గ్రామీణ శక్తి.. గ్లోబల్ కీర్తి
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:31 AM
ప్రకృతి పరిరక్షణలో గ్రామీణ మహిళా శక్తిని భాగస్వామ్యం చేస్తూ.. అంతరించిపోతున్న అరుదైన పక్షిజాతులను కాపాడుతున్న అసోంకు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త...
ప్రకృతి పరిరక్షణలో గ్రామీణ మహిళా శక్తిని భాగస్వామ్యం చేస్తూ.. అంతరించిపోతున్న అరుదైన పక్షిజాతులను కాపాడుతున్న అసోంకు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ మరో అంతర్జాతీయ అత్యున్నత గౌరవానికి ఎంపికయ్యారు. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ, కియా సంస్థ సంయుక్తంగా అందజేసే ప్రతిష్ఠాత్మక ‘వేఫైండర్ అవార్డు 2026’కు ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 15 మంది విజేతల్లో ఆమె ఒకరిగా నిలిచారు. ఒకప్పుడు అపశకునంగా భావించిన పక్షిని మహిళ ఆత్మగౌరవ ప్రతీకగా మార్చిన ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది.
‘‘పర్యావరణ పరిరక్షణ అంటే ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడే సిద్ధాంతాలు కావు. అది క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల హృదయాలను తాకే ఒక జీవనశైలి. ఈ నిజాన్ని నేను నా ప్రతి శ్వాసలోనూ నమ్ముతాను. నా బాల్యం అంతా అస్సాం కామరూప్ జిల్లాలోని పబ్ మజీర్‌గావ్ అనే చిన్న గ్రామంలో గడిచింది. 1980లో జన్మించిన నాకు బ్రహ్మపుత్ర నది, పచ్చని పొలాలు, చెట్లపై వాలే రకరకాల పక్షులే నా తొలి నేస్తాలు.
అమ్మమ్మ నేర్పిన ప్రకృతి పాఠాలు
నాలో ప్రకృతిపై కుతూహలాన్ని పెంచడంలో మా అమ్మమ్మ పాత్ర మరువలేనిది. చిన్నతనంలో ఆమె నాకు చెప్పిన కథలు, పక్షుల పట్ల చూపించిన ప్రేమ నా మనసులో పర్యావరణ పరిరక్షణ అనే విత్తనాన్ని బలంగా నాటాయి. ప్రకృతిని ప్రేమించడం, జీవరాశులను గౌరవించడం ఆమె నుంచే నేర్చుకున్నాను. ఆ ఆసక్తితోనే గౌహతి విశ్వవిద్యాలయంలో జువాలజీ చదివి ఈకోలాజీ అండ్ వైల్డ్‌లైఫ్ బయాలజీలో మాస్టర్స్ పూర్తిచేశాను. ఆ తర్వాత పీహెచ్‌డీ ప్రారంభించినా, నా పరిశోధన పుస్తకాలకే పరిమితం కాకూడదని భావించి కొన్నాళ్లపాటు వాయిదా వేశాను. చివరికి 2019లో పీహెచ్‌డీ పూర్తిచేసి, ప్రస్తుతం ‘ఆరణ్యక్’ అనే జీవవైవిధ్య పరిరక్షణ సంస్థలో వన్యప్రాణి జీవశాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. కానీ అస్సాం ప్రజలు నన్ను ఆప్యాయంగా ‘హర్గిల బైదో’(హర్గిల అక్క) అని పిలుచుకుంటారు.
వివక్షకు గురైన అరుదైన జాతి
2007 ప్రాంతంలో నేను పరిశోధనలు చేస్తున్న సమయంలో నా దృష్టి ‘గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్’ అనే ప్రపంచంలోనే అత్యంత అరుదైన కొంగజాతి పక్షిపై పడింది. అస్సాంలో దీనిని ‘హర్గిల’ అంటారు. నివాస స్థలాలను కోల్పోయిన ఈ కొంగలు క్రమంగా గ్రామాల సరిహద్దుల్లోని చెట్లపై గూళ్లు కట్టుకోవడం ప్రారంభించాయి. ఇది వాటికి తీవ్ర ముప్పుగా పరిణమించింది. అస్సాం గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ పక్షిని అసహ్యించుకునేవారు. అవి కుళ్లిన వ్యర్థాలను తినడం, వాటి నివాసాల నుంచి దుర్వాసన రావడం వల్ల వాటిని ‘అపశకునం’గా భావించేవారు. ఆ పక్షులు గూళ్లు కట్టుకున్న వృక్షాలను దయాదాక్షిణ్యాలు లేకుండా నరికేసేవారు. దీంతో గుడ్లు, పిల్ల పక్షులు కిందపడి చనిపోయేవి.
హర్గిల ఆర్మీ ఆవిర్భావం
అంతరించిపోతున్న ఈ పక్షి పరిస్థితి నన్ను తీవ్రంగా కలచివేసింది. వీటిని కాపాడేందుకు సైంటి్‌స్టగా పేపర్లు రాయడం వల్ల ఉపయోగం ఉండదని గ్రహించాను. చట్టాల కంటే ముఖ్యంగా స్థానికుల మనస్తత్వంలో మార్పు తీసుకురావడం, హర్గిల పక్షులపై ఉన్న అసహ్యాన్ని పోగొట్టి, వాటిపట్ల ప్రేమను పెంచడమే సరైన మార్గమని అనుకున్నాను. ప్రజల మూఢనమ్మకాలను మార్చడం అంత తేలికైన పనికాదు. నా ప్రచారం ప్రారంభంలో అనేక అవమానాలు ఎదురయ్యాయి. కానీ, గ్రామీణ మహిళలే పర్యావరణ పరిరక్షణకు సరైన సైనికులవుతారని భావించి అస్సాంలోని దదర, పచరియా, సింగిమరి గ్రామాల మహిళలను సమకూర్చాను. అలా ఆవిర్భవించిందే ‘హర్గిల ఆర్మీ’.
చేనేత కళతో ఆర్థిక సాధికారత
ఈ కొంగలు పర్యావరణ సమతుల్యతను ఎలా కాపాడతాయో వారికి అర్థమయ్యేలా చెప్పాను. నా పిలుపుతో ప్రారంభమైన ఈ ఉద్యమం నేడు 20 వేల మందికిపైగా గ్రామీణ మహిళలతో ఒక భారీ పర్యావరణ సైన్యంగా మారింది. ఈ ఉద్యమాన్ని మహిళల ఆర్థిక సాధికారతతో ముడిపెట్టి, అస్సామీ సంప్రదాయ ‘గమోసా’ వస్త్రాలు, చీరలపై హర్గిల పక్షిబొమ్మల డిజైన్లు నేయడం వారికి నేర్పించాను. ఈ ఉత్పత్తులకు లభించిన ఆదరణతో వారికి సొంతంగా జీవనోపాధి లభించింది.
సహజ భాగస్వామ్యమే అసలైన శక్తి
వన్యప్రాణి సంరక్షణ అనేది ప్రభుత్వాలు లేదా శాస్త్రవేత్తల అధికారిక పత్రాల వల్ల మాత్రమే సాధ్యం కాదని నా ప్రయాణం నాకు నేర్పింది. స్థానిక సమాజానికి, ముఖ్యంగా మహిళలకు సరైన అవగాహన, గుర్తింపు ఇస్తే వారు ఎలాంటి అద్భుతాలనైనా సాధించగలరు. ఈ రోజు అస్సాంలో ప్రారంభమైన ‘హర్గిల ఆర్మీ’ మోడల్ ప్రపంచంలోనే అరుదైన పక్షులను కాపాడే ఒక ఆదర్శవంతమైన కమ్యూనిటీ పర్యావరణ నమూనాగా నిలిచింది. ఇతర దేశాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలకు ఇది ఒక దిక్సూచిలా ఉపయోగపడుతోంది.
శాశ్వత మార్పు వైపు అడుగులు
ఒకప్పుడు అసహ్యించుకున్న పక్షి.. ఈ రోజు అస్సాం సాంస్కృతిక ప్రతీకగా, మా జానపద గేయాలలో, చేనేత చీరలపై వెలుగుతుండటం నా జీవితానికి లభించిన అతిపెద్ద ప్రతిఫలం. శాస్త్రం కంటే సమాజాపు ప్రేమే ప్రకృతిని కాపాడుతుందని నిరూపించడమే నా అంతిమ విజయం. రాబోయే తరాలకు పచ్చని భూమిని అందించే వరకు ఈ హర్గిల అక్క ప్రయాణం ఆగదు’’

‘గ్రీన్ ఆస్కార్’ నుంచి ‘నారీ శక్తి’ వరకు
మేము చేసిన క్షేత్రస్థాయి ఉద్యమానికి దేశవిదేశాల నుంచి గుర్తింపు లభించింది. పర్యావరణ రంగంలో ఆస్కార్‌గా భావించే లండన్ ‘విట్లీ అవార్డు’ను 2017లో, దాని అత్యున్నత రూపమైన ‘విట్టీ గోల్డ్ అవార్డు’ను 2024లో సాధించాను. అలాగే భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ‘నారీశక్తి పురస్కార్’ అందుకున్నాను. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) అందజేసే అత్యున్నత పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ (2022)’ లభించడంతో మా ఉద్యమం అంతర్జాతీయ వేదికపై నిలిచింది. ప్రపంచ ప్రసిద్ధ ‘టైమ్’ మేగజైన్ ప్రకటించిన ‘విమెన్ ఆఫ్ ది ఇయర్ 2025’లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలిగా నిలిచాను. తాజాగా నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ, కియా సంయుక్తంగా ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘వేఫైండర్ 2026’కు ఎంపికైన 15 మంది గ్లోబల్ చేంజ్‌మేకర్లలో నేను ఒకరిగా నిలిచాను. ఈ గుర్తింపులన్నీ నా బాధ్యతను మరింత పెంచాయి.
అసహ్యం నుంచి ఆరాధన వైపు
ఏ పక్షినైతే అసహ్యించుకున్నారో.. అదే తమ ఇళ్లలో వెలుగులు నింపుతోందని గ్రహించిన గ్రామస్థుల దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు చెట్లను నరికిన ప్రజలు ఈ రోజు హర్గిల పక్షులకు ‘బేబీ షవర్’ (సీమంతం వేడుకలు) నిర్వహిస్తున్నారు. చెట్లపై నుంచి పడిన కొంగ పిల్లలను రక్షించడం, మొక్కలు నాటడం నా సైన్యం దైనందిన బాధ్యతగా మారింది. ఫలితంగా ఒకప్పుడు 28గా ఉన్న గూళ్ల సంఖ్య ఇప్పుడు వందల సంఖ్యకు పెరిగి, అస్సాం వాటి ప్రధాన సంతానోత్పత్తి కేంద్రంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా
రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు