న్యుమోనియా నలతకు దూరంగా..
ABN , Publish Date - Aug 18 , 2026 | 04:58 AM
ఊపిరితిత్తులను దెబ్బతీసే ప్రధాన రుగ్మతల్లో న్యుమోనియా ఒకటి. ఈ రుగ్మత వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ సరైన అవగాహన, వ్యాధి నిర్థారణ, వైద్య చికిత్స,...
లంగ్ కేర్
ఊపిరితిత్తులను దెబ్బతీసే ప్రధాన రుగ్మతల్లో న్యుమోనియా ఒకటి. ఈ రుగ్మత వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ సరైన అవగాహన, వ్యాధి నిర్థారణ, వైద్య చికిత్స, వ్యాక్సీన్‌తో ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చని అంటున్నారు వైద్యులు.
ప్రతి దగ్గునూ, జ్వరాన్నీ ఇంటి పట్టునే నయం చేసుకోవచ్చనే అపోహ సర్వత్రా నాటుకుని ఉంది. మరీ ముఖ్యంగా చాలా మంది న్యుమోనియాను సాధారణ ఛాతీ ఇన్‌ఫెక్షన్‌గా పొరబడుతూ, స్వయంగా యాంటిబయాటిక్స్ వాడుకుంటూ ఉండిపోతారు. ఈ అలవాటు
దీర్ఘకాలంలో, ఇన్‌ఫెక్షన్ తీవ్రతకూ, కొన్ని సందర్భాల్లో శ్వాసకోస వైఫల్యానికీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చికిత్సకూ, అంతిమంగా మరణానికీ దారి తీస్తుంది. ఆధునిక వైద్యం న్యుమోనియా నిర్వహణను మరింత సులభతరం చేసింది.
న్యుమోనియా అంటే?
ఊపిరితిత్తుల్లోని సూక్ష్మ గాలి సంచులైన, ‘ఆల్వియోలై’ ఇన్‌ఫ్లమేషన్‌కు గురై, ద్రవాలు లేదా చీముతో నిండిపోయే సమస్య ఇది. సాధారణంగా గాలితో నిండి ఉండే ఈ ఈ గాలి సంచులు, ఆక్సిజన్‌ను రక్తప్రవాహంలోకి చేరుస్తూ ఉంటాయి. న్యుమోనియాకు గురైనప్పుడు, ఈ ప్రక్రియకు అవరోధం ఏర్పడి, శరీరానికి ఆక్సిజన్ కొరవడి, శ్వాస ఇబ్బందిగా మారుతుంది. ఈ ఇన్‌ఫెక్షన్ ఒక ఊపిరితిత్తిలోని కొంత భాగానికే పరిమితం కావచ్చు. లేదా మొత్తం ఊపిరితిత్తి లేదా రెండు ఊపిరితిత్తులకూ వ్యాపించవచ్చు.
న్యుమోనియాకు బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ కారణం కావచ్చు. ఆహారం లేదా పొట్టలోని పదార్థాలు, ద్రవాలు ఊపిరితిత్తుల్లోకి చేరుకోవడం వల్ల ‘ఆస్పిరేషన్ న్యుమోనియా’ సోకవచ్చు. ఆస్పత్రుల నుంచి ‘హాస్పిటల్ ఆక్వైర్‌డ్ న్యుమోనియా’ కూడా సోకవచ్చు.
ముప్పు ఎవరికి?
న్యుమోనియా ఎవరికైనా సోకవచ్చు. అయితే 65 ఏళ్లు దాటిన పెద్దలు, ఐదేళ్ల లోపు పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి సోకే న్యుమోనియా తీవ్రమయ్యే ముప్పు ఎక్కువ. అలాగే మధుమేహం, ఉబ్బసం, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మొనరీ డిసీజ్ (సిఒపిడి), గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, కాలేయ వ్యాధులు లేదా క్యాన్సర్ రోగులకు న్యుమోనియా ముప్పు ఎక్కువగా ఉంటుంది. కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న రోగులు, దీర్ఘకాలం పాటు స్టిరాయిడ్స్ వాడుకుంటున్న వాళ్లు, వ్యాధినిరోధకశక్తని తగ్గించే మందులు వాడుకునే వాళ్లలో స్వల్ప శ్వాసకోస ఇన్‌ఫెక్షన్లు కూడా వేగంగా తీవ్రమైపోతాయి. ధూమపానంతో వాయుమార్గాల్లోని మ్యూక్‌సనూ, సూక్ష్మజీవులనూ బయటకు పంపించే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు దెబ్బతిని, ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు పెరుగుతాయి. అలాగే కట్టెలు, బొగ్గు, పేడల నుంచి వెలువడే కాలుష్యం, వాహనాలు, ఫ్యాక్టరీ పొగలతో కూడిన కాలుష్యాలకు బహిర్గతమవడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి.
లక్షణాలను కనిపెట్టి...
ప్రారంభంలో న్యుమోనియా సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను పోలి ఉంటుంది. జ్వరం, వణుకు, దగ్గు, పసుపు లేదా ఆకుపచ్చని కళ్లె, ఛాతీ నొప్పి, దగ్గేటప్పుడు లేదా బలంగా శ్వాస పీల్చుకునేటప్పుడు ఛాతీనొప్పి పెరగడం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, అలసట, ఆకలి కోల్పోవడం ఈ రుగ్మత ప్రధాన లక్షణాలు. అయితే అందర్లోనూ ఇవే లక్షణాలు కనిపించకపోవచ్చు. పెద్దల్లో జ్వరం లేకపోవచ్చు. బదులుగా ఎక్కువగా నిద్రపో వడం, అయోమయానికి లోనవడం, అకస్మాత్తుగా పడిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో... వేగంగా శ్వాస తీసుకోవడం, ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా ఏడ్వడం, పెద వులు నీలంగా మారిపోవడం లాంటి లక్షణాలను గమనించాలి.
సత్వర వ్యాధినిర్థారణ కీలకం
న్యుమోనియాగా అనుమానించినప్పుడు వెంటనే వ్యాధినిర్థారణ పరీక్షలు చేయించి, అసలు కారణాన్ని కనిపెట్టే ప్రయత్నం చేయాలి. అనేక రకాల శ్వాసకోస ఇన్‌ఫెక్షన్లు ఒకే తరహా లక్షణాలను కనబరుస్తాయి. కాబట్టి బ్యాక్టీరియా, వైరస్, ఫంగ్‌సలలో న్యుమోనియాకు సరైన కారణాన్ని కనిపెట్టి దానికి తగిన చికిత్సను అందించాల్సి ఉంటుంది.
పల్మొనాలజి్‌స్టను ఎప్పుడు కలవాలి?
సాధారణ చికిత్సతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అంతకంతకూ పెరుగుతున్నప్పుడు...
ఆక్సిజన్ శాచురేషన్ 94ు కంటే తక్కువకే పరిమితం అవుతున్నప్పుడు..
యాంటిబయాటిక్స్ మొదలుపెట్టిన తర్వాత కూడా 42 - 72 గంటలకు మించి జ్వరం కొనసాగినప్పుడు...
దగ్గు రెండు వారాలకు మించి వేధిస్తున్నప్పుడు..
కళ్లెలో రక్తం కనిపించినప్పుడు...
న్యుమోనియా పదే పదే తిరగబెడుతున్నప్పుడు...
ఉబ్బసం, సిఒపిడి, ఇంటర్‌స్టీషియల్ లంగ్‌డిసీజ్ లేదా ఇతరత్రా తీవ్రమైనశ్వాసకోస సమస్యలున్నప్పుడు..
పెద్దలు, మధుమేహులు, మూత్రపిండాల వ్యాధులున్నవారు, క్యాన్సర్ రోగులు లేదా వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారు పల్మొనాలజిస్టును సంప్రతించాలి.
సమర్థమైన చికిత్సలున్నాయి
రోగి వయసు, ఇన్‌ఫెక్షన్ రకం, వ్యాధి తీవ్రతల ఆధారంగా వైద్యులు సమర్థమైన చికిత్సను ఎంచుకుంటారు. బ్యాక్టీరియా కారక న్యుమోనియాను యాంటీబయాటిక్స్‌తో, వైరస్ కారక న్యుమోనియాకు యాంటీవైరల్ మందులతో చికిత్స చేస్తారు. ఆక్సిజన్ మోతాదులు తగ్గిన వారికి ఆక్సిజన్ థెరపీతో పాటు, అవసరాన్ని బట్టి హైడ్రేషన్ కోసం సెలైన్ వాడవలసి వస్తుంది. జ్వరాన్ని తగ్గించే మందులతో పాటు, పోషకాహారం, పూర్తిగా కోలుకునేవరకూ సరిపడా విశ్రాంతి అవసరమవుతాయి. న్యుమోనియా సోకిన ప్రతి ఒక్కరూ ఆస్పత్రిలో చేరి, చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ మంది వైద్య చికిత్సతో స్వల్ప న్యుమోనియా నుంచి సులభంగానే కోలుకోగలుగుతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులున్నవారు, ఆక్సిజన్ మోతాదులు పడిపోయిన వారు, రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతున్నవాళ్లు లేదా ముందస్తు రుగ్మతలున్నవారు మాత్రమే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవలసి వస్తుంది.
సమర్థమైన చికిత్సలున్నాయి
రోగి వయసు, ఇన్‌ఫెక్షన్ రకం, వ్యాధి తీవ్రతల ఆధారంగా వైద్యులు సమర్థమైన చికిత్సను ఎంచుకుంటారు. బ్యాక్టీరియా కారక న్యుమోనియాను యాంటీబయాటిక్స్‌తో, వైరస్ కారక న్యుమోనియాకు యాంటీవైరల్ మందులతో చికిత్స చేస్తారు. ఆక్సిజన్ మోతాదులు తగ్గిన వారికి ఆక్సిజన్ థెరపీతో పాటు, అవసరాన్ని బట్టి హైడ్రేషన్ కోసం సెలైన్ వాడవలసి వస్తుంది. ఎక్కువ మంది వైద్య చికిత్సతో స్వల్ప న్యుమోనియా నుంచి సులభంగానే కోలుకోగలుగుతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులున్నవారు, ఆక్సిజన్ మోతాదులు పడిపోయిన వారు, రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతున్నవాళ్లు లేదా ముందస్తు రుగ్మతలున్నవారు మాత్రమే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవలసి వస్తుంది.

ఈ వ్యాక్సిన్లతో పరిపూర్ణ రక్ష
న్యూమోకోకల్: పెద్దలు ఏడాదికి రెండు డోసులు, పసికందుల్లో 6, 10, 14 వారాల్లో మొదటి డోసు, 12 నుంచి 18 వారాలకు బూస్టర్ డోసు ఇప్పించాలి. 65 ఏళ్లు పైబడిన పెద్దలు, మధుమేహులు, తీవ్రమైన గుండె జబ్బులు, కాలేయ, మూత్రపిండాల జబ్బులున్నవారు, వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, ధూమపానులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, కీమోథెరపీ చేయించుకున్నవారు ఈ వ్యాక్సీన్ తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇన్‌ఫ్లూయెంజా: పిల్లలకు ఆరు నెలల వయసులో, పెద్దలు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు ఏడాదికోసారి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి.
ఆర్‌ఎ్‌సవి: 50 ఏళ్లు పైబడిన పెద్దలు ఒకసారి ఈ టీకా తీసుకోవాలి. రెస్పిరేటరీ సిన్‌సిషియల్ వైరస్ దీర్ఘకాలిక వ్యాధులున్న పెద్దలను వేధిస్తూ ఉంటుంది. కాబట్టి అర్హులైన పెద్దలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించడం అవసరం.
డాక్టర్ విశ్వేశ్వరన్
సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మొనాలజిస్ట్ అండ్ స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్,
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా