Share News

అతడి కలలకు ఆకృతి

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:12 AM

టీమిండియా టీ-20 ప్రపంచక్‌పను ముచ్చటగా మూడోసారి ముద్దాడిన రోజే... డాషింగ్‌ ఓపెనర్‌గా పేరుపొందిన పృథ్వీషా నిశ్చితార్థం వార్త హల్‌చల్‌ చేసింది. తన చిరకాల ప్రేయసి ఆకృతి అగర్వాల్‌తో నిశ్చితార్థం...

అతడి కలలకు ఆకృతి

టీమిండియా టీ-20 ప్రపంచక్‌పను ముచ్చటగా మూడోసారి ముద్దాడిన రోజే... డాషింగ్‌ ఓపెనర్‌గా పేరుపొందిన పృథ్వీషా నిశ్చితార్థం వార్త హల్‌చల్‌ చేసింది. తన చిరకాల ప్రేయసి ఆకృతి అగర్వాల్‌తో నిశ్చితార్థం చేసుకుంటున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టిన పృధ్వీ... ‘ఆమె నా పర్‌ఫెక్ట్‌ ఇన్నింగ్‌’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. దాంతో ఆమె వివరాల కోసం నెట్టింట్లో జనం తెగ వెతికేస్తున్నారు.

ఆకృతి అగర్వాల్‌తో తన వివాహాన్ని పృథ్వీషా తాజాగా ధ్రువీకరించాడు కానీ... ఈ జంట చాలా ఏళ్ళుగా డేటింగ్‌లో ఉన్నారు. దూకుడైన బ్యాటింగ్‌తో సచిన్‌ టెండూల్కర్‌ వారసుడంటూ ఒకప్పుడు ప్రశంసలు పొందిన పృథ్వీ కొన్నాళ్ళుగా టీమిండియాకు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆకృతి కన్నా ముందు మోడల్‌ నిధి తపాడియాతో పృథ్వీ డేటింగ్‌ చేశాడు. ఆ తరువాత వారిద్దరి మధ్యా బ్రేకప్‌ అయింది. ఆ తరువాత ముంబయిలోని ఒక హోటల్‌ నుంచి ఒక అమ్మాయితో పృథ్వీ బయటకు వస్తున్న వీడియో బయటకు రావడంతో ఆమె ఎవరని అభిమానులు ఆరా తీశారు. ‘మిస్టరీ గర్ల్‌’ అనే ట్యాగ్‌ కూడా తగిలించారు. త్వరలోనే ఆమె ఆకృతి అగర్వాల్‌ అని నిర్ధారణ కావడంతో... వారి డేటింగ్‌ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. వారిద్దరూ తమ ప్రేమ గురించి అడపాదడపా సంకేతాలు కూడా ఇచ్చారు. పృథ్వీ ఆడుతున్నప్పుడు పలుసార్లు మైదానంలో కనిపించిన ఆకృతి... కిందటి ఏడాది వినాయకచవితి సందర్భంగా అతనితో ఉన్న ఫొటోను ‘మీట్‌ మై బాయ్‌ఫ్రెండ్‌’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో ఉంచింది. ఈ నెల 5న అర్జున్‌ టెండూల్కర్‌ పెళ్ళిలో కూడా వీరిద్దరూ జంటగా కనిపించారు. మూడు రోజులు తిరక్కుండానే నిశ్చితార్థం చేసుకొని సర్ర్పైజ్‌ ఇచ్చారు.

టిక్‌టాక్‌తో మొదలై...

ఫృథ్వీషా ప్రియురాలుగా అందరికీ తెలియడానికి ముందే... సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆకృతికి గుర్తింపు ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖనవూలో పుట్టి పెరిగింది. ఆ తరువాత ఆమె కుటుంబం ముంబయికి మారింది. బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌ స్టడీస్‌ పూర్తి చేశాక... డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా అవతరించింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌లో ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌, వినోదాత్మక అంశాలు ప్రధానంగా ఆమె పెట్టిన పోస్టులు, ప్రత్యేకించి లిప్‌-సింక్‌, షార్ట్‌ డ్యాన్స్‌ క్లిప్పింగ్‌లు వైరల్‌ అయ్యాయి. మొదట్లో టిక్‌టాక్‌ ఆమెకు పాపులారిటీ తెచ్చింది. అయితే దాన్ని మన దేశంలో నిషేధించడంతో... ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లకు మారింది. అక్కడ కూడా వీక్షకుల హృదయాల్ని ఆమె దోచుకుంది. 2021లో ‘బత్తీ గుల్‌’ అనే మ్యూజిక్‌ వీడియో విడుదల చేసింది. అది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తరువాత ‘ఛోటీ సర్దార్నీ’ టీవీ సిరీ్‌సలో మెరిసింది. 2022లో ‘మోస్ట్‌ ప్రామెసింగ్‌ ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లుయన్సర్‌’ అవార్డు అందుకుంది.


తొలి సినిమా తెలుగులోనే...

ప్రస్తుతం ఆకృతికి ఇన్‌స్టాలో 34 లక్షలమందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. షార్ట్‌వీడియోల ద్వారా పాపులర్‌ అయిన ఆమె దృష్టి ప్రస్తుతం వెండి తెరమీద ఉంది. ఆమె నటించిన తొలి చిత్రం ‘త్రిముఖ’... తెలుగు సినిమా కావడం విశేషం. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో మంచి సంస్థ ద్వారా అరంగేట్రం చేయాలని ఆకృతి ఆశిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.

బ్రాండ్‌ కొలాబరేషన్స్‌, మ్యూజిక్‌ వీడియోలు, ఫ్యాషన్‌ ఈవెంట్స్‌ ద్వారా ఆదాయం పొందుతున్న 22 ఏళ్ళ ఆకృతికి నృత్యం, సంగీతం అంటే ప్రాణం. కొత్త ప్రదేశాల్ని చుట్టి రావడం ఎంతో ఇష్టం. అటు సంప్రదాయ దుస్తులకు, ఇటు వెస్ట్రన్‌ అవుట్‌ఫిట్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తుంది.

తన కుటుంబ వివరాలను వెల్లడించడానికి అంతగా ఇష్టపడదు. కొత్త ప్రదేశానికి వెళ్తే... వాటికి సంబంధించిన దృశ్యాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇప్పుడు పృథ్వీషాకు కాబోయే భార్యగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది.

ఇవి కూడా చదవండి..

నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

డ్రోన్ల తయారీ వ్యాపారంలో ట్రంప్ తనయుల పెట్టుబడులు

Updated Date - Mar 11 , 2026 | 03:12 AM