సంకల్పాన్ని వదులుకోలేదు. ఉన్నత చదువులు చదివి... స్వశక్తితో ఎదిగి... క్యాట్‌వాక్‌లతో ర్యాంప్‌పై మురిపిస్తోంది. ‘తిరు అవల్‌ ట్రస్టు’ నెలకొల్పి... ఆపన్నులకు అండగా నిలిచి... నేడు తనలాంటివారికి ఆశా దీపమైంది. మోడల్‌... డ్యాన్స్‌ టీచర్‌... సోషల్‌ వర్కర్‌ అయిన 36 ఏళ్ల ట్రాన్స్‌ మహిళ రియానా సూరి అంతరంగం ఇది.

‘‘నా గురించి నిజాన్ని నేను తెలుసుకున్నది పన్నెండేళ్ల వయసులో. అప్పటివరకు నేను ఒక అబ్బాయినే అనుకున్నాను. ఆడుతూ పాడుతూ సాగిపోయిన జీవితానికి సడెన్‌ బ్రేక్‌ పడినట్టు అనిపించింది. తెలిసీ తెలియని ఆ వయసులో అమ్మాయిననే భావన నాలో మొదలైంది. ఏ శుభకార్యం జరిగినా ఆడపిల్లలా ముస్తాబై వెళ్లేదాన్ని. దానికి మా అమ్మా నాన్న అస్సలు ఒప్పుకొనేవారు కాదు. అందరూ నన్ను వింతగా చూసేవారు. ఆ తరువాత ‘నేను ట్రాన్స్‌జెండర్‌ని’ అనే వాస్తవం బోధపడింది. ఎన్నో నిద్ర లేని రాత్రులు... చుట్టుముట్టిన ఆలోచనలు... నన్ను నేనుగా ఈ ప్రపంచానికి ఎలా పరిచయం చేసుకోవాలో అర్థంకాక అయోమయంలో పడిపోయాను. తమిళనాడులోని తిరుచ్చి మాది. నాన్న కో-ఆపరేటివ్‌ రంగంలో పని చేసేవారు. అమ్మ ఇన్సియా మేరీ గృహిణి. నాన్న చనిపోయాక కుటుంబ భారం అన్నయ్యపై పడింది. తను ప్రభుత్వ ఉద్యోగి.

వదిన చొరవతో...

నేను ట్రాన్స్‌మహిళనని తెలిశాక మా కుటుంబం నన్ను దూరం పెట్టింది. తమ ఇంట్లో వ్యక్తిని కాదన్నట్టు ప్రవర్తించింది. ‘ఇందులో నేను చేసిన పాపం ఏమిటి? ఎందుకీ వివక్ష?’ అని తీవ్ర మానసిక వేదనకు గురయ్యాను. ఆ సమయంలో మా వదిన గాయత్రి లెనిన్‌ నాకు అండగా నిలిచింది. తను మా ఇంట్లోవాళ్లకు నా పరిస్థితి గురించి వివరించి చెప్పింది. దాంతో వాళ్లు అర్థం చేసుకున్నారు. నా కాళ్లపై నేను నిలబడాలనే సంకల్పంతో ఎన్ని అవమానాలు, అవహేళనలు ఎదురైనా చదువు కొనసాగించాను. స్థానిక సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీలో డిగ్రీ తరువాత జమాల్‌ మహమ్మద్‌ కాలేజీలో ఫిజిక్స్‌లో పీజీ పూర్తి చేశాను.


ఉద్యోగ వేటలో...

పీజీ తరువాత ఉద్యోగాల కోసం ప్రయత్నించాను. పోటీ పరీక్షలు రాశాను. ఇంటర్వ్యూల వరకు వెళ్లాను కానీ, ఉద్యోగం రాలేదు. ప్రైవేటు కంపెనీలకు వెళితే... వారికి నా విద్యార్హతలు కనిపించలేదు. ట్రాన్స్‌జెండర్‌ననే ఒకే ఒక్క కారణంతో తిరస్కరించారు. నాలో నేనే రగిలిపోయాను. నా కోపం ఎవరి మీద చూపించాలి? మొత్తం సమాజం అలానే ఉన్నప్పుడు ఆవేశపడటంలో అర్థం లేదనిపించింది. ఉద్యోగ ప్రయత్నాలకు స్వస్తి చెప్పి... నాదైన మార్గాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌పై మక్కువ ఎక్కువ. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సంప్రదాయ నృత్యం నేర్చుకున్నా. చాలా ప్రదర్శనలు ఇచ్చాను. పోటీల్లో బహుమతులెన్నో గెలుచుకున్నాను. డ్యాన్స్‌ పాఠాలు చెప్పి జీవనోపాధి పొందవచ్చని భావించి, నాట్య తరగతులు ప్రారంభించాను.

6-navya.jpg

‘అందంగా’ పోటీ...

చిన్న చిన్న యాడ్స్‌తో మొదలైన నా మోడలింగ్‌ కెరీర్‌... ఆశించినదాని కంటే ఎక్కువ సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ‘మిస్‌ త్రిచి, మిస్‌ కూవగమ్‌, మిస్‌ ట్రాన్స్‌ క్వీన్‌ ఇండియా, మిస్‌ సౌతిండియా ట్రాన్స్‌’ తదిత ర అందాల పోటీల్లో పాల్గొన్నాను. 2023లో ‘మిస్‌ యూనివర్స్‌ ట్రాన్స్‌ ఇండియా’ టైటిల్‌ నెగ్గడం నా జీవితంలోనే అపురూప ఘట్టం. ప్రస్తుతం అందాల పోటీల్లో పాల్గొనేవారికి మార్గదర్శనం చేస్తున్నాను. మిస్‌ యూనివర్స్‌ ట్రాన్స్‌ ఇండియా పోటీల జాతీయ డైరెక్టర్‌గా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాను.

సేవకు శ్రీకారం...

నాలాంటివారు దేశంలో ఎంతోమంది అటు అయినవారికి, ఇటు సమాజానికి పట్టక వీధుల్లో బిచ్చమెత్తుతున్నారు. ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు తేవడం నా కర్తవ్యంగా భావించాను. ఇందులో భాగంగా 2019లో ‘తిరు అవల్‌ ట్రస్ట్‌’ ప్రారంభించాను. కొవిడ్‌ సమయంలో ట్రస్ట్‌ ద్వారా ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశాను. వారికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాను. ఇప్పుడు మా ట్రస్ట్‌తో కలిసి ముప్ఫై మంది ట్రాన్స్‌జెండర్లు పని చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్‌ విద్యార్థులకు స్పాన్సర్లను వెతికి పట్టుకోవడం నేను సాధించిన అతిపెద్ద ఘనతల్లో ఒకటి. అలా మా ట్రస్ట్‌ ద్వారా కొందరు ఎంఎ్‌ససీ, బీఈడీ తదితర కోర్సులు పూర్తి చేసినవారున్నారు. వీటితోపాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాను. ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తున్నాను. ఏదిఏమైనా నాలాంటివారిలో ధైర్యం నింపి, ఈ సమాజంలో వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాను.’’


అనుకోని అవకాశం...

ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదు కానీ... ‘తమిళనాడు స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ’లో అవుట్‌సోర్సింగ్‌ వర్కర్‌గా అవకాశం వచ్చింది. నెలకు రూ.8వేల జీతం. అక్కడ ఎనిమిదేళ్లు పని చేశాను. నాట్యం నేర్పుతూనే ఉద్యోగం కూడా కొనసాగించాను. మొదట్లో చాలామంది నా వద్ద డ్యాన్స్‌ నేర్చుకోవడానికి వచ్చేవారు. కానీ నేను ట్రాన్స్‌ మహిళలనని తెలిసి మానేసేవారు. ఎలా నెట్టుకురావాలో అంతుపట్టక ఆలోచనల్లో పడినప్పుడు... ఒక ఫొటోగ్రాఫర్‌ నుంచి కాల్‌ వచ్చింది. తను ఫేస్‌బుక్‌లో నా ఫొటోలు చూసి ఫోన్‌ చేసినట్టు చెప్పాడు. ‘‘మోడలింగ్‌ చేస్తావా?’’ అని అడిగాడు. నా జీవితాన్ని మలుపు తిప్పిన అవకాశం. నాకూ ఒక గుర్తింపు వచ్చిందని సంబర పడిన సందర్భం. అలా 2018లో మోడలింగ్‌లోకి ప్రవేశించాను.

ఇవి కూడా చదవండి..

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..

అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి..

Updated Date - Nov 05 , 2026 | 05:05 AM