Share News

అప్పుడు... నా గుండె తరుక్కుపోయింది

ABN , Publish Date - Oct 25 , 2026 | 06:51 AM

వెండితెరపై నటిగా అలరిస్తూనే.. మరోవైపు మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్న పరిణీతి చోప్రా వృత్తిగత, వ్యక్తిగత ప్రయాణంలో ఎదురైన అపూర్వ ఘట్టాల సమాహారం ఇది. రీల్‌ జీవితంలో తల్లి పాత్ర...

అప్పుడు... నా గుండె తరుక్కుపోయింది

వెండితెరపై నటిగా అలరిస్తూనే.. మరోవైపు మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్న పరిణీతి చోప్రా వృత్తిగత, వ్యక్తిగత ప్రయాణంలో ఎదురైన అపూర్వ ఘట్టాల సమాహారం ఇది. రీల్‌ జీవితంలో తల్లి పాత్ర పోషిస్తున్న సమయంలోనే నిజ జీవితంలోనూ తల్లిగా మారడం, భిన్నమైన ఆలోచనలు ఉన్న భాగస్వామితో కలిసి సరికొత్త జీవితాన్ని పంచుకోవడం వంటి ఎన్నో విషయాలను ఇటీవలి టర్వ్యూలో పంచుకుంది.

ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

నా సినీ ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో విచిత్రంగా, మరెంతో అందంగా అనిపిస్తుంది. 2011లో యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ వారి ‘లేడీస్‌ వర్సెస్‌ రిక్కీ బహల్‌’తొ మొదలైన నా నటనా ప్రయాణం ఆ తర్వాత ‘ఇషాక్‌జాదే’, ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’, ‘కేసరి’, ‘అమర్‌సింగ్‌ చమ్‌కీలా’ వంటి చిత్రాలతో నన్ను నటిగా ఎంతో పరిపూర్ణం చేసింది. అయితే కేవలం కెమెరా ముందుకు రావడమే నా ప్రపంచం అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నాకు సంగీతం అంటే ఎనలేని ప్రేమ. నాలోని గాయనిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ‘మానా కే హమ్‌ యార్‌ నహీ’ వంటి పాటలు పాడటం నా అదృష్టం. స్టూడియోలో మైమరచి పాట పాడుతున్న క్షణాల్లో నాలోని అసలైన సంతోషం బయటికి వస్తుంది. సంగీతం నాకు ఒక ధ్యానం లాంటిది, అది నాకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

రాఘవ్‌తో సరికొత్త ప్రయాణం

నటుడిని పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మా ఇంట్లో, నా వ్యక్తిగత జీవితంలో నిరంతరం సినిమాల గురించే చర్చలు జరగడం నాకు అస్సలు నచ్చదు. నా ప్రపంచానికి పూర్తి భిన్నమైన ప్రపంచం ఉన్న వ్యక్తి, సమాజాన్ని వేరే కోణంలో చూసే దృక్పథం ఉన్న భాగస్వామి నా జీవితంలోకి రావాలని కోరుకున్నాను. రాఘవ్‌ చద్దాతో నా పరిచయం ఆ నమ్మకాన్ని నిజం చేసింది. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఆలోచనలు, నా కళాత్మక ఆలోచనలు ఒకచోట కలవడం మా బంధాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. 2023లో మేము వివాహబంధంతో ఒకటయ్యాక, మా ఇద్దరి సంభాషణలు కేవలం వృత్తిపరమైన సరిహద్దులకే పరిమితం కాకుండా జీవితాన్ని లోతుగా అన్వేషించేలా మారాయి. రాజకీయాలు, సామాజిక అంశాలు, పుస్తకాలు, ప్రయాణాల గురించి మేం గంటల తరబడి చర్చించుకుంటాం.


నెట్‌ఫ్లిక్స్‌ మాయాజాలం

నా జీవితంలో గడిచిన కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నెట్‌ఫ్లిక్స్‌ వెనుక ఉండి ఏదో మాయాజాలం నడిపిస్తోందేమో అనిపిస్తుంది! ‘అమర్‌ సింగ్‌ చమ్‌కీలా’ సినిమా సమయంలో నాకు రాఘవ్‌ భర్తగా దొరికారు. ఇక నా మొదటి డిజిటల్‌ సిరీస్‌ ‘షఖ్‌: ట్రస్ట్‌ నో వన్‌’ షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే నా కడుపులో పసి ప్రాణం రూపుదిద్దుకుంటోందనే విషయం తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ షో విడుదలైన సెప్టెంబర్‌ 24వతేదీ సరిగ్గా మా వివాహ వార్షికోత్సవం కావడం నా జీవితంలో మరచిపోలేని ఒక మధురమైన కాంబినేషన్‌! దేవుడు మన జీవితంలో ప్రతీ ఒక్క సంఘటనను ఎంతో అందంగా ముందస్తుగా లిఖిస్తాడనే నమ్మకం ఇప్పుడు మరింత బలపడింది.

నిజ జీవిత భావోద్వేగాలు

‘షఖ్‌: ట్రస్ట్‌ నో వన్‌’ సిరీ్‌సలో నేను అన్విత దత్‌ అనే తల్లి పాత్రను పోషించాను. ఎనిమిది తొమ్మిదేళ్ల క్రితం కిడ్నాప్‌ అయిన తన కూతురి కోసం నిరంతరం అన్వేషించే ఒక తల్లి ఆవేదన ఆ పాత్ర. మొదట్లో నేను తల్లిని కాకముందు ఈ షూటింగ్‌ చేసినప్పుడు, సెట్‌లో ఉన్న నిజమైన తల్లుల అనుభవాలను, డైరెక్టర్‌ రెన్సిల్‌ డిసిల్వా రాసిన స్ర్కిప్ట్‌ను బట్టి ఆ పాత్రలోని బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ మా పండంటి బాబు ‘నీర్‌’ నా జీవితంలోకి వచ్చిన తర్వాత, ఆ పాత్రను తిరిగి ఊహించుకుంటే నా గుండె తరుక్కుపోయింది. ఒక బిడ్డకు దూరమవ్వడం అనే ఆలోచనే ఎంత భయానకంగా ఉంటుందో నాకు నిజమైన తల్లిగా మారిన తర్వాతే పూర్తిగా అర్థమైంది.

మూడు గంటల రోదన

పసితనంలో ఉన్న నా బాబు నీర్‌ను ఇంట్లో వదిలిపెట్టి, తొలిసారి పని నిమిత్తం ముంబైకి విమానంలో వెళ్లాల్సి వచ్చిన రోజును నేను జీవితంలో మర్చిపోలేను. ఇల్లు దాటి ఎయిర్‌పోర్టుకు ఎలా వచ్చానో, ఫ్లైట్‌ ఎలా ఎక్కానో కూడా నాకు గుర్తులేదు. సుమారు మూడు గంటల పాటు విమానంలో ఏడుస్తూనే ఉన్నాను. ఒక బిడ్డను విడిచిపెట్టి దూరంగా వెళ్తున్నప్పుడు తల్లి శరీరంలో, మనసులో కలిగే తీవ్రమైన వేదన అది. ప్రతి తల్లి ఉద్యోగానికి వెళ్లేటప్పుడు సమాజం వేసే ప్రశ్నలు, మనసులో తలెత్తే సంఘర్షణలు ఎంతో భారంగా ఉంటాయి. ఆ సమయంలో భర్త అందించే చిన్న భరోసా ఆ తల్లికి కొండంత బలాన్ని ఇస్తుంది.


10-navya.jpg

మూఢనమ్మకాలపై పోరాటం

భారతదేశంలో మాతృత్వం, గర్భధారణ, ప్రసవానంతర డిప్రెషన్‌ వంటి విషయాలపై మాట్లాడటాన్ని ఇప్పటికీ ఒక పెద్ద పట్టింపుగా లేదా దాచాల్సిన విషయంగా చూస్తారు. అందుకే ఈ విషయాలపై దాపరికాలు లేకుండా బహిరంగంగా చర్చించడానికి ‘మామ్‌ టాక్స్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాను. తల్లి అయిన ప్రతి మహిళ శారీరక, మానసిక క్షోభను అనుభవిస్తుంది. హార్మోన్ల మార్పులు, నిద్రలేని రాత్రుల వల్ల కలిగే అలసటను కేవలం ‘ఆమె విచారంగా ఉంది’ అని తేలికగా కొట్టిపారేయకూడదు. ప్రసవానంతరం మహిళలు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని అధిగమించడానికి బహిరంగ చర్చలు, సరైన కౌన్సెలింగ్‌ ఎంతగానో అవసరం. తల్లికి కుటుంబ సభ్యుల మద్దతు ఎంత అవసరమో చెప్పడమే నా ఈ కొత్త ప్రయత్నం ముఖ్య ఉద్దేశం.

ప్రియాంక పేరు.. అదే వాస్తవం

మా కుటుంబం నుంచి గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన మా పెద్దమ్మ కూతురు ప్రియాంక చోప్రా గురించి చాలామంది అడుగుతుంటారు. ప్రియాంక నాకు కుటుంబ సభ్యురాలు మాత్రమే కాదు.. ఒక మంచి మార్గదర్శకురాలు. అయితే, ఈ పరిశ్రమలోకి వచ్చాక నాకు వచ్చిన విజయాలు లేదా నేను ఎదుర్కొన్న ఫ్లాప్‌ల వెనుక ఆమె సిఫార్సులు లేవనేది వాస్తవం. ప్రియాంక పేరు ఉపయోగించుకుని నా కెరీర్‌ను నిర్మించుకోవాలని నేను ఎప్పుడూ భావించలేదు.

అలా జరిగి ఉంటే నాకు ఇన్ని ఫ్లాప్‌ సినిమాలు ఉండేవి కావు. ఇండస్ట్రీలో నా ప్రయాణం నా స్వయంకృషితోనే సాగింది. మా ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉన్నప్పటికీ.. వృత్తిపరమైన సవాళ్లను మాత్రం నేను స్వయంగా ఎదుర్కొంటూనే ఈ స్థాయికి చేరుకున్నాను.

కొత్త జీవితం.. చెరగని ఆశయాలు

తల్లిగా మారినంత మాత్రాన ఒక మహిళ తన కలలను, వృత్తిపరమైన ఆశయాలను మూలన పడేయాల్సిన అవసరం లేదు. బాధ్యతలను నెరవేరుస్తూనే, మనకు ఇష్టమైన పనిని బ్యాలెన్స్‌ చేయడం సాధ్యమేనని నేను గట్టిగా నమ్ముతున్నాను. రాఘవ్‌ అందించే ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారంతో నేను ఈ రెండు ప్రపంచాలను సమర్థవంతంగా బ్యాలెన్స్‌ చేయగలుగుతున్నాను. నటిగా, గాయనిగా, ఒక బాధ్యతాయుతమైన తల్లిగా నా జీవితంలో ఎదురవుతున్న ప్రతి అనుభవం నన్ను మరింత పరిణతి చెందిన వ్యక్తిగా తీర్చిదిద్దుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయడంతోపాటు నా సంగీత ప్రయాణాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్తాను.

ఈ వార్తలు కూడా చదవండి

జోర్డాన్‌లో చర్చిపై కాల్పులు.. ఏడుగురి మృతి, 40 మందికి గాయాలు

వనాటు దీవుల సమీపంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం..

Updated Date - Oct 25 , 2026 | 06:51 AM