తనను తాను గెలిచి.. స్ఫూర్తిగా నిలిచి
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:22 AM
ఒక పుల్లప్ కూడా తీయలేని స్థాయి నుంచి.. ఆసియాలోనే నంబర్ వన్ స్ట్రీట్‌లిఫ్టర్‌గా ఎదిగిన ప్రభ్‌లీన్ కౌర్‌గిల్ ప్రయాణం ఒక అద్భుత ఘట్టం. మద్యం అలవాటు, మానసిక సంఘర్షణలను జయించి....
విజేత
ఒక పుల్లప్ కూడా తీయలేని స్థాయి నుంచి.. ఆసియాలోనే నంబర్ వన్ స్ట్రీట్‌లిఫ్టర్‌గా ఎదిగిన ప్రభ్‌లీన్ కౌర్‌గిల్ ప్రయాణం ఒక అద్భుత ఘట్టం. మద్యం అలవాటు, మానసిక సంఘర్షణలను జయించి.. తీవ్రమైన శారీరక గాయాలను అధిగమిస్తూ.. నవంబర్‌లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు సమర సన్నాహం చేస్తోంది. పరిమితులను చెరిపేసి.. బలమైన శరీరం కంటే బలాన్ని అనుభవించే మనస్తత్వం గొప్పదని చాటిచెబుతున్న ఈ పంజాబీ ముద్దుబిడ్డ స్ఫూర్తిదాయక కథనం ఇది.
నా చిన్నతనమంతా పంజాబ్‌లోని జలంధర్‌లో సాగింది. అమ్మవెంట తిరిగే అమాయకమైన అమ్మాయిని నేను. చిన్నప్పుడే ఈత నేర్చుకోవడం వల్ల క్రీడల్లో ఉండే క్రమశిక్షణ.. నిబద్ధత నాకు వంటబట్టాయి. నాకు 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మా కుటుంబం ముంబైకి మారింది. ఆ తర్వాత మా అన్నయ్య హైదరాబాద్‌లోని ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటుంటే, నేను కూడా అతడి వెంట హైదరాబాద్ వచ్చేశాను. నా జీవితం ఇక్కడే ఒక పెద్ద మలుపు తిరిగింది. తల్లిదండ్రులకు దూరంగా, కొత్త వాతావరణంలో నా సమస్యలను నేనే పరిష్కరించుకోవడం, కొత్త స్నేహితులను సంపాదించుకోవడం నేర్చుకున్నాను. ఈ క్రమంలోనే నాలో ఒక స్వతంత్ర ఆలోచనా ధోరణి పెరిగింది. 12వ తరగతి పూర్తయ్యాక మళ్లీ ముంబై వెళ్లాను. మోడలింగ్, మేకప్ రంగాల్లోకి వెళ్లాలని ప్రయత్నించినా అవేవీ ఫలితాన్ని ఇవ్వలేదు.
జీవితాన్ని మార్చిన ఆ ఒక్క రాత్రి
2017-18 ప్రాంతంలో జీవితంలో ఏం చేయాలో తోచని పరిస్థితి. నా అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ప్రారంభించాను. సద్గురు రాసిన ‘ఇన్నర్ ఇంనీరింగ్’ నా ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే, మానసికంగా మార్పు కోసం ప్రయత్నిస్తున్న నేను.. శారీరక ఆరోగ్యాన్ని ఘోరంగా నిర్లక్ష్యం చేశాను. మద్యానికి బానిసనై నా శరీరాన్ని నేనే నాశనం చేసుకునేదాన్ని. ఒక రోజు రాత్రి ఎంతగా తాగానంటే.. మా అమ్మ వచ్చి నా దుస్తులు మార్చాల్సి వచ్చింది. అప్పుడు నా వయసు 18 ఏళ్లు. ఆ సంఘటన నా కళ్లు తెరిపించింది. పుస్తకాల్లో మార్పు గురించి చదవడం కాదు, ముందు నా ప్రవర్తన మారాలని అనుకున్నాను. ఇక ఆ రోజు నుంచి వర్కవుట్స్ చేయడం మొదలుపెట్టాను. ‘ఏదో ఒక రకంగా ప్రతిరోజు వ్యాయామానికి హాజరు కావాలి’ అని నాకు నేనే చిన్న ప్రమాణం చేసుకున్నాను.
జీవితాన్ని మలుపు తిప్పిన ‘కాలిస్టెనిక్స్’
నా స్నేహితుడొకరు నన్ను ‘కాలిస్టెనిక్స్’ (శరీర బరువుతో చేసే వ్యాయామాలు)కు పరిచయం చేశాక నా జీవితం మొత్తం మారిపోయింది. మొదట్లో ఒక్క పుల్లప్ కూడా తీయలేని నేను, ఆరు నెలల కఠిన సాధనతో వరుసగా పది పుల్లప్స్ తీసే స్థాయికి చేరుకొని నా తొలి పోటీలోనే రెండో స్థానంలో నిలిచాను. ఆ తర్వాత ‘స్ట్రీట్‌లిఫ్టింగ్’ వైపు అడుగులేశాను. ఇది పవర్ లిఫ్టింగ్‌లానే ఉంటుంది. కాకపోతే అదనపు బరువులను శరీరానికి కట్టుకుని పుల్లప్స్, డిప్స్, స్క్వాట్స్ చేయాల్సి ఉంటుంది. 13.75 కిలోల అదనపు బరువుతో నేను చేసిన ‘మజిల్ అప్’ జాతీయ రికార్డుగా నిలిచింది. అంతేకాకుండా 37.5 కిలోల బరువుతో ‘చిన్ అప్’, 65 కిలోలతో ‘డిప్స్’, 115 కిలోలతో స్క్వాట్స్ చేస్తూ ఆసియాలోనే నంబర్-1 ర్యాంకర్‌గా నిలిచాను. సింగపూర్ ఓపెన్, ఫిలిప్పీన్స్ ఓపెన్‌లలో స్వర్ణాలు సాధించి, నవంబర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాను.

‘మాంబా’ మానసిక సూత్రం
నా ఈ ప్రయాణం పూలబాట కాదు. నేను నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నానని అనుకునే లోపే.. కాలం నన్ను నాలుగు అడుగులు వెనక్కి నెట్టేసింది. 2024లో నా మడమకు తీవ్ర గాయమై సర్జరీ జరిగింది. కాలులో ఒక ప్లేటు, మూడు స్ర్కూలు వేశారు. రెండుమూడు నెలలు వర్కవుట్ చేయలేకపోయాను. ఒక అథ్లెట్‌గా మానసికంగా, శారీరకంగా ఇది తీవ్రమైన దెబ్బ. కానీ ప్రసిద్ధ బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రయాంట్ చెప్పే ‘మాంబా మెంటాలిటీ’ని నేను నమ్ముతాను. 365 రోజులు పడే కష్టమే నిన్ను వేదికపై నిలబెడుతుంది. పతకం సాధించడం ఒక్కటే గమ్యం కాదు, ఆ ప్రయాణంలో ఎదురయ్యే ఓటములను తట్టుకుని నిలబడటమే అసలైన విజయం.
డిజిటల్ డైరీలా..
నేనేమీ పెద్ద ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కావాలని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరవలేదు. నా మార్పును నమోదు చేసుకునే ఒక ‘డిజిటల్ డైరీ’లాగే దానిని ఉపయోగించాను. కానీ ఈనాడు నన్ను 2 లక్షల మందికిపైగా అనుసరిస్తున్నారు. నా వీడియోలు చూసి తమ జీవితంలో తొలిసారి పుల్లప్ లేదా ఫుషప్ తీశామని అమ్మాయిలు మెసేజ్ చేస్తుంటే నాకు ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. మహిళలు తాము శారీరకంగా ఎలా కనిపిస్తున్నామనేదానికంటే లోపలి నుంచి ఎంత బలంగా అనిపిస్తున్నామనేదానిపై దృష్టిపెట్టాలి.
నా కల.. నా భవిష్యత్తు
మన దేశంలో కాలిస్టెనిక్స్ గురించి ఇంకా చాలామందికి సరైన అవగాహన లేదు. ఇది చాలా కష్టమైన క్రీడ అని భావిస్తుంటారు. కానీ అందరూ సున్నా నుంచే ప్రారంభిస్తారు. రాబోయే ఐదేళ్ల కాలంలో నా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ప్రపంచ చాంపియన్‌షి్‌పలో స్వర్ణం సాధించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను ఒక తాటిపైకి తెచ్చి ఒక పెద్ద ఫిట్‌నెస్ కమ్యూనిటీని నిర్మించాలనుకుంటున్నాను. మహిళలకు శారీరక, మానసిక బలాన్ని అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే నా నిజమైన ఆశయం.
ఈ వార్తలూ చదవండి
పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్
క్షణాల్లో ఘోరం.. 100 మీటర్ల లోయలో పడ్డ కారు!