మామిడికాయలతో మజాగా
ABN , Publish Date - May 09 , 2026 | 04:48 AM
వేసవికాలంలో పుల్లటి మామిడికాయలతో రకరకాల వంటకాలు చేస్తూ ఉంటాం. ఎప్పుడూ చేసుకునే పప్పు, పచ్చడి, రసం లాంటివి కాకుండా కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే ఆ మజానే...
వంటిల్లు
వేసవికాలంలో పుల్లటి మామిడికాయలతో రకరకాల వంటకాలు చేస్తూ ఉంటాం. ఎప్పుడూ చేసుకునే పప్పు, పచ్చడి, రసం లాంటివి కాకుండా కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే ఆ మజానే వేరు. అలా మామిడికాయలతో సులువుగా తయారుచేసే వెరైటీ వంటకాలు మీకోసం...
మామిడికాయ మటన్ కర్రీ
కావాల్సిన పదార్థాలు
మటన్ ముక్కలు- అర కేజీ, పుల్లటి మామిడికాయ ముక్కలు- 350 గ్రాములు, పసుపు- అర చెంచా, ఉప్పు- చెంచా, కారం- ఒకటిన్నర చెంచాలు, ఆవాలు- పావు చెంచా, మెంతులు- పావు చెంచా, జీలకర్ర- పావు చెంచా, పచ్చిమిర్చి- నాలుగు, నూనె- మూడు చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్టు- అర చెంచా, కొత్తిమీర- కొద్దిగా, మెంతికూర- చిన్న కట్ట, ఉల్లిపాయలు- రెండు, వేడి నీళ్లు- రెండు గ్లాసులు
తయారీ విధానం
స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడిచేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, సన్నగా తరిగిన మెంతికూర వేసి కలిపి దోరగా వేయించాలి. ఆపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి.
అయిదు నిమిషాల తరువాత మటన్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి చిన్న మంట మీద మగ్గనివ్వాలి. మటన్‌లోని నీరంతా ఇంకిన తరువాత కారం వేసి కలపాలి.
ఈ మిశ్రమంలో నూనె పైకి తేలుతున్నప్పుడు వేడినీళ్లు పోసి మరో పన్నెండు నిమిషాలు ఉడకనివ్వాలి. మటన్ ముక్కలు ఉడికి మెత్తబడిన తరువాత మామిడికాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి మరో పది నిమిషాలపాటు మగ్గించాలి. చివరగా ఉప్పు సరిచూసుకుని కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ మీద నుంచి దించాలి. అంతే నోరూరించే మామిడికాయ మటన్ కర్రీ... వడ్డించడానికి సిద్ధం. ఇలా గిన్నెలో చేస్తే కూర పూర్తవడానికి గంట పడుతుంది. అదే కుక్కర్‌లో చేస్తే అరగంటలో అయిపోతుంది.
మామిడికాయ టమాటా పచ్చడి
కావాల్సిన పదార్థాలు
పుల్లటి మామిడి కాయ- ఒకటి, టమాటాలు- పావు కేజీ, పసుపు- చిటికెడు, ఉప్పు- ముప్పావు చెంచా, కారం- చెంచా, మెంతి పిండి- పావు చెంచా, ఆవ పిండి- పావు చెంచా, జీలకర్ర పొడి- పావు చెంచా, మినప్పప్పు- పావు చెంచా, పచ్చి శనగపప్పు- అర చెంచా, ఆవాలు- పావు చెంచా, జీలకర్ర- పావు చెంచా, వెల్లుల్లి రెబ్బలు- 3, ఎండు మిర్చి- 2, కరివేపాకు- 2 రెమ్మలు, ఇంగువ- చిటికెడు, నూనె- 3 చెంచాలు
తయారీ విధానం
టమాటాలను శుభ్రంగా కడిగి ఒక్కోదాన్ని రెండు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. మామిడికాయకు తొక్క తీసి పెద్ద ముక్కలుగా కోయాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి చెంచా నూనె వేసి వేడిచేయాలి. అందులో ఓ పక్కగా టమాటా ముక్కలను బోర్లా వేయాలి. రెండో పక్కన మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు, పసుపు చల్లి మూతపెట్టి మగ్గనివ్వాలి. పది నిమిషాల తరువాత గిన్నెను స్టవ్‌మీద నుంచి దించాలి. చెంచా సహాయంతో టమాటా ముక్కల మీద ఉన్న తొక్కను తొలగించాలి. ఆపైన పప్పు గుత్తి సహాయంతో టమాటా, మామిడికాయల ముక్కలను మెత్తగా మెదపాలి. తరువాత మిగిలిన ఉప్పు, కారం, మెంతి పిండి, ఆవ పిండి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి అందులో రెండు చెంచాల నూనె వేసి అది వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మినప్పప్పు, పచ్చిశనగ పప్పు, ఎండుమిర్చి ముక్కలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి పోపు రెడీ చేయాలి. ఈ పోపుని టమాటా-మామిడికాయ మిశ్రమంలో వేసి కలపాలి. ఉప్పు సరిచూసుకోవాలి. అంతే రుచికరమైన మామిడికాయ టమాటా పచ్చడి రెడీ..! ఈ పచ్చడిని పది నిమిషాల్లో చేసేయొచ్చు. ఇది వారం పాటు నిల్వ ఉంటుంది కూడా.
అరటికాయ మామిడికాయ కర్రీ
కావాల్సిన పదార్థాలు
పుల్లటి మామిడి కాయ- ఒకటి, అరటి కాయలు- రెండు, పసుపు- చిటికెడు, ఉప్పు- అర చెంచా, కారం- చెంచా, అల్లం తురుం- పావు చెంచా, ధనియాల పొడి- పావు చెంచా, ఉల్లిపాయలు- రెండు, నూనె- రెండు చెంచాలు, ఆవాలు- పావు చెంచా, జీలకర్ర- పావు చెంచా, మెంతులు- పావు చెంచా, జీలకర్ర పొడి- పావు చెంచా, పచ్చి మిర్చి- మూడు, కొత్తిమీర- కొద్దిగా, కరివేపాకు- రెండు రెమ్మలు
తయారీ విధానం
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో నూనె వేసి వేడిచేయాలి. ఆపైన ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, అల్లం తురుం, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి రెండు నిమిషాలపాటు వేయించాలి. తరువాత అరటికాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మగ్గించాలి. రెండు నిమిషాల తరువాత ముక్కలు మునిగే వరకు మంచినీళ్లు పోసి కలిపి పావుగంటసేపు ఉడికించాలి. అరటికాయ ముక్కలు సగానికి పైగా ఉడికిన తరువాత మామిడికాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి మూతపెట్టి మరో పది నిమిషాలు ఉడికించాలి. తరువాత ఉప్పు సరిచూసుకుని కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ మీద నుంచి దించాలి. అన్నీ సిద్ధంగా ఉంచుకుంటే ఈ కూరని అరగంటలో చేసేయొచ్చు.
శైలజ ఏచూరి
శైలాస్ కిచెన్
ఇవి కూడా చదవండి...
పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం
కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం