నిషిద్ధాలపై నిశ్శబ్ద విప్లవం
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:34 AM
మన దేశంలో మహిళల వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత గురించి బహిరంగంగా మాట్లాడటానికి చాలామంది వెనుకాడుతుంటారు. అలాంటి ఒక సామాజిక నిషిద్ధం అంశాన్ని ధైర్యంగా...
మన దేశంలో మహిళల వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత గురించి బహిరంగంగా మాట్లాడటానికి చాలామంది వెనుకాడుతుంటారు. అలాంటి ఒక సామాజిక నిషిద్ధం అంశాన్ని ధైర్యంగా ఎంచుకుని దానిని కోట్ల రూపాయల సామ్రాజ్యంగా మార్చారు సృజన బగారియా. సమాజం సిగ్గుపడే ఒక తీవ్రమైన సమస్యకు ఆమె ఒక విప్లవాత్మక వ్యాపార పరిష్కారాన్ని కనుగొన్నారు. కేవలం ఒక చిన్న ఐడియాతో మొదలై.. నేడు లక్షల మంది మహిళల ఆరోగ్యానికి రక్షణ కవచంగా నిలిచిన ‘పీ సేఫ్’ బ్రాండ్ వెనుకున్న సృజన ప్రయాణం ఆమె మాటల్లోనే..
నేను పుట్టి పెరిగింది సాంప్రదాయక కుటుంబాలకు నిలయమైన రాజస్థాన్‌లో. మాది ఒక సాధారణ మార్వాడీ కుటుంబం. ఢిల్లీలో ఉన్నత విద్య పూర్తిచేశాక.. అక్కడే స్థిరపడ్డాను. 2013లో నేను, నా భర్త వికాస్ బగారియా కలిసి ఒక సుదీర్ఘ రోడ్ ట్రిప్‌కు వెళ్లాం. హైవేలపై ప్రయాణించేటప్పుడు మహిళలకు ఎదురయ్యే ప్రధాన సమస్య టాయిలెట్స్. ఆ ప్రయాణంలో తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ టాయిలెట్స్ వాడటం వల్ల తీవ్రమైన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారినపడ్డాను. దీని కారణంగా ఆసుపత్రి పాలై నరకం అనుభవించాల్సి వచ్చింది. కోలుకుంటున్న సమయంలో నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. దేశంలో కోట్లాదిమంది మహిళలు ప్రతి రోజు ప్రయాణాల్లో, ఆఫీసుల్లో పబ్లిక్ టాయిలెట్స్ వాడేటప్పుడు ఇలాంటి భయాన్ని, బాధను అనుభవిస్తున్నారు కదా, మరి దీనికి పరిష్కారం లేదా? అన్న ప్రశ్న నన్ను తొలిచేసింది. ఆ కష్టాలను స్వయంగా అనుభవించిన వ్యక్తిగా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే పట్టుదల నాలో ఆ క్షణమే బలంగా నాటుకుంది.
ప్రయోగశాల నుంచి మార్కెట్‌లోకి...
సమస్య ఏంటో నాకు స్పష్టంగా తెలిసింది. కానీ, దానికి ల్యాబ్‌లో పరిష్కారం చూపడం ఎలా అనేదే పెద్ద ప్రశ్నగా నిలిచింది. దీనికోసం వికా్‌సతో కలిసి రాత్రింబవళ్లు రీసెర్స్ చేశాను. కెమికల్ ఫార్ములేషన్స్, వైద్య నిపుణుల సలహాలు తీసుకుంటూ నిరంతరం శ్రమించాం. అలా ఎన్నో ప్రయోగాల తర్వాత కేవలం 10 సెకన్లలో టాయిలెట్ సీట్‌పై ఉండే బ్యాక్టీరియా, వైర్‌సలను చంపే ‘టాయిలెట్ సీట్ శానిటైజర్ స్ర్పే’ని రూపొందించగలిగాం. 2014లో దేశంలోనే మొట్టమొదటి సారిగా ‘పీ సేఫ్’ పేరిట ఈ ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాం.
అవమానాలు... అవహేళనలు
ఉత్పత్తి అయితే సిద్ధమైంది కానీ.. ఆరంభంలో మాకు ఎదురైన సవాళ్లు, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. మన సమాజంలో మహిళల పీరియడ్స్ లేదా వ్యక్తిగత పరిశుభ్రత గురించి మాట్లాడటానికే దుకాణదారులు ముఖం చాటేసేవారు. ‘పీ సేఫ్’ బాటిల్‌ను డిస్‌ప్లేలో పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించలేదు. దీంతో జనాల్లో అవగాహన కల్పించడం కోసం స్వయంగా నేనే రంగంలోకి దిగాను. మాల్స్‌లో ఒక చిన్న స్టాల్ పెట్టుకుని వచ్చిపోయే మహిళలు, పురుషులకు మా ప్రొడక్ట్ గురించి, ఇన్ఫెక్షన్ల ప్రమాదాల గురించి వివరించేదాన్ని. చాలామంది నన్ను చూసి నవ్వుకున్నారు. కొందరు వింతగా చూసి వెళ్లిపోయారు. చదువుకున్న మహిళ ఇలాంటి పనులు చేస్తోందేంటని ఈసడించుకున్నారు.

వైద్యుల మద్దతు
నా పట్టుదల, ఓరల్ మార్కెటింగ్, కస్టమర్ ఎడ్యుకేషన్ వ్యూహాలు మెల్లమెల్లగా ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయి. గైనకాలజిస్టులు ఈ ప్రొడక్ట్ వెనకున్న శాస్త్రీయతను, దాని ప్రాముఖ్యతను గుర్తించారు. యూరినరీ ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ తమ వద్దకు వచ్చే మహిళా పేషెంట్లకు ‘పీ సేఫ్’ వాడమని సిఫార్సు చేయడం ప్రారంభించారు. ఇది మా వ్యాపారానికి పెద్ద టర్నింగ్ పాయింట్. వైద్యుల నమ్మకం తోడవడంతో మహిళల్లో కూడా మెల్లగా మార్పు వచ్చింది. ఒకప్పుడు కవర్లలో దాచి అమ్మిన మా శానిటైజర్ స్ర్పే.. నేడు ప్రతి మహిళ హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంటోంది.
ఉత్పత్తుల విస్తరణ
ఒక్క టాయిలెట్ సీట్ శానిటైజర్ స్ర్పేతో మొదలైన మా ప్రయాణాన్ని అక్కడితో ఆపేయలేదు. మహిళల రోజువారీ జీవితంలో ఎదురయ్యే మరికొన్ని సున్నితమైన సమస్యలపై దృష్టిపెట్టాను. 100 శాతం ఆర్గానిక్ కాటన్ శానిటరీ ప్యాడ్స్, మెన్‌స్ట్రువల్ కప్స్, పీరియడ్ క్రాంప్ రోల్-ఆన్ వంటి ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. ఆ తర్వాత మెటర్నిటీ కేర్, ఫేస్‌కేర్, పురుషుల పర్సనల్ కేర్ ఉత్పత్తుల రంగంలోకి కూడా విస్తరించాం.
అంతర్జాతీయ వేదికపై ‘పీ సేఫ్’
ఒకప్పుడు సున్నా రాబడితో, ఇద్దరితో మొదలైన నా ప్రయాణంలో నేడు వందలాదిమంది భాగస్వాములయ్యారు. ‘పీ సేఫ్’ బ్రాండ్ తన అద్భుతమైన ఎదుగుదలతో అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా నిధులను సమకూర్చుకోగలిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100కుపైగా నగరాల్లో, వేలాది రీటైల్ అవుట్‌లెట్లలో కోట్లాది బాటిళ్ల విక్రయాలతో మా వ్యాపారం దూసుకుపోతోంది. గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, భూటాన్, నేపాల్ వంటి పొరుగు దేశాలకు కూడా మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ అంతర్జాతీయ స్థాయి బ్రాండ్‌గా ఎదిగాం. నేను కేవలం ఒక కార్పొరేట్ బిజినెస్ విమెన్‌గా మిగిలిపోవాలని అనుకోవడం లేదు. మహిళల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తూ, మూఢనమ్మకాలను, సంకోచాలను బద్దలుకొట్టే ఒక మార్పు కోసం నిరంతరం శ్రమిస్తున్నాను.
Also Read:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
For More Latest News