Share News

ప్రకృతి పాఠాలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:35 AM

మనం తినే ఆహారం ఎక్కడినుంచి వస్తోంది? ఏ సీజన్లో ఏ పంటలు పండుతాయి? మనల్ని బతికిస్తున్న నేల తల్లికి మనం ఎలా రుణపడి ఉండాలి?...

ప్రకృతి పాఠాలు

మనం తినే ఆహారం ఎక్కడినుంచి వస్తోంది? ఏ సీజన్లో ఏ పంటలు పండుతాయి? మనల్ని బతికిస్తున్న నేల తల్లికి మనం ఎలా రుణపడి ఉండాలి?... ప్రతి ఒక్కరూ తప్పనిసరిగాతెలుసుకోవాల్సిన ఈ విషయాల గురించి పట్టణాలు, నగరాల్లోని ఈ తరం పిల్లలకు కనీస అవగాహన లేకపోవడం ప్రగతి ఛస్వాల్‌ను కలవరపరచింది. తన బిడ్డ కోసం ఆమె ఆరంభించిన చిన్న ప్రయత్నం... ఒక ఉద్యమంగా మారింది. 74 వేల మందికి పైగా పిల్లలను ప్రకృతితో అనుసంధానం చేసింది. ఆ కథేమిటంటే...

‘‘అమ్మా! చిప్స్‌ ఎక్కడ్నించి వస్తాయి?... మా అబ్బాయి నీల్‌ అడిగిన ఈ ప్రశ్న పదేళ్ళ క్రితం నేను తీవ్రంగా ఆలోచించేలా చేసింది. పాఠశాలల్లో చెప్పని విషయాల మీద నా బిడ్డకు అవగాహన కల్పించడం తల్లిగా నా బాధ్యత. అందుకే మా పెరట్లోనే బంగాళాదుంపల పెంపకం చేపట్టాను. విత్తనాలు నాటడం దగ్గర నుంచి దుంపలను బయటకు తీసేవరకూ ప్రతి దశలోనూ మా అబ్బాయి ప్రమేయం ఉండేలా చూశాను. వాడిలో ఆసక్తి బాగా పెరిగింది. రోజూ మొక్కల ఎదుగుదల ఎలా ఉందో ఆరా తీసేవాడు. కొన్నాళ్ళకు దుంపలను బయటకు తీసి... వాటితో చిప్స్‌ తయారు చేసి పెట్టినప్పుడు... వాడి ఆనందానికి అవధులు లేవు. అప్పటినుంచి ఇంట్లో రకరకాల కూరగాయల్ని పెంచాలనే ఉత్సాహం వాడికి ఎక్కువయింది. ఇద్దరం కలిసి మా గార్డెన్‌, బాల్కనీ, టెర్రస్‌... ఇలా వీలున్న ప్రతి చోటా... పండ్లు, పూలు, కూరగాయలు... ఇలా 35కు పైగా రకాల మొక్కలను పెంచాం.


రైతుల కష్టం తెలియాలని...

నేను పుట్టింది, పెరిగింది ఢిల్లీ నగరంలో. పదేళ్ళకు పైగా అడ్వర్టయిజింగ్‌ రంగంలో... ప్రసిద్ధ ఏజెన్సీలతో కలిసి పని చేశాను. ఆదాయపరంగా ఎలాంటి లోటూ లేదు. కానీ ఒత్తిడి తీవ్రంగా ఉండేది. కుటుంబాన్ని, వృత్తిని సమన్వయం చేసుకోవడం కష్టంగా అనిపించేది. అందుకే ఒక స్టార్టప్‌ ఆరంభించాను. ఫ్రీలాన్సర్‌గానూ సేవలు అందించడం మొదలుపెట్టాను. అదే సమయంలో మొక్కల పెంపకం మీద మక్కువ పెరిగింది. మరింత అవగాహన పెంచుకోవడం కోసం ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నూ)లో... సేంద్రియ వ్యవసాయంలో డిప్లమా చేశాను. పర్యావరణం, పోషకాహారం, ఆరోగ్యం... వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. పిల్లలకు వాటి గురించి చెబుతూ ఉంటాం. కానీ వీటన్నిటికీ మూలాధారమైన భూమాతకు పిల్లల్ని పూర్తిగా దూరం చేస్తున్నాం. రైతుల కష్టం వారికి తెలియదు. ఒక ధాన్యం గింజను పండించడం వెనుక ఎంత శ్రమ ఉంటుందో... నేల, నీరు, సూర్యరశ్మి దానికి ఎలా దోహదం చేస్తాయో వారికి చెప్పేవారు లేరు. అలాగే పిల్లలు ఆహారాన్ని ఎక్కువగా వృథా చేయడం కూడా గమనించాను. మా అబ్బాయి పండించడంలో కష్టాన్ని చూశాడు కాబట్టి... ఆహారాన్ని వృథా చేయకూడదని కూడా గ్రహించాడు. పిల్లలందరికీ ఆ అనుభవం, అవగాహన కలిగించాలనుకున్నాను. కొన్ని పాఠశాలలను సంప్రదించాను. వారు సుముఖత చూపడంతో... 2017లో ‘సో’గుడ్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థను స్థాపించాను. ఔత్సాహికులైన మిత్రులు నాతో చేతులు కలిపారు.


22-Navya.jpg

ఉపాధ్యాయులకు కూడా...

ఢిల్లీలో మా అబ్బాయి చదువుతున్న పాఠశాలకు అనుబంధంగా చిన్న వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేయడంతో మా కార్యకలాపాలు మొదలయ్యాయి. పిల్లలు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. వారి తల్లిదండ్రులు కూడా వచ్చి, నా ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, ప్రోత్సహించారు. ఈ తొమ్మిదేళ్ళ కాలంలో మా సంస్థ ఢిల్లీ/ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సిఆర్‌) పరిధిలోని పాఠశాలల్లో 74 వేల మందికి పైగా పిల్లలకు మొక్కల పెంపకం, వ్యవసాయ పనులను నేర్పించడమే కాదు... ఆహర భద్రత గురించి, ప్రకృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన కల్పించింది. దీనికోసం 28కి పైగా పాఠశాలల్లో వ్యవసాయ క్షేత్రాలను రూపొందించాం.

ప్రతి వారం కనీసం అయిదువేల మంది విద్యార్థులు మా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయులకు వ్యవసాయ అంశాలపై శిక్షణ ఇవ్వడానికి యాభైకి పైగా వర్క్‌ షాపులు నిర్వహించాం. కంపోస్ట్‌ తయారీ, వ్యర్థాల రీసైక్లింగ్‌ లాంటివి కూడా పిల్లలకు నేర్పిస్తున్నాం. ఇవన్నీ ఉచితంగానే... మనం తింటున్న ఆహారం ఎక్కడినుంచి వస్తుంది? ఏ ఆహారం దేనితో తయారవుతుంది? దానికి నీరు లాంటి విలువైన వనరులు, రైతుల శ్రమ ఎంత ఖర్చవుతుంది?... ఇలా ఎన్నో విషయాలు పిల్లలు నేర్చుకోవడం వల్ల... రాబోయే కాలంలో వారు ప్రకృతి పట్ల మరింత బాధ్యతగా, రైతుల పట్ల మరింత గౌరవంగా ఉంటారని నా విశ్వాసం. వచ్చే మూడేళ్ళలో మూడు లక్షల మంది పిల్లలకు చేరువకావాలనేది నా లక్ష్యం.’’

ఇవి కూడా చదవండి..

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత

Updated Date - Apr 01 , 2026 | 01:35 AM