ఆసనంలో అవస్థలు
ABN , Publish Date - May 26 , 2026 | 05:11 AM
ఆరోగ్య సమస్యలకు కచ్చితమైన, సమర్థమైన వైద్యం అందాలంటే, సదరు సమస్యలకు తగిన వైద్యులనే ఎంచుకోవాలి. మరీ ముఖ్యంగా మలద్వారంతో ముడిపడి ఉండే సమస్యలకు...
ప్రొక్టాలజీ
ఆరోగ్య సమస్యలకు కచ్చితమైన, సమర్థమైన వైద్యం అందాలంటే, సదరు సమస్యలకు తగిన వైద్యులనే ఎంచుకోవాలి. మరీ ముఖ్యంగా మలద్వారంతో ముడిపడి ఉండే సమస్యలకు ‘ప్రొక్టాలజిస్ట్’నే ఎంచుకోవాలి. సమస్య మూల కారణాన్ని గుర్తించి, దాన్ని కూకటివేర్లతో పెకిలించే సామర్థ్యం ఈ వైద్యులకు మాత్రమే ఉంటుందనీ, పైల్స్, ఫిషర్స్ మొదలైన రుగ్మతలకు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయనీ ప్రముఖ ప్రొక్టాలజిస్ట్, డాక్టర్ శాంతివర్ధని వివరిస్తున్నారు
నోటి ద్వారా తింటాం, మలద్వారం ద్వారా విసర్జిస్తాం. తినడానికి నోరు ఎంత కీలకమో, విసర్జనకు మలద్వారం కూడా అంతే ముఖ్యం కాబట్టి నోరును ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మలద్వారాన్ని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ప్రదేశం ఎంతో సున్నితమైనది, సంక్లిష్టమైనది. మల పరిమాణాన్ని బట్టి రబ్బరు బ్యాండులా సాగుతూ, మూసుకుపోతూ ఉండే అద్భుతమైన యంత్రాంగాన్ని కలిగిన మలద్వారం, ఎక్కువగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటుంది. దాంతో పైల్స్, ఫిషర్స్ లాంటి సమస్యలు వేధించడం మొదలుపెడతాయి. ఈ సమస్యల కారణాలు, పరిష్కారాల గురించి తెలుసుకుందాం!
మొలలతో ముప్పు
శరీరంలో తయారయ్యే వ్యర్థం ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతూ ఉండాలి. అందుకే రోజంతా పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థమంతా, ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాల రూపంలో బయటకొచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ విసర్జన ప్రక్రియ సహజసిద్ధంగా జరిగినప్పుడు, ఆ రోజంతా ఎలాంటి చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది. ఇలా ఉదయాన్నే సుఖవిరోచనం జరగనప్పుడు ముక్కడం మొదలుపెడతారు. విరోచనమయ్యే సూచనలు లేకున్నా, ఎక్కువసేపు కూర్చుంచిపోతారు. దాంతో లోపలున్న పైల్స్, స్పాంజి బంతుల్లా నెమ్మదిగా బయటకు తోసుకురావడం మొదలుపెడతాయి. ఈ పరిస్థితిలో ప్రెజర్‌తో మలాన్ని విసర్జించే ప్రయత్నం చేసినప్పుడు, మొలలు పగిలిపోతాయి. దాంతో రక్తస్రావం మొదలవుతుంది. బయటకు ఉబ్బినట్టుండే మొలలున్న వాళ్లలో రక్తస్రావం కనిపించకపోవచ్చు. ఇలాంటి మొలల విషయంలో వాటి నుంచి రక్తం బయటకు కారకపోయినా, లోపలే గూడుకట్టుకుపోతుంది. అంతర్గత మొలలతో నొప్పి లేకపోయినా, రక్తస్రావం ఉంటుంది. కానీ బహిర్గత మొలలు రక్తస్రావం లేకపోయినా, నొప్పితో వేధిస్తాయి.
చికిత్స కీలకం
బహిర్గత మొలలను మందులతో తగ్గించగలిగితే రోగికి ఉపశమనం కలుగుతుంది. కానీ రక్తస్రావం అవుతున్న అంతర్గత మొలలకు లేజర్‌తో, స్టాప్లర్‌తో లేదా ఇంజెక్షన్లతో చికిత్స చేయొచ్చ. అయితే పూర్వం మొలలను కత్తిరించి, కుట్టు వేసేవారు. ఇలా చేయడం వల్ల మలద్వారం వదులైపోయి, మలవిసర్జన మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటూ ఉండేది. దాంతో ప్రత్యామ్నాయంగా కొందరు నాటువైద్యులను ఆశ్రయిస్తూ ఉంటారు. మొలలను కత్తిరించకుండా, మలవిసర్జన మీద నియంత్రణ కోల్పోకుండా, మలద్వారం వదులవకుండా, మొలలను వాటి వాటి స్థానాలకు చేర్చే సమర్థమైన చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. 20ు మేర మలవిసర్జన నియంత్రణ, మొలల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాటిని తొలగించని చికిత్సలను అందించే, సంబంధిత రంగంలో శిక్షణ పొందిన ప్రొక్టాలజిస్టులనే ఆశ్రయించాలి
ఫిషర్స్‌తో అసౌకర్యం
నోట్లో ఉండే మ్యూకోసా, మలద్వారం లోపల ఉండే మ్యూకోసా ఒకటే! కాబట్టి నాలుక, పెదవుల లోపల, బుగ్గల్లో పుండ్లు ఎంతగా బాధిస్తాయో, మలద్వారం లోపల తలెత్తే ఫిషర్స్ కూడా అంతే వేధిస్తాయి. ఈ సమస్య విపరీతంగా బాధిస్తుంది కాబట్టి మలవిసర్జనే మానేస్తూ ఉంటారు. దాంతో మలబద్ధకం పెరిగి, ముక్కడం మొదలుపెడతారు. దాంతో మ్యూకోజా చీరుకుపోయి, మంట, నొప్పి వేధిస్తాయి. ఆ సమయంలో కొందరు, నొప్పి తగ్గించే మందులు, సుఖవిరోచన మందులు వాడుకుంటూ తాత్సారం చేస్తూ ఉంటారు. ఫలితంగా అది మానని పుండులా మారిపోయి, దాన్లో మలం పేరుకుపోతూ, ఆ ప్రదేశం మరింత కుళ్లిపోయి సమస్య మరింత జటిలమవుతుంది. సుదీర్ఘ ప్రయాణాలు చేసినప్పుడు, ఆ ప్రదేశంలో ఎక్కువ చమట పట్టినప్పుడు, మధుమేహం బారిన పడ్డప్పుడు... ఆ ఫిషర్ మరింత లోపలకు తొలుచుకుంటూ వెళ్లిపోయి, మలద్వారం పరిసరాల్లో పుండులా, గడ్డలా బహిర్గతమవడం మొదలుపెడుతుంది. అదే ఫిస్టులా!

ఫిస్టులా బాధలు
మల ద్వారం దగ్గర తలెత్తే సెగ్గడ్డలను పోలిన సమస్య ఇది. వీటిని చూసి, వేడి చేసి సెగ్గడ్డ వచ్చిందని అనుకుంటూ ఉంటారు. వీటికి కొందరు గవద పట్టీలు అంటిస్తే, ఇంకొందరు వేడి కాపడం పెట్టడం, స్వయంగా యాంటీబయాటిక్స్ కొని వాడేయడం చేస్తూ ఉంటారు. కానీ మలద్వారం పరిసరాల్లో ఎలాంటి పుండు, సెగ్గడ్డ వచ్చినా, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రారంభంలో గడ్డ లేదా పుండులా కనిపించినా, ఆ తర్వాత దానికి రంథ్రం ఏర్పడి చీము కారడం మొదలుపెడుతుంది. అయితే ఈ ఫిస్టులా వేరు, మల ద్వారం లోపల ఉంటే, దాని కొమ్మలు మలద్వారం పరిసరాల్లో పుండ్ల రూపంలో బయటకు కనిపిస్తాయి. ఈ సమస్యను సమూలంగా నిర్మూలించడం కోసం, కొమ్మలను కత్తిరించడానికి బదులుగా, వేరును పెకిలించాల్సి ఉంటుంది. ఫిస్టులా చికిత్సలో ఏ చిన్న పొరపాటు జరిగినా, మలవిసర్జన మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఫిస్టులా తిరగబెట్టినా ఫర్వాలేదు. దాన్ని చికిత్సతో సరిచేసుకోవచ్చు. కానీ స్ఫింక్టర్లు దెబ్బతిని మలవిసర్జన మీద నియంత్రణ కోల్పోతే, ఆ సమస్యను సరిదిద్దడం కష్టం. కాబట్టి ఫిస్టులా చికిత్సలో భాగంగా మలవిసర్జన నియంత్రణకు తోడ్పడే స్ఫింక్టర్లను చెక్కుచెదరనివ్వని ప్రొక్టాలజిస్టులనే ఆశ్రయించాలి.
నియంత్రణ ఇలా....
పీచు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
క్రమబద్ధమైన ఆహార, జీవనశైలులను ఆశ్రయించాలి
మలబద్ధకం వేధిస్తే, సుఖవిరోచనం మందులను తాత్కాలికంగా వాడుకోవాలి
మలబద్ధక సమస్యకు పూర్తిగా లాక్సేటివ్స్ మీదే ఆధారపడకూడదు
ఆసనాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి
అవాంఛిత రోమాలను తొలగించుకోవాలి
ఆ ప్రదేశంలో ఏ చిన్న అసౌకర్యం వేధిస్తున్నా, ప్రొక్టాలజిస్ట్‌ను సంప్రతించాలి
అజీర్తి లేకుండా చూసుకోవాలి
పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలను చికిత్సతో సరిదిద్దుకున్న తర్వాత కూడా సమతులాహారం తీసుకుంటూ, మలబద్ధకం తలెత్తకుండా జాగ్రత్త పడాలి.
నియంత్రణ కోసం ‘స్ఫింక్టెరాటమీ’
ఎప్పుడూ మలం పరిమాణం ఒకేలా ఉండదు. కాబట్టి అది ఏ పరిమాణంలో ఉన్నా, దానికి తగ్గట్టు మలద్వారం తెరుచుకుంటూ, మూసుకుపోతూ ఉండాలి. కానీ కొందర్లో ఈ సంకోచ వ్యాకోచాల రిఫ్లెక్స్ దెబ్బతింటుంది. ఇలాంటి వారు మలవిసర్జన మీద నియంత్రణ కోల్పోయి, ఫిషర్స్ వేధిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ‘స్ఫింక్టెరాటమీ’ సర్జరీతో సమస్యను పరిష్కరించవచ్చు. అయితే ఈ సర్జరీతో మలవిసర్జన మీద శాశ్వత నియంత్రణ కోల్పోతామనే అపోహలు కూడా కొందర్లో ఉంటున్నాయి. కానీ అంతర్గత స్ఫింక్టర్‌ను కత్తిరిస్తే ఫిషర్ మానిపోతుంది. బహిర్గత ఫిషర్‌ను కత్తిరిస్తే, మలవిసర్జన మీద నియంత్రణ పోతుంది. ఈ రెండు స్ఫింక్టర్లూ పక్కపక్కనే ఉంటాయి. కాబట్టి సరైన స్ఫింక్టర్‌ను ఎంచుకుని, చికిత్స చేయగలిగే సామర్థ్యం కేవలం ప్రొక్టో సర్జన్లకే ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
ప్రొక్టాలజిస్టులే సరైన వైద్యులు
విసర్జక వ్యవస్థ సమస్యల కోసం మహిళలు గైనకాలజిస్టులను, పురుషులు జనరల్ ఫిజీషియన్లనూ సంప్రతిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇలాంటి సమస్యలకు ప్రొక్టాలజిస్టులే తగిన వైద్యులు. ఆసనం సంబంధిత సమస్యలకు చికిత్సను అందించే ప్రొక్టాలజిస్టులు, పైల్స్, ఫిస్టులాలు, ఫిషర్స్, పైలోనైడల్ సైనస్‌లతో పాటు ఫాలిక్యులైటిస్, దురదలు, సెగ్గడ్డలు, ఆనల్ వార్ట్స్ మొదలైన రుగ్మతలకు కూడా సమర్థమైన చికిత్సను అందించగలుగుతారు.
డాక్టర్ శాంతి వర్ధని,
సీనియర్ ప్రొక్టాలజిస్ట్ అండ్ మినిమల్లీ ఇన్వేసివ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు
చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..