పట్టుదల నేర్పిన పాఠం
ABN , Publish Date - Jun 08 , 2026 | 02:42 AM
ఎనిమిదో తరగతితోనే చదువు ఆగిపోయినా.. 54 ఏళ్ల వయసులో పట్టుదలతో శ్రమించి ప్రముఖ భారతీయ బ్రాండ్లకు జూట్ బ్యాగులు సరఫరా చేసే స్థాయికి ఎదిగారు...
ఎనిమిదో తరగతితోనే చదువు ఆగిపోయినా.. 54 ఏళ్ల వయసులో పట్టుదలతో శ్రమించి ప్రముఖ భారతీయ బ్రాండ్లకు జూట్ బ్యాగులు సరఫరా చేసే స్థాయికి ఎదిగారు పంజాబ్‌కు చెందిన చరణ్‌జీత్ కౌర్. పరిమిత వనరులతోనే అంతర్జాతీయ స్థాయి వ్యాపారాన్ని నిర్మించి వందలాదిమంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తున్న చరణ్‌జీత్ విజయగాధ.. ఆమె మాటల్లోనే..
జీవితంలో ఏదైనా సాధించడానికి వయసుతో కానీ, చదువుతో కానీ సంబంధం లేదని నేను బలంగా నమ్ముతాను. నా వయసు ఇప్పుడు 54 ఏళ్లు. పంజాబ్‌లోని లుధియానా సమీపంలో ఉన్న భగవాన్‌పురా మా గ్రామం. ఈ వయసులో చాలామంది విశ్రాంతి కోరుకుంటారు. కానీ నేను మాత్రం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి ఈ రోజు ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలబడగలిగాను. నేను చదువుకున్నది ఎనిమిదో తరగతి వరకే. కానీ నాకున్న నైపుణ్యాన్ని నమ్ముకుని ప్రారంభించిన జూట్ బ్యాగుల వ్యాపారం.. ఈ రోజు నన్ను దేశంలోని పెద్దపెద్ద కంపెనీలకు, అంతర్జాతీయ వినియోగదారులకు ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి తీసుకెళ్తుందని నేను అస్సలు ఊహించలేదు. జూట్ బ్యాగుల తయారీని నా జీవనోపాధిగా మార్చుకోవడమే కాకుండా, నాలాంటి ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఈ రోజు ఉపాధి అవకాశాలను కల్పించగలుగుతున్నాను.
కష్టాల నుంచి పుట్టిన ఆశయం
ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబంలో పుట్టడం వల్ల డబ్బు విలువ ఏంటో చిన్నప్పుడే అర్థమైంది. నాకు నేనుగా నిలబడటంతోపాటు కుటుంబానికి అండగా ఉండాలని అప్పుడే అనుకున్నాను. ఈ క్రమంలోనే జూట్ బ్యాగుల తయారీపై ఆసక్తి ఏర్పడింది. సమ్రాలాలోని ‘కృషి విజ్ఞాన కేంద్రం’ (కేవీకే) నిర్వహించే శిక్షణ కార్యక్రమాల గురించి తెలిసి వెంటనే అందులో చేరాను. ఆ శిక్షణ నాకు ఎంతో సాయపడింది. బ్యాగుల తయారీలో నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతోపాటు వ్యాపారం ఎలా చేయాలో కూడా అవగాహన పెంచుకున్నాను. ఈ రోజు ప్రముఖ కంపెనీలకు ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి చేరుకోగలిగాను.
చిన్న ఆర్డర్లతో మొదలు
శిక్షణ పూర్తయిన తర్వాత సొంతంగా బ్యాగులు తయారుచేయడం ప్రారంభించి.. చిన్నచిన్న ఆర్డర్లు తీసుకునేదానిని. నేను చేసే పనిలో నాణ్యత, సమయపాలన ఉండేలా చూసుకున్నాను. దీంతో వ్యాపారం క్రమంగా పెరిగింది. ఈ రోజు దేశంలోనే ప్రముఖ కంపెనీలైన టాటా, జాంటీ ఆగ్రో వంటి సంస్థలు నాకు ఆర్డర్లు ఇస్తున్నాయి. విదేశీ వినియోగదారులు కూడా నా జూట్ బ్యాగులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నేను తయారుచేసే బ్యాగులు చాలా మన్నికగా ఉండటం, పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉంటడమే ఇందుకు ప్రధాన కారణం.
గ్రామాన్ని దాటిన మహిళా సాధికారత
నా విజయం నా సొంత లాభానికే పరిమితం కాకూడదని అనుకుంటాను. తోటి మహిళలు కూడా పైకి రావాలనేదే నా కోరిక. చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళలకు, యువతులకు ఈ నైపుణ్యాన్ని నేర్పించాల్సిందిగా స్థానిక గ్రామ పంచాయతీలు నన్ను కోరుతున్నాయి. దీనిని ఒక బాధ్యతగా తీసుకుని, నేను స్వయంగా గ్రామాలకు వెళ్లి జూట్ బ్యాగుల తయారీలో వారికి శిక్షణ ఇస్తున్నాను. సొంతంగా వ్యాపారం చేయడం ఎంత సంతోషాన్ని ఇస్తుందో, తోటి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా సాయం చేయడం కూడా నాకు అంతే తృప్తిని ఇస్తుంది.

అన్ని వర్గాలకు అందుబాటులో..
నేను, నా బృందం కలిసి రకరకాల అవసరాలకు సరిపోయేలా విభిన్న పరిమాణాల్లో, ఆకృతుల్లో జూట్ బ్యాగులను తయారుచేస్తున్నాం. నిత్యం మార్కెట్‌కు వెళ్లేందుకు ఉపయోగించే సాధారణ బ్యాగుల ధరలు రూ. 45 నుంచి రూ. 100 వరకు ఉంటాయి. విదేశీ వినియోగదారుల కోసం వారి అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకమైన డిజైన్లతో బ్యాగులు తయారుచేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు, చదువు లేకపోవడం వంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఈ రోజు ఒక విజయవంతమైన వ్యాపారాన్ని స్థాపించగలిగానంటే దానికి కారణం నా నమ్మకమే. దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నేను నిరూపించగలిగాను. వందలాదిమంది మహిళలకు మార్గదర్శిగా, శిక్షకురాలిగా మారాను.
స్థిరమైన ఆదాయం
ఏ వ్యాపారం లోనైనా లాభనష్టాలు, హెచ్చుతగ్గులు సహజం. నా వ్యాపారంలో కూడా కొన్నిసార్లు ఆర్డర్లు తగ్గిన రోజులు ఉన్నాయి. అయినప్పటికీ నా వ్యాపారం సాధించిన మొత్తం వృద్ధి నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఈ వ్యాపారం ద్వారా ప్రస్తుతం నెలకు సగటున రూ. 50 వేల వరకు సంపాదిస్తున్నాను. ఈ ఆదాయం నా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా, స్థానిక మహిళలకు ఉపాధి కల్పించేలా చేసింది. ప్రస్తుతం డజను మంది మహిళలు నా వ్యాపారంలో భాగస్వాములై, కస్టమర్ల ఆర్డర్లను పూర్తిచేయడంలో నాకు తోడుగా నిలుస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News