శిరోజాలు నెరుస్తున్నాయా..?
ABN , Publish Date - Mar 23 , 2026 | 01:49 AM
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, వాతావరణ కాలుష్యం తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే శిరోజాలు...
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, వాతావరణ కాలుష్యం తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే శిరోజాలు నెరుస్తూ తీవ్రమైన మానసిక ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. వాటి గురించి తెలుసుకుందాం...
శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరగాలంటే వాటికి సరైన పోషణ అవసరం. బీ 12, ఐరన్, జింక్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు అధికంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, కోడిగుడ్లు, చికెన్, ఆకుకూరలు, తాజా కూరగాయలు, సీజనల్‌గా లభించే పండ్లు, పాల పదార్థాలు, డ్రైఫ్రూట్స్‌ను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. రోజుకు కనీసం అయిదారు గ్లాసుల మంచినీళ్లు తాగాలి.
తరచూ గోరువెచ్చని నూనెతో తలకు మర్దన చేస్తూ ఉంటే కుదుళ్లకు రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో చక్కని పోషణ అంది కుదుళ్లు గట్టిపడడమే కాదు శిరోజాలకు అవసరమైన మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. కొబ్బరి, బాదం, ఉసిరి, కరివేపాకు, మందారం నూనెలు... శిరోజాలు నల్లగా పెరగడానికి దోహదం చేస్తాయి.
వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. దీంతో దుమ్ము, ధూళి, జిడ్డు తొలగి కుదుళ్లకు చక్కగా ఆక్సిజన్ అందుతుంది. రసాయనాలతో కూడిన గాఢమైన షాంపూలు కాకుండా తేలికపాటి షాంపూలు ఉపయోగిస్తే శిరోజాలు నెరవడం తగ్గుతుంది. సాధ్యమైనంతవరకు ఆర్గానిక్ షాంపూలు, కండిషనర్లు, డైలు వాడడం మంచిది.
ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేమి.. శిరోజాలకు హాని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతకోసం యోగ, ధ్యానం, తేలికపాటి వ్యాయామం అలవాటు చేసుకోవాలి. రోజుకు ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి. అప్పుడే జీవక్రియలు సజావుగా జరిగి శిరోజాల సమస్యలు తీరుతాయి.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప