Share News

కీళ్ల వాతం ఖతం

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:34 AM

కీళ్ల నొప్పులకు అరుగుదల ఒక్కటే కారణం కాదు. రోగనిరోధక వ్యవస్థ శరీరం మీదే ఎదురుదాడి చేసే ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల్లో కూడా కీళ్లు వాతానికి గురై, నొప్పులు వేధిస్తాయి...

కీళ్ల వాతం ఖతం

రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌

కీళ్ల నొప్పులకు అరుగుదల ఒక్కటే కారణం కాదు. రోగనిరోధక వ్యవస్థ శరీరం మీదే ఎదురుదాడి చేసే ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల్లో కూడా కీళ్లు వాతానికి గురై, నొప్పులు వేధిస్తాయి. రుమటాలజీ విభాగానికి చెందిన పది రకాల ప్రధాన రుగ్మతలను లక్షణాల ఆధారంగా కనిపెట్టి, చికిత్సతో సరిదిద్దుకోవాలంటున్నారు వైద్యులు.

కీళ్ల వాతం కీళ్లకే పరిమితం కాదు. దీన్లోని పది రకాల రుగ్మతలు, భిన్నమైన లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటాయి. ఈ రుగ్మతల్లో కీళ్ల నొప్పులతో పాటు అంతర్గత అవయవాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. భిన్నమైన లక్షణాలతో తప్పుదోవ పట్టించే ఈ రుగ్మతల పట్ల అవగాహన పెంచుకోగలిగితే, సాధ్యమైనంత త్వరగా సమర్థమైన చికిత్సను తీసుకోగలుగుతాం!

వేర్వేరు రూపాల్లో వేధిస్తూ...

ఫ రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌: రుమటాలజీలో ఇదొక ప్రధాన సమస్య. ఉదయం నిద్రలేస్తూనే 45 నుంచి 60 నిమిషాల వరకూ కీళ్లు పట్టుకుపోయి, నెమ్మదిగా వదులవుతాయి. కాలి, చేతి వేళ్లు వాచిపోయి, మునక్కాడల్లా మారిపోతాయి. ఎడమ, కుడి.. ఇలా శరీరంలోని రెండు అర్థభాగాలూ, ఒకేసారి ప్రభావానికి గురవుతాయి. రెండు మోకాళ్లూ, మోచేతులూ, మణికట్లూ, వేళ్లు... ఒకేసారి ప్రభావితమవుతాయి. ఈ సమస్య మహిళల్లో మూడురెట్లు ఎక్కువ. రక్తపరీక్షల్లో రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ పాజిటివ్‌ ఉంటుంది. ఈ లక్షణాలు 6 వారాలకు మించి వేధిస్తే, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటి్‌సగా అనుమానించి చికిత్స తీసుకోవాలి.


  • లూపస్‌: 15 నుంచి 50 ఏళ్ల వయసు మహిళల్లో ఈ సమస్య 9 రెట్లు ఎక్కువ. దీన్లో కూడా రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ లక్షణాలుంటాయి. అలాగే ఎండ సోకితే బుగ్గలు కందిపోతాయి. నోటి అల్సర్లు ఎక్కువగా వేధిస్తాయి, వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. అలసట, జ్వరం, బరువు కోల్పోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సమస్య క్రమేపీ ఇతరత్రా అంతర్గత అవయవాలను ప్రఽభావితం చేస్తుంది. రక్తం ప్రభావితమైతే, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌, హీమోగ్లోబిన్‌ తగ్గిపోతాయి. ఊపిరితిత్తులు ప్రభావితమైతే ఆయాసం, దగ్గు వేధిస్తాయి. మూత్రపిండాలకు సోకితే ప్రొటీన్‌ నష్టం, గుండె ప్రభావితమైతే గుండె వేగం పెరిగి గుండె విఫలం కావచ్చు. మెదడు ప్రభావితమైతే మూర్ఛలు వేధిస్తాయి. నరాలు ప్రభావితమైతే పెరిఫరల్‌ న్యూరోపతీతో కాళ్లలో, చేతుల్లో తిమ్మిర్లు ఇబ్బంది పెడతాయి. కాలేయం ప్రభావితమైతే కామెర్లు రావచ్చు. లూప్‌సలో ఎపిఎస్‌ సిండ్రోమ్‌ కూడా తలెత్తుతుంది. ఈ సమస్య ఉన్న మహిళల్లో వరుస గర్భస్రావాలు బాఽధిస్తాయి. కాళ్ల రక్తనాళాల్లో, ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డలు ఏర్పడతాయి. ఎఎన్‌ఎ, డిఎన్‌డిఎన్‌ఎ, యాంటీస్మిత్‌ పరీక్షలు పాజిటివ్‌ ఫలితాన్నిస్తే, లూప్‌సగా నిర్థారించుకోవాలి

  • జోగ్రన్‌ సిండ్రోమ్‌: ఈ సమస్య కూడా మహిళల్లోనే ఎక్కువ. కళ్లు, నోరు, చర్మం, యోని పొడిబారిపోవడం ప్రధాన లక్షణాలు. కళ్లు పొడిబారి పుసులు కడుతూ ఉంటాయి. నోరు ఎండిపోతూ ఉండడం వల్ల నీళ్లు ఎక్కువ తాగవలసి వస్తుంది. వీళ్లలో పిప్పి పళ్లు కూడా ఎక్కువే! యోని పొడిబారడం వల్ల లైంగిక చర్య ఇబ్బందికరంగా మారుతుంది. ఈ సమస్యలకు తోడు కీళ్ల నొప్పులు కూడా ఉంటాయి. పొటాషియం తీవ్రంగా క్షీణించి, పీరియాడిక్‌ పెరాలసిస్‌ తలెత్తుతుంది. ఎస్‌ఎ్‌సఎ, ఎస్‌ఎ్‌సబి పరీక్షలతో వ్యాధిని నిర్థారించి చికిత్సను ఎంచుకోవాలి

  • సోరియాటిక్‌ ఆర్థ్రయిటిస్‌: సోరియాసి్‌సతో పాటు కీళ్లు కూడా ప్రభావితమైతే దాన్ని సోరియాటిక్‌ ఆర్థ్రయిటి్‌సగా పరిగణించాలి. గోళ్లన్నీ ఫంగస్‌ సోకినట్టు మారిపోతాయి. అలాగే గోళ్ల మీద గుండుసూదితో గుచ్చిన గుర్తులు ఏర్పడి, పెళుసుగా మారిపోతాయి. ఈ రుగ్మతను నిర్థారించే పరీక్షలు లేకపోయినా, రుమటాలజిస్ట్‌ వెంటనే కనిపెట్టగలుగుతారు. ఈ రుగ్మత స్త్రీపురుషులను సమానంగా వేధిస్తుంది


  • యాంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌: ఈ సమస్య పురుషుల్లో 9 రెట్లు ఎక్కువ. ఉదయం లేవగానే గంట పాటు నడుం, వెన్ను నొప్పి వేధించి, పొద్దెక్కేకొద్దీ ఉపశమనం కలుగుతుంది. అర్థరాత్రి కూడా నొప్పి వేధించవచ్చు. పిరుదుల్లోని శాక్రో ఇలియాక్‌ కీలు వాతానికి గురై నొప్పి వేధిస్తుంది. వెన్ను నొప్పితో పాటు మెడకు కూడా నొప్పి వ్యాపించవచ్చు. క్రమేపీ చేతులు, కాళ్లు, పాదాలకు కూడా నొప్పి వ్యాపిస్తుంది. హెచ్‌ఎలె బి27 పరీక్ష పాజిటివ్‌ ఫలితాన్ని బట్టి, ఎక్స్‌రే ద్వారా వ్యాధిని నిర్థారించుకుని, సమర్థమైన చికిత్స తీసుకోవాలి. కొందర్లో వ్యాధి తీవ్రమై మెడ పట్టేస్తుంది

  • జెఐఎ (జువెనైల్‌ ఇడియోపతిక్‌ ఆర్థ్రయిటిస్‌): చిన్న పిల్లల్లో వచ్చే కీళ్ల వ్యాధి ఇది. దీన్లో ఐదు రకాలున్నాయి. అయితే ఒక ప్రధాన ఆర్థ్రయిటి్‌సలో జ్వరం, చర్మం మీద దద్దుర్లు, కీళ్ల నొప్పులు, వాపులు వేధిస్తాయి. జ్వరం వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలు సోకినప్పుడు జ్వరం తగ్గేవరకూ పిల్లలు మంచానికే పరిమితమైపోతే, జెఐఎ జ్వరంలో ఒక రోజులోనే పిల్లలు నీరసించిపోతూ, జ్వరం తగ్గిన వెంటనే హుషారుగా ఆడుకుంటూ ఉంటారు.

  • గౌట్‌: యూరిక్‌ ఆమ్లం పెరిగినప్పుడు వేధిస్తుంది. పురుషుల్లో ఎక్కువ, మెనోపాజ్‌కు చేరిన మహిళల్లో కూడా కనిపిస్తుంది. ఈ సమస్య జన్యుపరంగా కూడా సంక్రమించవచ్చు. మద్యం, మటన్‌, సముద్రాహారం తిన్నప్పుడు యూరిక్‌ ఆమ్లం కీళ్లలో పేరుకుపోయి, గౌట్‌ తలెత్తుతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి. వీళ్లలో గౌట్‌తో పాటు స్థూలకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ కూడా ఉండొచ్చు. ముందు రాత్రి ఎలాంటి అసౌకర్యం లేకపోయినా, తెల్లవారేసరికి కాలి బొటనవేలు వాచిపోతుంది. తీవ్రమైన నొప్పి వేధిస్తుంది. సాధారణంగా ఈ సమస్య దానంతట అదే తగ్గిపోయి, తిరగబెడుతూ ఉంటుంది. ఐదారేళ్ల పాటు చికిత్సను ఆలస్యం చేస్తే, ఈ సమస్య శాశ్వతంగా ఉండిపోతుంది

  • స్క్లీరోడెర్మా: మహిళల్లో ఎక్కువ. చర్మం మందంగా, బిగుతుగా మారిపోతుంది. కీళ్లనొప్పులు వేధిస్తాయి. చలికాలంలో, చల్లనీళ్లలో చేతులు పెట్టినా అవి నీలంగా మారిపోతాయి. తీవ్రమైన సందర్భాల్లో కాలి, చేతి వేళ్లకు రక్తప్రసరణ లోపించి, గ్యాంగ్రీన్‌తో నల్లగా మారిపోతాయి. పల్మొనరీ ఫైబ్రోసిస్‌ కూడా వేధిస్తుంది. ఎస్‌సిఎల్‌ 70 రక్తపరీక్షతో వ్యాధిని నిర్థారించుకోవచ్చు. అలాగే యాంటీసింట్రోమియర్‌ యాంటీబాడీస్‌ పరీక్ష ఫలితం కూడా పాజిటివ్‌ వస్తుంది

  • పాలీమయోసైటిస్‌: పద్మాసనం నుంచి పైకి లేవలేరు. అటక మీదున్న వస్తువులను అందుకోలేరు. కటి చుట్టూరా, భుజం చుట్టూరా ఉండే కండరాలు బలహీనపడడమే ఇందుకు కారణం. కళ్లు, ఛాతీ, వీపు మీద ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తాయి. రక్తపరీక్షతో వ్యాధి నిర్థారణ అయితే సమర్థమైన చికిత్సతో నయం చేసుకోవాలి. అలాగే ఎలకో్ట్రమయోగ్రఫీ పరీక్షతో, కండరాల ఎమ్మారైతో కూడా వ్యాధిని నిర్థారించుకోవచ్చు


99Navya.jpg

గురి తప్పని చికిత్సలు

గతంలో రుమటాయిడ్‌ ఆర్థ్రయిటి్‌సకు నొప్పి నివారణ మందులు, స్టిరాయిడ్లతో చికిత్సను అందించేవారు. కానీ నేటి చికిత్సా విఽధానం మారింది. కీళ్ల వాతాలకు గురి తప్పని సూటి చికిత్సలు అందుబాటులోకొచ్చాయి. మూల కారణాలు లక్ష్యంగా సాగే రుమటాలజీ చికిత్సలతో నొప్పులు అదుపులోకి రావడంతో పాటు జీవన నాణ్యత మెరుగుపడుతోంది. సపోర్టివ్‌ చికిత్సలో భాగంగా పరిమిత మోతాదుతో కూడిన నొప్పి నివారణ మందులతో పాటు, తక్కువ మోతాదు ‘స్టిరాయిడ్స్‌’ను అందివలసి ఉంటుంది. స్టిరాయిడ్స్‌ పట్ల మనలో కొన్ని అపోహలున్నాయి. క్రీడాకారులు కండర సామర్థ్యం, శరీర దారుఢ్యాల కోసం వాడుకునేవి... అనబాలిక్‌ స్టిరాయిడ్స్‌. ఇవి కొంతమేరకు ఆరోగ్యానికి హానికరమైనవి. కానీ కీళ్ల వాత చికిత్సల్లో ఇచ్చేవి ‘కార్టికో స్టిరాయిడ్స్‌’. నిజానికి మన శరీరంలోని అడ్రినలిన్‌ గ్రంథి ప్రతి రోజూ ఐదు మిల్లీగ్రాముల కార్టికో స్టిరాయిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ ఫలితంగా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగినప్పుడు శరీరంలో తయారయ్యే స్టిరాయిడ్‌ మోతాదు సరిపోకపోవచ్చు. కాబట్టి సప్లిమెంట్‌గా కార్టికో స్టిరాయిడ్స్‌ తీసుకోగలిగితే వ్యాధి అదుపులోకొస్తుంది.

ఆ తర్వాత వీటిని వాడుకోవలసిన అవసరం ఉండదు. గరిష్టంగా మూడు నెలల పాటు కార్టికో స్టిరాయిడ్స్‌ వాడుకుని మానేయవచ్చు. మరీ ముఖ్యంగా లూపన్‌ సమస్యకు స్టిరాయిడ్స్‌ అద్భుతమైన విరుగుడు. డిసీజ్‌ మాడిఫయింగ్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌లో నోటి మాత్రలు, ఇంజెక్షన్లు ఉంటాయి. వీటితో కూడా కీళ్ల వాత సమస్యలు అదుపులోకొస్తాయి. జాక్‌ ఇన్హిబిటర్స్‌, టిఎన్‌ఎఫ్‌ ఇన్హిబిటర్స్‌ కూడా మెరుగైన ఫలితాన్నిస్తాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • లూపస్‌ ఉన్న వాళ్లు ఎండలో తిరగడం తగ్గించాలి. లేదంటే సూర్యకిరణాల్లోని అతినీలలోహిత బి కణాలు శరీరానికి సోకి లూపస్‌ వ్యాధి పెరుగుతుంది

  • గౌట్‌ ఉన్నవాళ్లు అఽధిక ప్రొటీన్‌ (రెడ్‌ మీట్‌, సముద్రాహారం) తగ్గించాలి, మద్యం మానేయాలి

  • ఉపశమనం కోసం వేడి నీళ్ల కాపడం, చల్లనీళ్ల కాపడం ఎంచుకోవచ్చు


వ్యాయామం కీలకం

కీళ్ల నొప్పులు మొదలు కాగానే విశ్రాంతికి పరిమితమయ్యే వారే ఎక్కువ. అయితే మందులు వాడుకుంటూ శారీరకంగా చురుగ్గా ఉండే ప్రయత్నం చేయాలి. నిజానికి విశ్రాంతితో కీళ్లు బిగుసుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైద్యులు సూచించే వ్యాయామాలతో పాటు, యోగా, ఈత లాంటివి సాధన చేస్తూ ఉండాలి. ఆహార నియమాల్లో భాగంగా ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచే రెడ్‌ మీట్‌ మానేయాలి. ఒమేగా3 ఎక్కువగా ఉండే వాల్‌నట్స్‌ తీసుకోవాలి. విటమిన్‌ సి సమృద్ధిగా దొరికే పుల్లని పండ్లు తీసుకోవాలి. వృక్షాధారిత ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

డాక్టర్‌ వి. శరత్‌ చంద్ర మౌళి

క్లినికల్‌ డైరెక్టర్‌ - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రుమటాలజీ అండ్‌ క్లినికల్‌ ఇమ్యునాలజీ,

కిమ్స్‌ హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌

ఇవి కూడా చదవండి..

'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం

Updated Date - Feb 10 , 2026 | 01:42 AM