Share News

కూచిపూడి సుస్వరానికి యువ పురస్కారం

ABN , Publish Date - Jun 15 , 2026 | 02:53 AM

కేంద్ర సంగీత నాటక అకాడమీ నుంచి ప్రతిష్ఠాత్మక ‘ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌’ యువ పురస్కారం అందుకోబోతున్నారు యువ సంగీత విద్వాంసురాలు పసుమర్తి పావని. సంప్రదాయ...

కూచిపూడి సుస్వరానికి యువ పురస్కారం

కేంద్ర సంగీత నాటక అకాడమీ నుంచి ప్రతిష్ఠాత్మక ‘ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌’ యువ పురస్కారం అందుకోబోతున్నారు యువ సంగీత విద్వాంసురాలు పసుమర్తి పావని. సంప్రదాయ కూచిపూడి నాట్యానికి, యక్షగానాలకు తన సుస్వరాలతో జీవం పోస్తున్న ఆమెను ‘నవ్య’ పలకరించింది. తన బాల్యం, సంగీత ప్రయాణం, సాధించిన విజయాల గురించి పావని పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..

నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే సంగీతం, నాట్యంతో అనుబంధం ఏర్పడింది. మా తాతగారు, ప్రముఖ యక్షగాన గాయకుడు, కూచిపూడి నాట్యానికి తలమానికమైన పి.వి.జి కృష్ణశర్మ, అలాగే మా నాన్న పసుమర్తి శ్రీనివాసశర్మ వద్ద నేను నృత్యం, సంగీతాల్లో ఓనమాలు నేర్చుకున్నాను. బాల్యంలోనే మా తాతగారితో కలిసి వేదికలపై యక్షగానం చేసే అవకాశం లభించింది. ఆయన వద్దే కర్ణాటక సంగీతంలోని కృతులు, కీర్తనలు అభ్యసించి.. ఆయనతోపాటే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ఆ తర్వాత సంగీతంలో సర్టిఫికెట్‌, డిప్లమో కోర్సులు పూర్తిచేశాను. నాలోని ప్రతిభను మరింత మందికి పరిచయం చేసింది మాత్రం దివంగత నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారే. ఆయన ఆధ్వర్యంలో ఈటీవీలో వచ్చిన ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో నన్ను నేను నిరూపించుకున్నాక ‘సప్తగిరి’, ‘మా టీవీ’ వంటి చానళ్లలో పాడే అవకాశం లభించింది. నా సంగీత ప్రయాణంలో కూచిపూడి నాట్యాచార్యులు పసుమర్తి రత్తయ్యశర్మ వద్ద సంగీతాన్ని, పెన్నరాజు సూర్యారావు వద్ద సంగీతంలో మెళకువలు నేర్చుకున్నాను. తాడేపల్లికి చెందిన ప్రముఖ వయోలిన్‌ విద్వాంసులు బి.వి.దుర్గాభవాని వద్ద కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.


సంగీత దర్శకత్వం

నేను నేర్చుకున్న సంగీతాన్ని కేవలం పాడుకోవడానికే పరిమితం చేయకుండా కూచిపూడి నాట్యాంశాలకు, సామాజిక నృత్యరూపకాలకు సంగీత దర్శకత్వం వహించడం ప్రారంభించాను. శంకర మహదేవన్‌ అకాడమీలో కూడా పనిచేశాను. ఎస్వీబీసీ చానల్‌లో భక్తిరస కీర్తనలు గానం చేశాను. ముఖ్యంగా ‘దశరథ విలాపం’, ‘సత్యభామ ధనుర్ధారణ’ వంటి ప్రసిద్ధ నాటకాలకు బాణీలు సమకూర్చాను. నేను సంగీత దర్శకత్వం వహించిన నృత్య నాటకాల్లో ‘లఖుమా స్వాంతనం’ నాకు ఎంతో పేరుతెచ్చి పెట్టింది. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శుభప్రదం’ సినిమాలో ‘అంబా పరాకు’ అనే పాట పాడుతూ వెండితెరపైనా కనిపించాను.

ప్రొఫెసర్‌గా బాధ్యతలు.. పురస్కారాలు

మూడేళ్లుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సంగీత ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. విద్యార్థులకు కర్ణాటక సంగీతంతోపాటు ఆధునిక, సామాజిక అంశాలకు చెందిన నృత్యరూపకాలకు సంగీత దర్శకత్వం వహించడంపై శిక్షణ ఇస్తున్నాను. నా సేవలకు గుర్తింపుగా నార్త్‌ ఢిల్లీ కల్చరల్‌ అకాడమీ నుంచి ‘రాష్ట్రీయ పురస్కారం’, 2023లో తెలుగు అకాడమీ నుంచి ‘ఉగాది పురస్కారం’ లభించాయి. అలాగే వివిధ సంగీత, సాహిత్య సంస్థల నుంచి మరెన్నో పురస్కారాలు అందుకున్నాను.

6-Navya.jpg

నవ్యతతో నూతన ఒరవడి

మొదట్లో నేను కూచిపూడి నాట్య ప్రదర్శనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేదానిని. కానీ, నా కంఠం బాగుందని, కీర్తనలు గానం చేయమని నా గురువులు ప్రోత్సహించారు. అప్పటి నుంచి సంగీత సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాను. ప్రస్తుతం నేను ‘కూచిపూడి నాట్యంలో సంగీత విశిష్టత’ అంశంపై పీహెచ్‌డీ చేస్తున్నాను. కూచిపూడి నాట్యానికి సంగీతమే ప్రాణం. యక్షగాన సంప్రదాయాలు ఈ నాట్య ప్రదర్శనలకు మొదటి నుంచీ ఆధారంగా ఉన్నాయి. వీటితోపాటు నవ్యతతో కూడిన సుస్వరాలు పలికిస్తూ నేటి యువతకు సంగీతంపై అభిరుచి కలిగేలా సరికొత్త ఒరవడిలో మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తున్నాను. నాకున్న పరిజ్ఞానంతో సంప్రదాయానికి నవ్యతను జోడించడమే నా లక్ష్యం. గురువుల పట్ల గౌరవం, అంకితభావంతోపాటు తగిన సమయం కేటాయించి సాధన చేస్తే లలిత కళల్లో అద్భుతాలు సృష్టించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కారం’ అందుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు చదువు, సంస్కారం నేర్పిన నా గురువులందరికీ ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నాను.

ముదిగొండ శాస్త్రి


చదువు.. వివాహం

కృష్ణా జిల్లాలోని కూచిపూడిలో 10వ తరగతి చదువుకున్న తర్వాత మొవ్వలో ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేశాను. అక్కడ చదువుకునే రోజుల్లో క్షేత్రయ్య పదాలను ఎక్కువగా గానం చేసేదానిని. అనంతరం నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ సంగీతం పూర్తిచేశాను. ఆ తర్వాత ఏపీ గ్రామీణ బ్యాంకు అధికారి ముట్నూరి శివకుమార్‌తో నా వివాహం జరిగింది. భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పెళ్లి తర్వాత కూడా సంగీత, నాట్య ప్రదర్శనలను కొనసాగిస్తూ వస్తున్నాను.

ఇవి కూడా చదవండి..

ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని..

మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు..

Updated Date - Jun 15 , 2026 | 02:53 AM