ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:42 PM
సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పని చేసి అరుదైన రికార్డు సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
న్యూఢిల్లీ, మార్చి 22: భారత ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పని చేసిన వ్యక్తిగా అరుదైన రికార్డ్ సాధించిన సంగతి తెలిసిందే. ఎలాంటి విరామం లేకుండా 8,931 రోజుల పాటు ప్రభుత్వాధిపతిగా పని చేసి మోదీ ఈ రికార్డును సాధించారు. సిక్కీం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును ప్రధాని మోదీ అధిగమించారు. పవన్ కుమార్ 8,930 రోజుల పాటు సిక్కీం ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రధాని మోదీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోదాలలో 8,931 రోజుల పాటు ప్రభుత్వాధిపతిగా పని చేశారు.
ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు..
సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పని చేసి అరుదైన రికార్డు సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ప్రభుత్వాధిపతిగా 8,931 రోజులు దేశానికి సేవలందించి, సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పని చేసిన వ్యక్తిగా అరుదైన రికార్డును నెలకొల్పిన ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు‘..
‘ఈ అసాధారణ విజయం మన దేశ పురోగతి, శ్రేయస్సు పట్ల ఆయనకున్న అంకితభావం, దార్శనిక నాయకత్వం, అవిశ్రాంత కృషిని ప్రతిబింబిస్తుంది. 2047 నాటికి 'వికసిత్ భారత్' సాకారం చేయాలనే ఆయన సంకల్పం మనందరికీ స్ఫూర్తినిస్తూ, భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తోంది. దేశాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే క్రమంలో ఆయనకు ఆయురారోగ్యాలు, శక్తి, విజయం లభించాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప
డీఎంకేకు షాక్.. కూటమి నుంచి వైదొలిగిన తమిళగ వాళ్వూరియా కట్చి