Share News

గర్భిణుల్లో కాళ్ల వాపుల ముప్పు

ABN , Publish Date - Mar 10 , 2026 | 02:40 AM

గర్భిణుల్లో కాళ్ల వాపులు సహజమని సరిపెట్టుకుంటూ ఉంటాం. కానీ అది ‘డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌’ సమస్య కావచ్చు. రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడే...

గర్భిణుల్లో కాళ్ల వాపుల ముప్పు

డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌

గర్భిణుల్లో కాళ్ల వాపులు సహజమని సరిపెట్టుకుంటూ ఉంటాం. కానీ అది ‘డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌’ సమస్య కావచ్చు. రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడే సమస్యను ముందస్తుగానే గుర్తించి, నివారించుకోవాలి. లేదంటే ఈ సమస్య ప్రాణాంతక ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు

గర్భిణుల్లో సహజంగానే కాళ్ల వాపులు కనిపిస్తూ ఉంటాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులతో ఈ లక్షణం తలెత్తడం సర్వసాధారణం. అయితే గర్భిణుల్లో ఇదే లక్షణంతో బయల్పడే మరొక తీవ్రమైన సమస్య ‘డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌’. ఈ సమస్య గర్భిణుల్లోనే తలెత్తడానికి పలు కారణాలున్నాయి. సాధారణంగా కాళ్లలోని రక్తనాళాల ద్వారా రక్తం గుండెకు ప్రవహిస్తూ ఉంటుంది. కానీ గర్భిణుల్లో రక్త ప్రవాహం మందగించి, గడ్డలు కడుతుంది. ప్రసవ సమయంలో రక్తస్రావం తీవ్రమవకుండా ఉండడం కోసం సహజసిద్ధంగా గర్భిణుల్లో కొంతమేరకు రక్తం చిక్కబడడమే దీనికి ప్రధాన కారణం. ఈ పరిస్థితికి తోడు గర్భసంచి పెద్దదయ్యేకొద్దీ కాళ్లలోని రక్తనాళాలు ఒత్తుకుపోయి రక్తప్రసరణకు ఆంటంకం ఏర్పడి డివిటి సమస్య తలెత్తుతుంది. వీటికి తోడు డివిటికి దారితీసే మరికొన్ని కారణాలు ఏవంటే....

  • సిజేరియన్‌ తర్వాత తీసుకునే విశ్రాంతి వల్ల లేదా ప్రసవానంతరం బరువు పెరగడం వల్ల డివిటి సమస్య తలెత్తవచ్చు

  • గర్భనిరోధక మాత్రలు, నెలసరిని వాయిదా వేసే మాత్రల వాడకం వల్ల

  • ఐవిఎ్‌ఫతో గర్భధారణ జరిగిన సందర్భాల్లో...

  • 35 ఏళ్లు దాటిన వాళ్లలో...

  • బిఎమ్‌ఐ 30 మించిన మహిళల్లో...

  • మూడుకు మించి ప్రసవాలు జరిగిన మహిళల్లో...

  • వేవిళ్ల సమయంలో...


లక్షణాల మీద కన్నేసి...

డీప్‌ వెయిన్‌ థ్రాంబోసి్‌సను గుర్తించడం సులభమే! ఈ సమస్య గర్భిణుల్లో ఏ నెలలోనైనా తలెత్తవచ్చు. అయితే చివరి మూడు నెలల్లో ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రసవానంతరం ఆరు వారాల వరకూ కూడా ఈ ముప్పు ఉంటుంది. గర్భిణుల్లో సాధారణంగా రెండు కాళ్లూ వాస్తూ ఉంటాయి. కానీ డివిటిలో కేవలం ఒక కాల్లో మాత్రమే వాపు కనిపిస్తుంది. అలాగే నొప్పి కూడా ఉంటుంది. ఆయాసం కూడా వేధిస్తుంది. అలాగే కాలు వెచ్చగా ఉంటుంది. ఈ లక్షణాలు అందర్లో ఉండాలనే నియమమేమీ లేదు. అరుదుగా కొందర్లో ఇలాంటి లక్షణాలేవీ లేకుండా డివిటి తలెత్తవచ్చు. కాబట్టి ఈ సమస్య పట్ల మహిళలందరూ అవగాహన పెంచుకోవడం అవసరం. డివిటి తలెత్తే వీలున్న అవకాశాలను అంచనా వేయడం ద్వారా ముందస్తుగానే ఈ సమస్యను నివారించుకోవచ్చు.

నివారణ సాధ్యమే!

అత్యంత సులభంగా నివారించుకోగలిగిన సమస్య ఇది. కాబట్టి రిస్క్‌ అసె్‌సమెంట్‌ ద్వారా డివిటి ముప్పును గుర్తించి మందులు, ఇంజెక్షన్లతో డివిటికి అడ్డుకట్ట వేయొచ్చు. డివిటికి ప్రధాన కారణం కాళ్లలో రక్తప్రసరణ ఆగిపోయి, రక్తం నిల్వ ఉండిపోవడం. కాబట్టి ఎక్కువసేపు కూర్చునే, పడుకునే భంగిమలు తగ్గించుకోవాలి. కాళ్లను కదిలించడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం అవసరం. అలాగే కాళ్లకు డివిటి సాక్సులు వేసుకోవాలి. ఈ రెండు ముందు జాగ్రత్తలతో తక్కువ ముప్పున్న మహిళలకు డివిటి నుంచి రక్షణ కల్పించవచ్చు. ఒకసారి డివిటికి గురైన వాళ్లు, కుటుంబంలో ఈ సమస్య ఉన్న మహిళలు, డివిటికి గురయ్యే అవకశాలు ఎక్కువగా ఉన్న మహిళలకు ‘లో మాలిక్యులర్‌ వెయిట్‌ హెపారిన్‌’ ఇంజెక్షన్లను తక్కువ మోతాదులో ఇవ్వవలసి ఉంటుంది. గర్భం దాల్చిన వెంటనే డివిటి ముప్పును అంచనా వేసి, దాని ఆధారంగా వైద్యులు ఈ ఇంజెక్షన్ల మోతాదును లెక్కిస్తారు. వీటిని గర్భంతో ఉన్నంతకాలం తీసుకోవాల్సి ఉంటుంది. ముప్పు ఎక్కువగా ఉన్న గర్భిణులు గర్భం దాల్చిన మొదటి రోజు నుంచీ ప్రసవం తర్వాత ఆరు వారాల వరకూ ఈ ఇంజెక్షన్లను తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ముప్పు ఉన్న మహిళలు, ఇతరత్రా జాగ్రత్తలు పాటిస్తూ, గర్భం చివరి మూడు నెలల వరకూ లేదా, ప్రసవం తర్వాత ఆరు నెలల వరకూ వాడుకోవలసి ఉంటుంది.


3-Navya.jpg

డివిటిని నిర్లక్ష్యం చేస్తే?

కాల్లో ఏర్పడిన రక్తపు గడ్డలు రక్తప్రవాహం ద్వారా ఊపిరితిత్తులకు చేరుకున్నప్పుడు పల్మొనరీ ఎంబాలిజం సమస్య తలెత్తుతుంది. ఇది ప్రాణాంతక సమస్య. గడ్డ పరిమాణం మీదే ముప్పు తీవ్రత ఆధారపడి ఉంటుంది. పెద్ద రక్తపు గడ్డ ప్రాణాంతక సమస్యను తెచ్చిపెట్టవచ్చు. ఒకవేళ చిన్న రక్తపు గడ్డలు ఊపిరితిత్తుల్లోకి చేరితే, పల్మొనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్‌ సమస్య తలెత్తుతుంది. అలాగే కాళ్లలో రక్తం గడ్డకట్టి, కరగకుండా ఉండిపోవడం వల్ల, ఈ పరిస్థితి క్రమేపీ వెరికోజ్‌ వెయిన్స్‌కూ పోస్ట్‌ థ్రాంబోటిక్‌ సిండ్రోమ్‌కూ సమస్యకు దారి తీస్తుంది. ఈ సమస్యలో కాలు నల్లబడి, పుండ్లు ఏర్పడతాయి.

బస్‌ ప్రయాణాలతో...

గర్భనిరోధక మాత్రలు, నెలసరి వాయిదా మాత్రలు వాడుకుంటూ ఎక్కువ గంటల పాటు బస్సు ప్రయాణాలు చేసే మహిళల్లో కూడా డివిటి సమస్య తలెత్తే అవకాశాలుంటాయి. ఈ ప్రయాణాల్లో గంటల తరబడి, కాళ్లు వేలాడేసి కదలకుండా కూర్చోడంతో పాటు రాత్రివేళ టాయ్‌లెట్‌కు వెళ్లవలసి వస్తుందనే భయంతో రాత్రి ప్రయాణాల్లో నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోరు. ఈ కారణాలన్నీ డివిటి ముప్పును మరింత పెంచుతాయి.

ఈ మాత్రలు వాడుకునేటప్పుడు...

సొంత వైద్యంలో భాగంగా కొందరు మహిళలు నచ్చిన గర్భనిరోధక మాత్రలను వాడుతూ ఉంటారు. అలాగే ఇంకొందరు నెలసరిని వాయిదా వేసే మాత్రలను వాడుకుంటూ ఉంటారు. అయితే ఆయా సమయాల్లో అదనంగా పూజల్లో భాగంగా ఎక్కువ సమయం పాటు కదలకుండా కూర్చోవడం లేదా ఉపవాసాలు ఉండడం లాంటివి కూడా తోడైతే డివిటి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఈ మందులను ఎవరికి వారు స్వయంగా కొనుక్కుని వాడేస్తూ ఉంటారు. కానీ వైద్యులను కలిసి డివిటి ముప్పును అంచనా వేసుకుని, ఆ తర్వాతే ఈ మందులను వాడుకోవడం ఉత్తమం. ముప్పు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో వైద్యులు సూచించిన పిల్స్‌ వాడుకుంటూ, అదే సమయంలో డివిటి నివారణకు తోడ్పడే ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. ఈ నివారణ చర్యలను పాటించడంతో పాటు గర్భనిరోధక మాత్రలు, నెలసరిని వాయిదా వేసే మాత్రలు వాడుకుంటున్నప్పుడు, డివిటి లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచి, లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తమవ్వాలి.


2-Navya.jpg

అపోహలు - వాస్తవాలు

అపోహ: గర్భిణుల్లో కాళ్ల వాపులు సహజం

వాస్తవం: గర్భిణుల్లో ఒక కాలు వాపును నిర్లక్ష్యం చేయకూడదు. ఇది డివిటి కావచ్చు

అపోహ: గర్భిణులు, సిజేరియన్‌ సర్జరీ చేయించుకున్న మహిళలు విశ్రాంతిలో గడపాలి

వాస్తవం: ప్రసవానంతరం వీలైనంత చురుగ్గా ఉండాలి. సిజేరియన్‌ తర్వాత కూడా సాధ్యమైనంత త్వరగా తిరిగి సాధారణ జీవితాన్ని కొనసాగించాలి

అపోహ: వృద్ధులకే డివిటి ముప్పు ఎక్కువ

వాస్తవం: ఏ వయసు వాళ్లకైనా రావచ్చు

అపోహ: విశ్రాంత స్థితిలో గడిపేవాళ్లకే ముప్పు ఎక్కువ

వాస్తవం: చురుగ్గా ఉండేవాళ్లలో కూడా డివిటి ముప్పు ఉంటుంది

అపోహ: ఊబకాయుల్లోనే డివిటి ముప్పు ఎక్కువ

వాస్తవం: బరువు తక్కువగా ఉండేవాళ్లకు కూడా ముప్పు ఉంటుంది

డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌ అత్తూరు

సీనియర్‌ కన్సల్టెంట్‌ వ్యాస్క్యులర్‌ అండ్‌ ఎండోవాస్క్యులర్‌ సర్జన్‌,

మెడికవర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి:

ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

Updated Date - Mar 10 , 2026 | 02:41 AM